Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

గం‘జాయ్’… గల్లీగల్లీకి విస్తరిస్తున్న మత్తు… మరీ చాక్లెట్లు, బిస్కెట్లలాగా…

October 1, 2024 by M S R

.

గంజాయి.. గల్లి.. గల్లీకి పాకిన మత్తు మందు…ఆన్ లైన్ లో ఆర్డర్  పెట్టినా ఇంటికి వచ్చే సౌలభ్యం ఉంది. ఎందరికో ఉపాధి (అనొచ్చా ) మార్గంగా మారింది. మరెందరికో అత్యంత సులభ సంపాదనకూ దారులు తెరిచింది.

తెలుగు రాష్ట్రాలలో ఏ పాన్ డబ్బావాలానైనా, కిరాణా కొట్టును అడిగినా సరఫరా చేస్తాడు.. లేదా తెచ్చేవాళ్ళనైనా పరిచయం చేస్తాడు. అందుకే జనరేషన్ ఆల్ఫా (14 ఏళ్లలోపు), జనరేషన్ జడ్ (27 ఏళ్లలోపు) అందరూ జోగుతున్నారు.. ఊగుతున్నారు .. బానిసలవుతున్నారు.. జీవితాలు నాశనం చేసుకుంటున్నారు.

Ads

పర్సులు నిండుగా ఉన్నవాళ్ళు పబ్ లకు వెళ్తే ..  జేబులు చిన్నగా ఉన్నవాళ్ళు పరిమితంగా తీసుకుంటూ బక్కచిక్కి పోతున్నారు. 1970 లో వచ్చిన దేవానంద్ సినిమా “హరే రామ  హరే రామకృష్ణ” చూసి జనం నోరెళ్లబెట్టారు. హీరో చెల్లి “దమ్ మా రో దమ్” అని పాడితే .. అబ్బా గంజాయికి ఇంత మత్తు ఉందా అనుకున్నారు. ఆ తర్వాత చిరంజీవి త్రినేత్రుడు (హిందీ రీమేక్) సినిమా గోవా నేపధ్యంలోనే మత్తు ఇతివృత్తంగా సాగుతుంది.

కొన్నాళ్ల కిందట వచ్చిన “ఉడతా  పంజాబ్” సినిమా హిట్.. గాని యవత మీద మత్తు ప్రభావం మూడు పొట్లాలు, ఆరు హుక్కాలుగా పెరిగిందే తప్ప .. మరేదో సినిమాలో ఇంట్లోనే గంజాయి మొక్కలు పెంచుతుంటాడు. ఇలా సినిమాలకి ఇది  మంచి సరకు అయినట్టే మార్కెట్లో కూడా అంతకంతకూ విస్తరిస్తున్నా .. ప్రభుత్వాలు ఏ మాత్రం ఈ దిశగా దృష్టి సారించడం లేదు.

1980ల వరకు కూడా  తెలుగు రాష్ట్రాలలో శ్రావణం మొదలుకుని కార్తీకం వరకు నాలుగు పవిత్ర మాసాలలో ఆదివారం త్రినాధుల (త్రిమూర్తుల) వ్రతాలు చేసేవారు. అందులో ఒక మట్టి ప్రమిదలో చిటికెడు గంజాయి వేసి పూజ అయ్యాక దాన్ని వెలిగించేవారు. (అలా ఎందుకు చేసేవారో నాకు కచ్చితంగా తెలియదు). ఈ చిటికెడు కోసం ఇల్లాళ్ళు వీధుల్లోకి వచ్చే సాధువులకు తృణమో, ఫణమో, గిద్దెడు బియ్యం జోలీలో పోస్తే నంతోషంగా వెళ్ళిపోయేవాళ్ళు. అదే కాలంలో గోవా అనగానే గంజాయి బాగా దొరుకుతుందట అని చెప్పేవారు. ఇప్పుడు గల్లీ.. గల్లీ మే అంతకుమించి.. అంతకన్నా “ముంచే” మత్తు పదార్ధాలు సిగరెట్, చాక్లెట్, టాఫీ, ద్రవ, ఇలా ఈ రూపంలోనైనా దొరుకుతోంది. కొన్నాళ్ళకు మిర్చి బజ్జీల్లా కూడా దొరుకుతుందేమో.

అనవసరంగా ఆఫ్రికా దేశాల నుంచి వచ్చిన వారిని ఏదో నోరు తిరగని పేర్లు చెప్పి ఇరికిస్తాం గాని మనవాళ్లే అందులో ఆరితేరిపోయారు. పాడేరు నుంచి పాట్నా దాకా కూరగాయల మాటున, పాల ట్యాంకర్లలో రవాణా చేయగలరు. హైదరాబాద్  నుంచి విజయవాడ రోజు ఉదయం వచ్చే రైలులో నాంపల్లి లో బెర్తు కింద మూటలు పెట్టి నెంబర్ చెబితే అక్కడ హాయిగా దించుకునేవారు. ఇంత తెలివి ఏ వ్యాపారికి ఉంటుంది.

