సాధారణంగా గురుదత్తాత్రేయను విశ్వసించేవాళ్లు అధికంగా ఆశ్రయించేది పారాయణం… గురుదత్త పారాయణాన్ని మించిన పూజ మరొకటి లేదంటారు… ఇప్పుడు తెలుగులో కూడా దొరుకుతోంది… లాభార్జనకు గాకుండా హిందూ ఆధ్యాత్మిక ప్రచారం కోసం పనిచేసే గీతాప్రెస్ తెలుగులోకి లోపరహితంగా అనువదించింది… దేవుళ్లకు సంబంధించిన శ్లోకాలు, మంత్రాల్లో అక్షరదోషాలు ఉంటే అసలుకే మోసం… అందుకని ఒకటినాలుగుసార్లు చెక్ చేస్తారు…
ఆ పుస్తకంలో చెప్పినట్టు ఇంట్లో కూడా పారాయణం చేసేవాళ్లు చాలామంది… పటం, రెండు ఊదుబత్తీలు, నిర్మలమైన మనస్సు, స్పష్టంగా ఉచ్ఛారణ, రోజూ మీకు చేతనైనకాడికి చదువుకోవడం, స్వామికి ఓ దండం పెట్టడం… గా వెళ్తే, బీమా నదిలో స్నానం తరువాత మేడిచెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తారని చెప్పానుగా… ఓ పెద్ద మంటపం, ఆ చెట్టు చుట్టూ కొన్ని వందల చిన్న వేదికలు… అంటే, ఏమీ లేదు, మన రాతబల్లల్లాగా కాస్త ఎత్తులో పుస్తకం పెట్టుకుని చదువుకోవడానికి వీలుగా ఏర్పాట్లు అన్నమాట…
వందల మంది పుస్తకం అక్కడికే తెచ్చుకుని, ఆ చిన్న వేదికలపై పెట్టుకుని పారాయణం చేస్తుంటారు… రోజుల తరబడీ… మరి ఎక్కడుంటారు..? ఆశ్రమాల్లో..! చాలా ఆశ్రమాలున్నయ్ అక్కడ… ఒకప్పుడు ఈ చిన్న ఊరిలో ఏమీ దొరికేది కాదు, ఉండటానికి వసతీ దొరికేది కాదు… ఈ ఆశ్రమాలే ఆశ్రయమిచ్చేవి… ఇప్పుడు కమర్షియాలిటీ పెరిగి, ప్రతి ఆశ్రమం రకరకాల వసతి రేట్లతో లాడ్జింగ్ సంస్థలుగా మారాయి, అదొక విషాదం… గణపతి సచ్చిదానంద ఆశ్రమం రేట్లు చెబుతాను… మనిషి ఒక్కరికి నాన్ఏసీ, వితవుట్ బెడ్స్ గది అయితే 300, విత్ బెడ్స్, విత్ ఫ్యాన్, కామన్ హాల్ అయితే 400, విత్ బెడ్స్, విత్ ఫ్యాన్, ప్రైవేటు రూం అయితే 500… ఏసీ కావాలంటే నలుగురికి సరిపోయే గదికి 3000… కాకపోతే బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఫ్రీ…
Ads
బయట టిఫిన్ల వరకూ వోకే… కానీ కాస్త మంచి భోజనం దొరకదు హాటళ్లలో… కొన్ని హోటళ్లున్నయ్, కానీ థాలి, ఆంధ్రా మీల్స్ అంటే కిందకూ మీదకూ చూస్తారు… నార్త్ ఇండియన్ డిషెస్ దొరుకుతాయి కొన్ని హోటళ్లలో… కానీ రోజూ రెండుపూటలు అవే తినలేం కదా… పైగా రేట్లు మండిపోతుంటాయి హైదరాబాద్ రేంజులో… అందుకని ఆశ్రమాలు వెతుక్కుంటారు చాలామంది… ఇప్పుడు హోటళ్ల దందా చాలా ఎక్కువైంది… కాకపోతే టారిఫ్ సుల్తాన్ బజార్ టైప్… అయిదుగురికి సరిపోయేలా ఉన్న ఓ ఏసీ గదికి ఓ హోటల్ మేనేజర్ 4500 చెప్పి, చివరకు 1700కు ఇచ్చాడు… అర్థమైంది కదా… చిన్న చిన్న హోటళ్లు కూడా బోలెడు… కొంచెం జాగ్రత్తగా బేరమాడుకోవాలి… నిర్వహణ సాదాసీదా…
నదీస్నానం దగ్గర మనకు వైరాగ్యం కలుగుతుంది… ఒకటే ఘాట్… ఏపీ, తెలంగాణల్లో కృష్ణా పుష్కరాల సమయంలో చాలా ఘాట్ల పునరుద్ధరణ, కొత్త ఘాట్ల నిర్మాణం జరిగాయి… ఇక్కడ అవేమీ లేవు… మెట్టుమెట్టుకూ వ్యాపారులు… రకరకాల వత్తులు, దారాలు అమ్ముతారు… నదిలో వదలడానికి కొబ్బరికాయలు వేరు, మేడిచెట్టు దగ్గర కొట్టడానికి కొబ్బరికాయలు వేరు… ఇక్కడా సుల్తాన్‌బజారే… చిల్లర లేవంటారు… చూసీచూసీ మనమే వదిలేసి పోతామనే ఓ చిల్లర ఎత్తుగడ…
అంతా బురదబురద… స్నానాలు చేసే దగ్గర నీళ్లను చూస్తే మునక వేయాలనిపించదు… ఎవరు ప్రచారం ప్రారంభించారో గానీ స్నానాలు చేసి, అక్కడే బట్టలు వదిలేయాలని, చాలామంది బట్టలు అక్కడే వదిలేసి వెళ్తున్నారు… కాకపోతే ఇప్పుడు కాస్త నయం అట, గతంలో స్నానాలకు చాలా కష్టపడాల్సి వచ్చేదట… అసలే చిన్న ఘాట్… పైగా ఓ పడవ వాడు స్నానాలు చేసేవాళ్ల దగ్గరికే తీసుకొచ్చి, తిష్ట వేసి, నదిలో టూర్ వేయిస్తానంటూ పిలుస్తుంటాడు…
ఇక ఆడవాళ్లయితే బట్టలు మార్చుకోవడానికి ఇబ్బంది, రెండు చిన్న చాంబర్లున్నయ్, కానీ నామ్‌కేవాస్తే… ఇక్కడ జాగ్రత్త అవసరం… ఎక్కడెక్కడి నుంచో భక్తులు వ్యయప్రయాసాలకు ఓర్చి వెళ్తుంటారు కాబట్టి ట్రావెలాగ్స్, రివ్యూలు, అనుభవాల వెల్లబోత అవసరమే… (ఇక్కడ ఎటుచూసినా దెయ్యాలు, భూతాలు పట్టినవాళ్లు, మానసికరోగులు కనిపిస్తారనే అతి ప్రచారాన్ని నమ్మకండి… అన్ని గుళ్లలాగే ఇదీ… పైగా కమర్షియల్ బడా దేవుళ్ల గుళ్లకన్నా మంచి మహత్తు కలిగిన గుడిగా ప్రసిద్ధి…) దిగంబరా దిగంబరా… శ్రీపాద వల్లభ దిగంబరా… (మిగతాది చివరి భాగంలో…)
Share this Article