ది ఎంటిటీ అని అప్పట్లో ఓ భీకరమైన హారర్ సినిమా… థియేటర్లలో దాన్ని చూశాక చాన్నాళ్లపాటు ఒంటరిగా నిద్రపోనివాళ్లు కూడా బోలెడు మంది… అంతకుముందు, ఆ తరువాత కూడా బోలెడు హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి అన్ని భాషల్లోనూ కలిపి… కానీ ఆ హారర్‌ను కూడా కామెడీ చేసిపారేసిన ఘనత మాత్రం మన తెలుగు వాళ్లదే…
హారర్ అనగానే ఓ పాతబడిన బంగ్లా… పేరే భూత్ బంగ్లా… ఏ అడవిలోనో, ఊరవతలో ఉంటుంది… అందులో దెయ్యాలుంటయ్… వాటికి ఫ్లాష్ బ్యాకులుంటయ్… ఏదో పని మీదో, నాన్సెన్స్ దెయ్యాలేమిటి ఈరోజుల్లో అనుకునో కొందరు వెళ్తారు… వాళ్లతో దెయ్యాలు ఆడుకుంటయ్… సౌండ్, సీన్లు, ప్రజెంటేషన్, యాక్టింగుతో థియేటర్లలో ప్రేక్షకులను భయపెట్టడం ఆ సినిమాల టార్గెట్…
మరీ దెయ్యాలంటే మన తెలుగు దర్శకులకు చీప్ అయిపోయాయి… వాటిని కామెడీ కేరక్టర్లను చేసిపారేశారు… దెయ్యాలకు గనుక ఓ సంఘముంటే అర్జెంటుగా ఓ తీర్మానం పాస్ చేసేసి, ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమా దర్శకుడు తుర్లపాటి శివ మీదకు దండెత్తుతాయి… అయితే హారర్ సినిమా తీయాలి, లేదంటే కామెడీ తీయాలి… లేదా రెండింటినీ కన్విన్సింగుగా మిక్స్ చేయాలి… కానీ మరీ ఇది దెయ్యం లాాంటి ప్రయోగం… హారర్‌నే కామెడీ చేసిపారేశారు…
Ads
దెయ్యాలు టీవీలు చూస్తాయి… స్టోరీ డిస్కషన్‌లో పాల్గొంటాయి… షూటింగులో పాల్గొంటాయి… అచ్చం మనుషుల్లాగే… పాత విఠలాచార్య సినిమాల్లోలాగే… వాటిల్లో కూడా అంతే కదా… దెయ్యాలు నానా వేషాలు వేస్తుంటాయి… మనుషుల్లా మారి జగన్మోహినిలాగా కాపురాలు కూడా చేస్తుంటాయి… పోనీ, ఇప్పటి జీతెలుగువాడి త్రినయని సీరియల్ టైపు…
పోనీ, ఆ కామెడీ అయినా వర్కవుట్ అయ్యిందా..? అదీ లేదు… ఓ ఫెయిల్యూర్ సినిమా దర్శకుడు, తనకు ఓ టీం, ఇక బ్యాక్ టు పెవిలియన్ అనుకునే దశలో ఈ భూత్ బంగ్లా షూటింగ్ ఆఫర్ వస్తుంది… ఈ టీం అక్కడికి వెళ్తుంది… అక్కడి నుంచి ఈ సోది కథ స్టార్ట్… ఏదో పిచ్చి కామెడీ… చివరకు క్లైమాక్స్ కూడా అంతే… ప్చ్, ఈ థియేటర్ వచ్చేబదులు ఓ భూత్ బంగ్లా చూసుకుని, ఓ రాత్రి అక్కడ పడుకోవడం మేలు కదాని మీకు అనిపిస్తే మీ తప్పేమీ లేదు…
ఏమాటకామాట… సునీల్ తన యథాపూర్వ స్థితికి వచ్చేశాడు… మందలో ఒక కమెడియన్‌గా కాసింత నవ్వించే ప్రయత్నం చేశాడు… హీరోయిన్ అంజలి పాత్ర నామ్‌కేవాస్తే… వచ్చీపోయే దెయ్యంలాగే… కానీ ఒకడి గురించి చెప్పుకోవాలి.,. కమెడియన్ సత్య పాత్ర నవ్వులు పూయించింది… తను బాగా చేశాడు కూడా… మిగతావాళ్లు… అనగా నటీనటులు, ఎడిటర్, సంగీతదర్శకుడు, సినిమాటోగ్రాఫర్ ఎట్సెట్రా అందరూ ఏదో దెయ్యం పట్టి పడుకున్నట్టుగా… ఏమాత్రం స్పార్క్ లేకుండా పోయారు… ఐనా ఈ దిక్కుమాలిన జానర్‌లో ఇంకెన్నాళ్లు ఉరుకుతారుర భయ్…
Share this Article