కృష్ణా ఒడ్డున అయినా, మూసి గట్టు మీద అయినా, మారుమూల పల్లెటూరి హైస్కూల్ కావచ్చు.. హైటెక్ సిటీ పబ్లో అయినా స్థాయిని బట్టి  మత్తు ధరలు, మోతాదులు మారుతుంటాయి.

నిన్న గాక మొన్న యాపిల్ క్యాపిటల్ సిమ్లాలో ఒక రోడ్డు పక్కన యాపిల్ అమ్ముకునే వ్యాపారిని పట్టుకున్నారు. 15 నెలల్లో అతని సంపాదన 2-3 కోట్లని తెల్సి పోలీసులకు నోట మాట రాలేదు. ఈ ఆర్జన అంతా గంజాయి వల్ల వచ్చిందే. అతను నేరుగా ఏ కొను గోలుదారును కలవడు.. ఏ సరఫరాదారుకు తెలియదు. నేరుగా  సొమ్ము ఇతని ఖాతాలో పడదు. పది, పదిహేను ఖాతాలు దాటి చేరుతుంది. పోలీసులు కొన్ని నెలలపాటు శ్రమించి రెక్కి చేసి పట్టుకున్నారు. ఎన్నాళ్ళు జైల్లో ఉంచగలరు. ఇలాంటివి ఒక “మత్తు” తునకలు మాత్రమే. అన్నట్టు హిమాచల్ రాష్ట్రం గంజాయి సాగుని చట్టబద్ధం చేసింది.

ఉత్తరాదిన ఒక విశ్వవిద్యాలయం కూడా మత్తు విద్యాలయంగా పేరు తెచ్చుకున్నది. గుజరాత్ లోని ఓడ రేవుల్లో టన్నుల కొద్ది మత్తు పదార్ధాలు పట్టుబడుతున్నాయి. పరిమితంగా ఉన్న సిబ్బందికి సమాచారం అందో, పొరపాటున జరిగే తనిఖీల్లోను ఇవి  దొరుకుతున్నాయి. మరి మిగతా మార్గాలలో వెళ్లేవి..?

తెలుగు రాష్ట్రాలలో రోజూ ఎక్కడో ఓ చోట గంజాయి మూటలు పట్టుకుంటున్నారు. ఫోటోలు పేపర్లో వచ్చాక.. అవార్డులు, ప్రోత్సా హకాలు.. అయితే మద్యం ధ్వంసం చేసినట్టు, గంజాయిని తగులబెట్టినట్టు ఫోటోలు కనబడవేం. గంజాయి దందా లేకపోతే పోలీసులకు నాలుగో వంతు రాబడి తగ్గిపోతుందనేది ఒక అంచనా.

విజయనగరం  జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ కొంచెం చొరవ చూపి యవతను మత్తు పదార్ధాలకు దూరంగా ఉంచాలని ఒక బృహత్ కార్యక్రమమం చేపట్టారు. స్కూళ్లలో పాఠశాల యాజమాన్య కమిటీలు అనేవి  ఉండేవి. అవి ఇప్పుడు ఏమి చేస్తున్నాయో ఎవరికి తెలియదు. ఇన్ని అనర్ధాలకు హేతువు అవుతున్న గంజాయి, ఇతర మాదక  ద్రవ్యాల మీద సమష్టిగా పొరాడలేమా.. నవతరాన్ని వీటికి  దూరంగా ఉంచలేమా.. ఒక ఉద్యమ రూపం తేలేమా….. హరగోపాలరాజు వునికిలి

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సరిగ్గా కుదరాలే గానీ… బేజా ఫ్రై టేస్టు… ఆరోగ్యానికి బెస్టు… ఇప్పుడిదే ట్రెండు…
  • రెండు శత్రు దేశాల్లోనూ ఒకడే జాతీయ హీరో… ఇంట్రస్టింగ్…
  • ఎస్వీరంగారావు… మెగా ఆర్టిస్టే కాదు… మెగాఫోన్ పట్టాడు, పైసలూ పెట్టాడు…
  • వావ్… రామాయణ్ గ్రాఫిక్ గ్లింప్స్… సింపుల్, జస్ట్, ఓ చిన్న శాంపిల్…
  • దగ్గరలోనే మరో రెండు ఆదిశక్తి పీఠాలు… ఓ విశిష్ట పరిచయం…
  • అంతటి చిరంజీవే మరణిస్తే… తెలుగు ప్రేక్షకులు మెచ్చుతారా..?
  • కామాఖ్యలో కనిపించిన ఓ విశిష్టమైన తంతు… నొప్పి మార్పిడి…
  • స్టార్ల చిన్ననాటి ముచ్చట్లు… జగపతిబాబు టాక్ షో ఆసక్తికరం…
  • సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచన కరెక్ట్… మన స్కూలింగ్ విధానం మారాలి…
  • వాము మంచిదే కానీ జాగ్రత్త, రెచ్చిపోకండి… మసాలా దినుసుల్లో మహారాణి…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions