ఏమయ్యా గరికపాటీ…? నువ్వు ఏపాటి..? నీ విద్వత్తు ఏపాటి..? ఒక్కసారిగా గట్టిగా చెంపలు వాయించుకో… తప్పు నీదే… తప్పు అంగీకరించడం ఉత్తమ మానవధర్మం… అదీ నువ్వే ఏదో ప్రవచనంలో చెప్పినట్టు గుర్తు…! ఆఫ్టరాల్ నువ్వెంత..? ఓకే, నువ్వు అవధానివి, సహస్రావధానివి… అయితే ఏంటట..? అనేక పురాణాలను, ఆధ్యాత్మిక గ్రంథాలను ఔపోసన పట్టావు… సో వాట్..? వాటిని జీవననైపుణ్యాలకు జతచేసి, వేలాదిమందికి నాలుగు మంచిమాటలు చెబుతుంటావు… అంతే కదా…
14 పుస్తకాలు రాశావు, నీ సాహిత్యంపైనే రెండు పీహెచ్డీలు, రెండు ఎంఫిల్స్… 8 కంప్యూటర్లతో హైటెక్ అవధానం… బోలెడు పురస్కారాలు, స్వర్ణకంకణాలు, కనకాభిషేకాలు… అయితే ఏంటి మాస్టారూ..? నువ్వు ఒక దేవుడిని ఉద్దేశించి, నీ ఫోటో సెషన్ ఆపు, లేకపోతే వెళ్లిపోతా అని బెదిరిస్తావా..? ఆయన ఎవరు..? సాక్షాత్తూ దైవస్వరూపుడు… మహిమాన్వితుడు… అంతటి సాహితీవేత్తవు కదా, నీ వర్ణనలకే అందనంత ఎత్తు ఆయన… అలాంటి వ్యక్తి, అంతటి కరుణాసముద్రుడు, దయామయుడు భక్తజనాన్ని సెల్పీలతో ఆశీర్వదిస్తుంటే, ఆయ్ఁ అడ్డుపడతావా..?
తనకు సందర్భశుద్ధి లేదు, అభిమానులు ఉండనివ్వరు… అసలు తనను పిలవడమే బండారు దత్తాత్రేయ పూర్వజన్మలో చేసుకున్న ఏదో గొప్ప పుణ్యం… నీకేమో అర్థం కాదు… అలాంటప్పుడు పొరపాటున నోరుజారి, చిరంజీవిని హర్ట్ చేసినప్పుడు క్షమించమని నువ్వే అడగాలి కదా… ఆఫ్టరాల్ 30 ఏళ్లు టీచర్ పనిచేసిన ఎంఏ, ఎంఫిల్, పీహెచ్డీ నువ్వు… కానీ చిరంజీవి తనే ఓ ఆచార్య… తన అభిమాన ప్రపంచమే పెద్ద విశ్వవిద్యాలయం…
Ads
దత్తాత్రేయ అయితేనేం, ఇంకొకరు అయితేనేం… చెంపలు వేసుకుని, వచ్చేయాల్సింది… వీలయితే చిరంజీవి చేతులు పట్టుకుని, క్షమించు దేవా అని అడగాల్సింది… ఎందుకు చెబుతున్నాను అంటే… తను సమయోచితుడు… వెంటనే తనే సారీ చెబుతాడు… మా ఇంటికి భోజనానికి రావాలి అంటాడు… దానికే నువ్వు కరిగిపోయి ఉంటావు… కానీ ఒక్కసారి ఈ ట్వీట్ చూడు…
ఏపాటి వాడికైనా చిరంజీవి గారి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయ పడటం పరిపాటే ..
— Naga Babu Konidela (@NagaBabuOffl) October 6, 2022
ఏపాటి వాడికైనా చిరంజీవి గారి ఇమేజ్ చూస్తే ఆపాటి అసూయపడటం పరిపాటే…. ఇది సదరు దేవుడి గారి సోదరుడి వ్యాఖ్య… చిరాకు పడకండి… చిరంజీవి ఇమేజ్‌ను ఎప్పటికప్పుడు కిందికి లాగడమే తన పని… తను ఇప్పటికీ ఈటీవీ జబర్దస్త్ రేంజ్… ఈపాటి ట్వీట్ చూస్తేనే మీకు అర్థం కావాలి కదా… ఇన్ని గ్రంథాల్ని తిని, తాగి జీర్ణం చేసుకున్న నీకు ఫస్ట్ అర్థం కావాల్సిన నిజం ఏమిటంటే…? మన దేశంలో క్రికెటర్లు, సినిమా స్టార్లకు మించిన వాళ్లెవరూ లేరు… ఉండటానికి వీల్లేదు…
ఎవడికి కావాలి నీ విద్వత్తు..? నీ ప్రవచన మహత్తు..? అందరూ దీన్ని ఓ సరదా సన్నివేశమని రాస్తారు గానీ, సీరియస్ ఎపిసోడే… సరదాగానే ఉండిపోయేదేమో … కానీ నాగబాబు అలా ఉంచడు కదా… పీకి పీకి రచ్చ చేస్తాడు కదా…
అవునూ, పాఠకులకు ఓ ప్రశ్న… అలయ్ బలయ్ ప్రతిసారీ దత్తన్న దసరా తరువాత నిర్వహించడం పరిపాటే… ఈ పరిపాటే అనే పదంతో ఈ తాజా వివాదానికి సంబంధం లేదండోయ్… వీహెచ్, చిరంజీవి, గరికపాటి… ఇంకెవరు..? అసలు లేడీ గవర్నర్ కనిపించలేదు… పిలవలేదా..? ఈసారి తన కూతురు పేరిట నిర్వహించడం దేనికి..? తమిళిసై బీజేపీ నేపథ్యాన్ని దత్తన్న గుర్తించదలుచుకోలేదా..? లేక తను కూడా కేసీయార్‌కు కోపం వస్తుందని భావించాడా..? కేరళ గవర్నర్ కూడా వచ్చాడు… కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం నాయకులూ వచ్చారు… ఏమిటో మరి… ఆమె కేరళలో ఉందని ఓ నాయకుడి ఉవాచ… కానీ కేరళ గవర్నరే వచ్చాడు కదా..!!
Share this Article