నామ- సర్వనామాల రాజ్యాంగ పంచాయతీ… రాజ్యాంగం రాసేప్పుడు అప్పటికి ప్రపంచంలో ఉన్న మెరుగయిన ప్రజాస్వామిక సంవిధానాలన్నిటినీ అధ్యయనం చేశారు. భారత దేశాన్ని, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రాజ్యాంగాన్ని రూపొందించారు. కాలానుగుణంగా మార్పులు చేసుకోవడానికి వెసులుబాటు ఇచ్చారు. మౌలికమయిన రాజ్యాంగ విలువల పరిరక్షణకు బలంగా కట్లు బిగించారు. పాలనా విభాగం, చట్టసభలు, న్యాయవ్యవస్థల పరిమితులను నిర్వచించారు. అదే సమయంలో దేనికి దాని స్వయం ప్రతిపత్తికి భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఒక వ్యవస్థను మరో వ్యవస్థ ఒక కంట కనిపెట్టుకునేలా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ వ్యవస్థను నిర్మించారు.
రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రభుత్వాలు ఏర్పడతాయి. రాజ్యాంగం ఇచ్చిన అధికారాన్నే ప్రభుత్వాలు అనుభవిస్తూ ఉంటాయి. రాజ్యాంగానికి లోబడి నడుచుకుంటున్నట్లు ప్రభుత్వాలు చెప్పుకుంటూ ఉంటాయి. ఆచరణలో రాజ్యాంగ స్ఫూర్తిని ఎంతగా పొదివి పట్టుకున్నామన్నది చర్చనీయాంశం.
భారత న్యాయస్థానాల్లో న్యాయమూర్తులను న్యాయమూర్తులే నియమించుకోవడం విచిత్రంగా ఉందని, ప్రపంచంలో ఇంకెక్కడా ఇలాంటి విధానం లేదని…కేంద్ర ప్రభుత్వంలో పెద్దలు ప్రత్యేకించి న్యాయశాఖ మంత్రి పదే పదే విమర్శిస్తున్నారు. అసహనం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం వాదనే సబబు అని సాక్షాత్తు ఉపరాష్ట్రపతి కూడా వంత పాడుతున్నారు. న్యాయమూర్తుల నియామకానికి కొలీజియం వ్యవస్థ సిఫారసులు మాత్రమే చేస్తుందని…ఆమోదం, తిరస్కరణ రాష్ట్రపతి పరిధిలో అంశమని న్యాయవ్యవస్థ వాదిస్తోంది. సాంకేతికంగా ఉత్తర్వు రాష్ట్రపతి నుండి వచ్చినా ఇందులో కర్త-కర్మ-క్రియ అన్నీ న్యాయమూర్తులదే కదా! ప్రభుత్వానికి ప్రమేయం ఉండకపోతే ఎలా? అన్నది ప్రభుత్వ వాదన.
Ads
తమిళనాడు అసెంబ్లీలో సభను ఉద్దేశించి గవర్నర్ రవి చేసిన ప్రసంగంలో ప్రభుత్వం ఆమోదించిన ప్రతిని కాకుండా…గవర్నర్ సొంతంగా తయారు చేసుకున్న ప్రతిని చదివారని ముఖ్యమంత్రి స్టాలిన్ అదే సభలో అదే గవర్నర్ ముందు నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నిరసనను తెలుపుతుండగానే గవర్నర్ విసురుగా లేచి సభ నుండి వాకౌట్ చేశారు. దీనితో తమిళనాడులో “గెటవుట్ రవి” అని గోడల నిండా నిరసన రాతలు ప్రత్యక్షమయ్యాయి.
“తమిళనాడు ప్రభుత్వం” అని ఉన్న ప్రతిచోట దిస్ గవర్నమెంట్- ఈ ప్రభుత్వం అని సర్వనామం వాడారని, తమిళనాడు పేరును పలకడానికే ఇష్టపడని గవర్నర్ ప్రసంగాన్ని తాము ఆమోదించే ప్రసక్తే లేదని ప్రభుత్వం వీధి కొట్లాటకు దిగింది.
అన్ని పేజీల ప్రసంగంలో మొదట “తమిళనాడు” నామవాచకం వాడి…తరువాత అన్ని చోట్లా “ఈ” అని సర్వనామం వాడి ఉంటే సాంకేతికంగా అది తప్పు కాదు. ఉద్దేశపూర్వకంగా ఎక్కడా తమిళనాడు అని వాడకుండా పరిహరించి ఉంటే మాత్రం తప్పు పట్టాల్సిందే.
ప్రభత్వం ఆమోదించిన ప్రతిని కాకుండా తను దిద్దుకున్న ప్రతిని గవర్నర్ సభలో చదివే సంప్రదాయం లేదన్నది ప్రభుత్వ వాదన.
గవర్నర్ బంగ్లాలో జరిగిన మరో కార్యక్రమంలో కూడా గవర్నర్ ఉద్దేశపూర్వకంగా తమిళనాడు పేరును, సింబల్ ను పక్కన పెట్టారు. దీనికి డిఎంకె గవర్నర్ ను వీధిలోకి లాగినట్లు స్థానిక మీడియా విశ్లేషణ.
సభలో దానికి నిరసన వ్యక్తం చేసే హక్కు ముఖ్యమంత్రికి ఉంది. ఆ మేరకు నిరసన ప్రకటన చదివారు. అక్కడితో వదిలేస్తే హుందాగా ఉండేది. “గెటవుట్ రవి” అని తమిళనాడు నిండా రాత్రికి రాత్రి గోడ రాతలు రాయించడం మాత్రం హుందాగా లేదు. “CM Stalin made him run away” అని ముఖ్యమంత్రి కుమారుడు, నిన్నటిదాకా సినిమా హీరో, ఇప్పుడు మంత్రి ఉదయనిధి బహిరంగంగా ప్రకటించారు. అంటే…సభనుండి గవర్నర్ పరుగెత్తి వెళ్లేలా మా ముఖ్యమంత్రి చేశారు అని గర్వపడుతున్నారు. దీన్నొక భావోద్వేగ అంశంగా మలచుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.
అన్నిటిని రాజ్యాంగం రాసి పెట్టి ఉండకపోవచ్చు. వ్యవస్థల మధ్య ఇలాంటి ఘర్షణ వాతావరణానికి రాజ్యాంగమే అవకాశం కలిగించిందని విపరీత వ్యాఖ్యలు చేసేవారు కూడా బయలుదేరారు. రాసుకున్న దానికంటే పాటించే విలువలే సంప్రదాయాలవుతాయి. వాటిని గౌరవించడం వ్యవస్థల విధి. లేకపోతే నామవాచకం పలకని సర్వనామాలు అత్యున్నత రాజ్యాంగపదవుల్లో విడిగా ఉనికిలేని అవ్యయాలుగా మిగిలిపోయే ప్రమాదముంది. అలా జరిగితే…ఆ అవమానం వ్యవస్థలకే కాదు. అందులో భాగమయిన మనకు కూడా.
-పమిడికాల్వ మాధుసూదన్
madhupamidikalva@gmail.com
Share this Article