Vijayakumar Koduri …. కామ్లిన్ జామెట్రీ బాక్స్ … పాఠశాల రోజులలో, ముఖ్యంగా 6/7 తరగతులలో వున్న రోజులలో ఒక కోరిక నన్ను సుదీర్ఘ కాలం వెంటాడింది. అది – కొత్త క్యామ్లిన్ కంపాస్ (జామెట్రీ) బాక్స్ ను కలిగి ఉండడం
పేరుకు బ్యాగులో ఒక చిన్న నాసిరకం దీర్ఘ చతురస్రాకారపు అల్యూమినియం డబ్బా ఉండేది. అందులో విడి విడిగా కొనుక్కున్న నాసిరకం వృత్త లేఖిని, విభాగిని, కోణ మానిని స్కేలు వగయిరా అన్నీ ఉండేవి. వాటితో గణితం పాఠాలు సాగిపోయేవి గానీ మనసంతా ఈ క్యామ్లిన్ బాక్స్ ను సొంతం చేసుకోవడం మీదే ఉండేది.
విభాగిని, కోణ మానిని ఏమిటి అని అడిగితే మీ పాఠశాల చదువు ఆంగ్ల మాధ్యమంలో జరిగి ఉంటుందని అనుకుంటాను. ఏదైనా పెద్ద స్టేషనరీ షాపుకు వెళ్ళినపుడు అక్కడ ఎవరైనా క్యామ్లిన్ బాక్స్ కొంటూ ఉంటే అట్లా గుడ్లప్పగించి చూస్తూ ఉండేవాడిని. ఇక క్లాసులో ఎవరైనా కొత్త క్యామ్లిన్ బాక్సుతో వస్తే ఆ పూట అంతా ఒకలాంటి అసూయతో రగిలిపోయే వాడిని.
Ads
కొత్త క్యామ్లిన్ బాక్స్ కావాలని అమ్మ ద్వారా నాన్నకు ఎన్ని అర్జీలు పెట్టుకున్నా ‘వాడికి డబ్బుల విలువ తెలుస్తలేదు’ వంటి మాటలే వినిపించేవి. ఇక ఇట్లా లాభం లేదని ఒకసారెప్పుడో రాత్రి అన్నం తినకుండా సత్యాగ్రహం చేసినా, రాత్రి నిద్ర నుండి మేల్కొన్నాక ఉదయం కడుపులో పరుగెత్తే ఎలుకలను పారదోలడానికి సత్యాగ్రహానికి స్వస్తి చెప్పవలసి వచ్చింది
ఎంత సొగసుగా, ఎంత బలిష్టంగా ఉండేది కొత్త క్యామ్లిన్ జామెట్రీ బాక్స్ ! నారింజ, పసుపు రంగుల కలబోతతో ఎంత నాజూగ్గా ఉండేది. లోపల తెల్ల ప్లాస్టిక్ గడులలో జామెట్రీ పరికరాలన్నీ నవనవలాడుతూ ఎంత నాజూగ్గా అమరి ఉండేవి. బాక్సుని చేతుల్లోకి తీసుకుంటే, చేతుల నిండా ఏవో వెలుగు పూలు పూసినట్టు ఉండేది.
నా ప్రాథమిక పాఠశాల రోజులలో నేను భుజాలకు పుస్తకాల బ్యాగు తగిలించుకుని (ఉసూరుమనిపిస్తే బ్యాగు పట్టీని నెత్తికి తగిలించుకుని) వెళ్లే రోజులలో పక్కనే వుండే ఇంగ్లీషు మీడియం వాళ్ళు స్టైల్ గా అల్యూమినియం పెట్టెలు పట్టుకుని వచ్చేవాళ్ళు పెద్దయ్యాక చేతుల్లో బ్రీఫ్ కేసులతో, మెడలకు టై లతో కనిపించే ‘కార్పొరేట్ గయ్స్’ ను చూసినపుడంతా ఆ చిన్నప్పటి ఇంగిలీషు మీడియం బ్యాచు వాళ్ళే గుర్తుకొచ్చే వాళ్ళు చాలా కాలంపాటు!
అప్పుడు కొద్ది కాలం నాక్కూడా స్కూల్ కు అటువంటి బాక్స్ కావాలని ఇంట్లో గొడవ చేసాను గానీ ‘అవి ఇంగ్లీష్ మీడియం వాళ్ళ కోసం’ అని ఇంట్లో సర్ది చెప్పిన గుర్తు. కానీ, పాఠశాల రోజులలో నేను అతిగా ఇష్టపడిన తొలి ప్రేయసి మాత్రం ఈ క్యామ్లిన్ జామెట్రీ బాక్సే !
