గానుగాపూర్ గుడి దగ్గర సమస్య ఏమిటంటే… కొత్తగా వచ్చినవాళ్లు దేవుడి మీద కాన్సంట్రేట్ చేసి, కళ్లుమూసుకుని, కాసేపు భక్తిగా దండం పెట్టుకునే స్థితి లేకపోవడం…! గుళ్లో అనేకమంది వ్యాపారులు… ఎవరి దందా వాళ్లదే… అరాచకం… హిందూ దేవాలయాల మీద ప్రభుత్వ పెత్తనాలు ఏమిటి..? భక్తుల సొమ్ముతో ఉద్యోగులను మేపడం ఏమిటి..? అక్కడి భక్తులకు, స్థానికులు, ట్రస్టులకే అప్పగించాలనే నా పాత ధోరణికి గానుగాపూర్ ఆలయనిర్వహణ తీరు పెద్ద సవాలే విసిరింది… (జహీరాబాద్ సిద్దివినాయక గుడి దేవాదాయశాఖ పరిధిలో లేదు, ఐనా నిర్వహణ బాగుంది…)
పొరపాటున వర్షం పడితే గుడి పరిసరాలు అడుగుపెట్టేలా ఉండవు… చిత్తడి, చీదర… అనేక ఆవులు అక్కడ తిరుగుతుంటయ్… కనీసం చెప్పులు వదిలే ఏర్పాట్లు లేవు… గుడి మహాద్వారం దాకా వ్యాపారులు… పూజాసామగ్రి అని ముడిపెడతారు… అందులో కొబ్బరికాయ, నాలుగు పూలు, ఏవో ఆకులు, ఇళ్లల్లో చేసుకొచ్చిన తియ్యటి పేలాలు, పేడాలు… కొబ్బరికాయ బయటే కొట్టించాలి, దానికీ సంభావన… టికెట్ ఉండదు… ఆకులు, పూలు ఏం చేసుకోవాలో అర్థం కాదు, అందరూ ఆ చెట్టు మీదకు విసిరేస్తుంటారు…
గుళ్లోనే అనేక మంది పుస్తకాలు అమ్ముతుంటారు… ప్రత్యేకంగా కొందరు వెంటపడతారు… పాదుకల్ని ప్రత్యేకంగా చూపిస్తాం అంటూ బేరాలకు దిగుతారు… 5 వేల నుంచి మొదలై బేరమాడితే 500కూ వస్తారు… నిజం ఏమిటంటే… ఎవరూ ఏమీ ప్రత్యేకంగా చూపించేది ఏమీ ఉండడు… అదొక దందా… పూజాసామగ్రితోపాటు చిన్న యంత్రం, చిన్న బొమ్మను మన బుట్టలో వేస్తారు, మనల్ని బకరాల్ని చేస్తారు… వాటితో చేసేదేమీ ఉండదు… డబ్బులు మాత్రం గుంజుతారు అక్కడే తిరిగే వ్యాపారులు… పేరుకే ట్రస్టు ఉందక్కడ… ఒక గుడి ట్రస్టు ఎలా ఉండకూడదో చెప్పడానికి పెద్ద ఉదాహరణ అది… లోపలే పోలీస్ ఔట్‌పోస్టు… దొంగలతో జాగ్రత్త అంటూ కనీసం 70, 80 బోర్డులున్నయ్… ఇదొక్కటి చాలు కదా అక్కడి దురవస్థ ఏమిటో చెప్పటానికి…
Ads
కొందరు నిర్బంధంగా కర్పూరం, ఖండసార మన పూజాసామాగ్రి బుట్టలో వేస్తారు… దానికీ డబ్బు వసూళ్లు, అడ్డగోలు రేట్లు, గొడవ… కొందరు రిజిష్టర్లు పట్టుకుని అన్నదానానికి చందాలు కట్టాలంటూ వెంటపడుతుంటారు… మీదపడినంత పనిచేస్తారు… కొందరు దండలు వేస్తుంటారు, కొందరు బొట్లు పెడుతుంటారు… ఆర్జితపూజలకు పేరుకే రేట్లు… నిజానికి అక్కడ పూజారులే ఈ పూజలకు రేట్లు మాట్లాడుకుని పల్లకీసేవ, అభిషేకం, పాదుకా అభిషేకం వంటివి నిర్వహిస్తుంటారు, ఇక్కడ సుల్తాన్ బజారే… విచిత్రం ఏమిటంటే కొన్ని ఆశ్రమాల్లో నిర్వాహకులే పాదుకా అభిషేకాలు వంటి పూజల్ని అక్కడే చేసేస్తుంటారు… గుడి ఎదురుగా, ఇరు పక్కలా బోలెడు దుకాణాలు, హోటళ్లు రద్దీ…
గుడిలోనే మీరు కాసేపు కూర్చుంటారు కదా… భయపడకండి నిశ్శబ్దంగా కొన్ని కుక్కలు అటూఇటూ తిరుగుతూ మీ పక్కనే వచ్చి కూర్చుంటయ్… మంత్రాలయం కూడా సిద్ధయోగుల సమాధులే కదా… ఆ సంస్థకు ఓ నిర్వహణాధికారి ఉంటాడు… నిర్వహణ చాలా బాగుంటుంది… బహుశా సింగిల్ పెత్తనమే కారణం కావచ్చు… కర్నాటకలో పెట్రోల్, డీజిల్ రేట్లు తక్కువే కానీ… పంపుల్లో ఏపీ, తెలంగాణ నంబర్లు చూడగానే కొందరు కొన్ని అక్రమాలకు దిగుతున్నారు… జాగ్రత్త… కార్డులు గాకుండా క్యాష్ ఇవ్వండి, రీడింగ్ మధ్యలో ఆపకుండా చూసుకొండి, ఆ అక్రమాల మీద ఇంకాస్త తెలుసుకుని తరువాత చెప్పుకుందాం… సో, కాస్త జాగ్రత్తగా ఉండాలి… అంతే… ఇక గుడిసందర్శన ఫలితం అంటారా..? మన ప్రాప్తం, స్వామి దయ..!!
Share this Article