Jyothi Valaboju……… ఇప్పుడంటే స్వీట్స్ కావాలంటే బోల్డు షాపులు ఉన్నాయి. నా చిన్నప్పుడు ఒకటో రెండో ఉండేవి. అసలు బయట స్వీట్లు కొనడం చాలా తక్కువ. కొంటే గింటే నాంపల్లిలో పుల్లారెడ్డి, కోటిలోని బాంబే హల్వా, లేదంటే సుల్తాన్ బజార్ లో బాలాజి స్వీట్ షాప్. పెళ్లిళ్లైనా, పేరంటాలైనా, పండగలైనా ఏ శుభకార్యమైనా. స్వీట్లన్నీ ఇంట్లో చేయాల్సిందే. అప్పుడు కాటరింగ్ అనే మాట లేదు. వంటవాళ్లని మాట్లాడి ఒకటి రెండు రోజుల ముందు ఇంట్లోనే లేదా హాల్లో స్వీట్లు చేయించేవారు. ఎటువంటి స్వీట్లంటే .. గులాబ్ జామూన్, బూంది లడ్డూలు, బాదుషాలు లాంటివే ఎక్కువగా చేసేవారు.
ఇక బారసాల, సీమంతంలాంటి ఫంక్షన్లకు మాత్రం తప్పనిసరి ఒకటి కాదు రెండు కాదు. యాభై కాదు. వంద, రెండు వందల చొప్పున స్వీట్లు, కారం వస్తువులు చేసి గంపల్లో పెట్టి తీసుకెళ్లేవారు. ఇక తెలంగాణా ప్రాంతంలో ఇంట్లో చేసుకునే స్వీట్లలో గర్జెలు చాలా ముఖ్యమైనవి. దసరా, దీపావళికి కూడా ఇవి తప్పకుండా చేసుకుంటారు. ఇక ఎండాకాలంలో పిల్లలున్న ఇంట్లో ఒకసారి కూర్చుని ఓ యాభై చేసి డబ్బాలో వేసి పెడితే పదీపదిహేను రోజులు నిలవ ఉంటాయి. చివరికి ఆఖరున మిగిలే గర్జెల తునకలు కూడా రుచిగా ఉండేవి. పైన పిండి ఎండిపోయినా లోపల సోగితో కలిపి తినేవాళ్లం చిన్నప్పుడు…
ఇక ఈ గర్జెలు చేయడం కూడా సరదాగా ఉండేది. మైదా, గోధుమపిండి కలిపి లేదా మైదాతో మాత్రమే కూడా చేసుకోవచ్చు. పిండిలో కాస్త నూనె లేదా డాల్డా కరిగించి వేసి చపాతీపిండిలా తడిపి పెట్టుకోవాలి. గర్జెల లోపల పెట్టే సోగి ఎక్కువగా పుట్నాలపప్పు పొడి, తురిమిన ఎండుకొబ్బరి, ఇలాచీ పొడి, ఉంటే కాజు, బాదాం , కిస్మిస్ లు అన్నీ కలిపి పెట్టేవారు.
Ads
అప్పుడప్పుడు కోవాతో చేసేవారు. కోవా గర్జెలు అంటే పిరం అన్నమాట. చేయాలను కున్నప్పుడు కోవ దొరకాలె కదా. దీపావళి పండగకు మాత్రం అమ్మ కోవా గర్జెలే చేసేది. వీటిని చేసి అంచులు కట్ చేయడానికి గిరక ఉంటుంది. నా పెళ్లి సామాన్లలో ఇత్తడి గిరక కూడా ఇచ్చింది అమ్మ.. ఐదారేండ్ల క్రింది అది విరిగిపోతే స్టీల్ ది కొన్నా.. పిల్లలమైన మాకు కూడా సరదాగా ఉండేది. పూరీలు తాల్చుకుని మధ్యలో చెంచాడు సోగి పెట్టి మూసేసి సగానికి మూసేసి, అంచులు వొత్తి గిరకతో కట్ చేయడం, ఆ డిజైన్ చూడడం చాలా చిన్నప్పుడైతే వింతగా ఉండేది.
కట్ చేయగా మిగిలిన ముక్కలు నేను తీస్తా నేను తీస్తా అని పోటీపడేవాళ్లం. తర్వాత గర్జెలు మంచి బంగారు రంగు వచ్చేవరకు కాల్చి ఆరిన తర్వాత డబ్బాలో వేసి పెట్టేవాళ్లు. అస్సలు పాడయ్యేవి కావు. కోవాతో చేసినవి మాత్రం నాలుగైదురోజులు మాత్రమే ఉంటాయి. తర్వాత కోవా పుల్లగా వాసనొస్తుంది. ఇప్పుడు ఎంతమంది ఇంట్లో గర్జెలు చేస్తున్నారో ఏమో. నేను పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు చేసాను, అమ్మాయి సీమంతానికి, పెళ్లి తర్వాత వ్రతం అప్పుడు చేసి తీసుకెళ్లాను. ఇప్పుడైతే తినేవాళ్లు లేరు, నాకు తినే కోరిక పోయింది. గర్జెలు చూడగానే చిన్ననాటి ఎన్నో జ్ఞాపకాలు…
(సారెలో సకినాలతోపాటు గరిజెలు కూడా… కొందరు వడిబియ్యంలో కూడా చిన్న గరిజెలు కలుపుతారు… గతంలో ఒకవైపు చెంచా, మరోవైపు గిరక ఉండే పరికరాలు దొరికేవి… ఇప్పుడు ఏకంగా కజ్జికాయల మేకర్లు దొరుకుతున్నాయి మార్కెట్‌లో…)
Share this Article