కొత్త క్యామ్లిన్ బాక్స్ రోడ్డు మీద గానీ, స్కూల్ లో గానీ ఎవరి చేతిలో కనిపించినా ‘ఇది నా సొంతం ఎప్పుడు అవుతుంది?’ అన్న ఒక తెలియని వేదన కమ్ముకునేది. రోజులు కొనసాగుతుండగా, సాగుతుండగా ……
ఎనిమిదవ తరగతిలో వున్నప్పుడు మా వరంగల్ నగరంలో గ్రంథాలయ వారోత్సవాలు జరిగాయి. ఆ సందర్భంలో నగరంలోని శాఖా గ్రంథాలయం వాళ్ళు వ్యాస రచన పోటీ నిర్వహిస్తూ అన్ని పాఠశాలల నుండి విద్యార్థుల పేర్లు అడిగితే మా మహబూబియా హై స్కూల్ నుండి నా పేరు పంపించారు.
పోటీకి ఒక అరగంట / గంట ముందు వ్రాయవలసి అంశం ఏమిటో ప్రకటించేవారు. ‘గ్రంథాలయమే ఆధునిక దేవాలయం’ వంటి టాపిక్ ఏదో ఇచ్చినట్టు జ్ఞాపకం.
అప్పటికే అనేక వ్యాసరచన, వక్తృత్వ పోటీలలో బహుమతులు గెలుకున్న ఆత్మ విశ్వాసం ఒకటి వుంది కాబట్టి రెచ్చిపోయి రాసాను. అటువంటి పోటీలలో బహుమతులు అంటే ఎక్కువగా పుస్తకాలే ఇచ్చేవాళ్ళు కాబట్టి ‘ఏ బహుమతి ఇస్తారో’ అన్న ఉత్సుకత కన్నా ‘ఈ పోటీలో కూడా బహుమతి సాధించాలి’ అన్న ఆలోచనే నడిపించింది.
వారం తరువాత మా పాఠశాలకు సమాచారం వచ్చింది – ‘మీ విద్యార్థికి వ్యాసరచన పోటీలో ప్రథమ బహుమతి వచ్చింది – సాయంత్రం సభకు వచ్చి బహుమతి స్వీకరించమని చెప్పండి’ అని
సభలో బహుమతి అందుకోగానే పెద్ద ఆశ్చర్యం – కొత్త క్యామ్లిన్ జామెట్రీ బాక్స్ ! బిగ్గరగా అరవాలన్నంత సంతోషం! ఆ బహుమతిని అట్లా అపురూపంగా చేతుల్లోకి తీసుకున్నప్పటి ఆ ఉద్విగ్న క్షణాల గురించి ఇన్నేళ్ల తరువాత ఏమని వర్ణించను?
ఇంటికి వెళ్లి మా అమ్మకు గర్వంతో చూపించి అన్నాను -‘ఇన్ని రోజుల నుండి అడుగుతున్నా నాన్న కొనివ్వలేదు. ఇప్పుడు చూడు – నేనే పోటీలో గెలుచుకున్నాను’
రాత్రి ఇంటికి ఆలస్యంగా వచ్చిన నాన్నతో నేను పోటీలో క్యామ్లిన్ బాక్స్ గెలుచుకున్న సంగతిని, ఇన్నాళ్లూ కొనివ్వనందుకు నాన్న మీద నా కోపం అన్నీఅమ్మ వివరంగా చెప్పడం, బదులుగా నాన్న ఏమీ మాట్లాడకుండా నవ్వడం …… పక్క మీద నిద్ర నటిస్తూ వుండిన నా చెవుల్లో పడకుండా ఉంటాయా?
ఇదంతా పాఠశాల రోజుల సంగతి! కాలేజీ రోజుల్లోకి వచ్చాక అనిపించేది – క్యామ్లిన్ జామెట్రీ బాక్స్ నాన్న కొనివ్వలేదు గానీ, నేను ఆ బహుమతిని అందుకున్నానంటే కారణం, నాకు ఆ శక్తిని ఇచ్చిన నాన్నే కదా !
దాదాపు ఐదో తరగతి నుండి, నేను ఎక్కడ వ్యాస రచన, వక్తృత్వ పోటీలలో పాల్గొన్నా నాన్న ముందుగా నాకు శిక్షణ ఇచ్చేవాడు. వ్యాసం అయితే ఉపోద్ఘాతం ఎట్లా ఉండాలి, ముగింపు ఎట్లా ఉండాలి, భాష ఎట్లా ఉండాలి వగయిరా అన్నీ వివరించి చెప్పేవాడు. ఇక వక్తృత్వ పోటీ ఉంటే, అరగంట ముందు టాపిక్ ఇచ్చేవాళ్ళు కాబట్టి, ఏమాత్రం వీలు దొరికినా పోటీ జరిగే ప్రదేశానికి వచ్చి టిప్స్ చెప్పేవాడు. దాదాపు ఏడో తరగతి వరకూ ఈ తర్ఫీదు సాగింది.
అందుకే తరువాత రోజులలో అనిపించేది – నాన్న నాకు క్యామ్లిన్ జామెట్రీ బాక్స్ బహుమతి ఇవ్వకపోయినా, నేను ఆ బహుమతి గెలుచుకునేలా నాన్నే కదా చేసాడూ అని !
Share this Article