.
“నీవలన నాకు పుణ్యము;
నావలన నీకు కీరితి”
అని అన్నమయ్య సాక్షాత్తు వెంకన్నకే చెప్పుకున్నాడు. నిజమే వెంకన్న కీర్తి కిరీటంలో అన్నమయ్య కలికి తురాయి. ఇంకెన్ని యుగాలయినా వెంకన్నకు అన్నమయ్యలాంటి పి ఆర్ ఓ దొరకడు.
ఇంకెన్ని యుగాలయినా రక్తమాంసాలతో మనిషిగా పుట్టినవాడెవడూ ఒక జీవితకాలంలో అన్నమయ్య సృష్టించినంత అంతులేని సాహిత్యామృతధార సృష్టించలేడు.
Ads
అటకెక్కిన అన్నమయ్యను రాగిరేకుల మీదినుండి కిందికి దించి, బూజు దులిపి, అక్షరమక్షరం చదివి, సంగీత సాహిత్యాలకు భంగం కలుగకుండా ఎత్తి రాసి లోకానికి ప్రసాదించినవారిలో సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి, రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ, వేటూరి ప్రభాకర శాస్త్రి, గౌరిపెద్ది రామసుబ్బ శర్మ అగ్రగణ్యులు.
రాగిరేకుల్లో ఉన్న అన్నమయ్య సాహిత్యాన్ని తప్పుల్లేకుండా ఎత్తి రాసి… మనకిచ్చిన వీరందరి కృషి కంటే వాటిని పాడి మనకు కర్ణామృతం చేసినవారి కృషి ఇంకా గొప్పది. అన్నమయ్య కీర్తనలనగానే గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గొంతే మన చెవుల్లో ప్రతిధ్వనిస్తుంది.
అయిదు శతాబ్దాల క్రితం అన్నమయ్య ఎలా పాడాడో ఎవరికీ తెలియదు. తెలిసే అవకాశం కూడా లేదు. పదకవితలు, జానపద శైలి అనగానే ఎవరికి తోచినట్లు వారు పాడుకునే స్వేచ్ఛ ఉంటుంది. నిజానికి అన్నమయ్య కోరుకున్నది కూడా అదే. ఎవరికెలా కావాలంటే అలా పాడుకోవచ్చు. ఆయనది కొత్త దారి.
తెలుగులో పదకవితలకు శ్రీకారం చుట్టి… అచ్చ తెలుగులో, మాండలికంలో ఇంతటి మాధుర్యం ఉంటుందా అని భాషాసరస్వతే మైమరచిపోయేలా చేసిన వాగ్గేయకారుడు; వేనవేల ఆధ్యాత్మిక, వేదాంత పారిభాషిక పదాలను, భావనలను కొత్తగా తెలుగులో పుట్టించి తెలుగుజాతికి ఆస్తిగా ఇచ్చినవాడు అన్నమయ్య. ఆ మాటల మాధుర్యం తెలియాలంటే గరిమెళ్ళ పాడిన అన్నమయ్య పదం వినాలి.
సాధారణ వచనంలో కర్త- కర్మ- క్రియ పదాలుంటాయి. సందర్భాన్ని బట్టి, ధ్వనిని బట్టి మనం ప్రశ్నిస్తున్నామో, కోప్పడుతున్నామో, అభ్యర్థిస్తున్నామో తెలిసిపోతుంది. అలాగే కీర్తనల్లో కూడా ఒక ధ్వని ఉంటుంది. ఆనందమో, విషాదమో, అభ్యర్థనో, మైమరపో, ఏడుపో, నవ్వో, వ్యంగ్యమో ఏదో ఒకటి ఉంటుంది.
ఒకానొక రాగంలో, తాళంలో స్వరాల సంగీతంలోకి కీర్తన సాహిత్యాన్ని కూర్చి తప్పుల్లేకుండా పాడవచ్చు. అది సంగీతం లెక్కప్రకారం సరైనదే కావచ్చు. కానీ అన్నమయ్యలాంటి భావప్రధానమైన సాహిత్యం లెక్కప్రకారం మాత్రం సరైనది కాదు. అలా సంగీతాన్ని దాటి సాహిత్యమే ప్రధానమైన అన్నమయ్య హృదయం అర్థం కావాలంటే గరిమెళ్ళ పాడిన అన్నమయ్య పదం వినాలి.
“నారాయణా! నీ నామమె గతి!” అని గరిమెళ్ళ గొంతెత్తగానే మన ముందు అన్నమయ్య పాట పాడుతుంటాడు.
“మునుల తపమునదే! మూల భూతియదె!” అని గరిమెళ్ళ పెదవి పలకగానే మునుల తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమైన వేంకటేశ్వరుడు మనముందు కూడా ఉంటాడు.
“దేవునికి, దేవికిని తెప్పల కొనేటమ్మా!” అని గరిమెళ్ళ పాడగానే మనం కోనేట్లో మునిగి తేలుతూ ఉంటాం.
“జగడపు చనవుల జాజర…” అని గరిమెళ్ళ జాజర పాట అందుకోగానే మనం దోసిట్లో పూలు తీసుకుని వెంకన్నకో, పద్మావతికో పరస్పరం చల్లుకోవడానికి పోటీలుపడి అందిస్తాం.
“పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు…” అని గరిమెళ్ళ అనగానే పెళ్ళి పందిట్లో వెంకన్న- పద్మావతి దోసిళ్ళకు ముత్యాల తలంబ్రాలు అందించేవాళ్ళల్లో మనమూ ఉంటాం.
అలా మనల్ను వెంకన్న ముందు కూర్చోబెట్టడానికి అన్నమయ్య చేసిన చమత్కారం ఏమిటో తెలియాలంటే గరిమెళ్ళ పాడిన అన్నమయ్య పదం వినాలి.
ఒక్కొక్కరిది ఒక్కో శైలి. మిగతావారిని తక్కువ చేయాల్సిన పనిలేదు. కానీ… పండితుల సాహితీ చర్చలకే పరిమితమైన అన్నమయ్యను జనం బాట పట్టించి… సామాన్యుల నాలుకల మీద పాడుకునే పాటగా మలచిన కీర్తిలో మాత్రం గరిమెళ్ళది సింహభాగం.
కొన్ని వందల, వేల కీర్తనలు ఆయన పాడారు. దాదాపు ఆరొందల అన్నమయ్య కీర్తనలను స్వరపరిచారు. ఆంజనేయస్వామి మీద పదులసంఖ్యలో స్వయంగా ఆయనే కీర్తనలు రాసి…స్వరపరచి…పాడారు. సామవేదం షణ్ముఖశర్మ రాసిన అనేక శివపదం కీర్తనలను స్వరపరచి…పాడారు. మోహన రాగం అంటే ఆయనకు అమిత ప్రేమ. మోహన రాగం ప్రత్యేకతమీద ఆయన రాసిన వ్యాఖ్యానం పుస్తకంగా అచ్చయ్యింది.
ఎలాగైనా పాడుకొమ్మని జాతికి తన పదసంపదను అంకితం చేసి వెళ్ళిపోయాడు అన్నమయ్య.
అన్నమయ్య ఎలా పాడి ఉంటాడో అలాగే పాడి…జాతికి తన గళసంపదను అంకితం చేసి…వెళ్ళిపోయారు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్.
ఆయన మనమధ్య లేరు.
ఆయన పాట ఉంది.
అది అదిగో! అల్లదిగో! అని ప్రతిక్షణం మనకు ఏడుకొండలవాడిని పట్టి ఇస్తూనే ఉంటుంది.
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
Share this Article