.
క్రిష్… పూర్తిగా కొడిగట్టిపోయిందా నీలో క్రియేటివిటీ సరుకు..? అనుష్కా… ఫాఫం… రీఎంట్రీతో నిరాశేనా..? ఘాటి సినిమా చూశాక ప్రేక్షకులకు కలిగే భావనలు ప్రధానంగా ఇవే…
అప్పుడెప్పుడో క్రిష్ బాగానే తీసేవాడు… ఒక గమ్యం, ఒక కంచె, ఒక కృష్ణం వందే జగద్గురుమ్, ఒక శాతకర్ణి… తరువాత కథానాయకుడు, మహానాయకుడు అట్టర్ ఫ్లాప్స్… మణికర్ణిక షూటింగు నుంచే కంగనా తరిమేసింది… హరిహరవీరమల్లు నుంచి పవన్ కల్యాణ్ తరిమేశాడు… ఇప్పుడు ఈ ఘాటి… మరింత వైఫల్యం…
Ads
అనుష్క… ఒకప్పటి అగ్రనటి… అందం, అభినయం… ఇండస్ట్రీ, ప్రేక్షకులు అమితంగా ప్రేమించే పేరు… ఏదో ఓ తలతిక్క సినిమా కోసం ఒళ్లు పెంచిన ఈ యోగాసుందరి తరువాత పూర్తిగా గాడితప్పి చాలా ఏళ్లయింది… కమ్ బ్యాక్ సినిమా పెద్ద అవసరం ఆమెకు… లేకపోతే ఇక తెరమరుగే… ఈ స్థితి ఘాటి తీవ్ర నిరాశ…
ఈ ఘాటి సినిమా శ్రీకాకుళం జిల్లాలోని ఓ విశిష్ట తెగకు సంబంధించి అన్నారు… మరో అరుంధతి, మరో రుద్రమదేవి, మరో భాగమతి మార్క్ పాత్ర అని ఊదరగొట్టారు… ఏదో నార్కొటిక్స్ బోర్డు నోటీసులు అని మరికొంత పబ్లిసిటీ… పెద్దగా ఊడబొడిచే సినిమాలు కూడా లేవు మార్కెట్‌లో… ఈ అనుకూల స్థితిలోనూ ఘాటి గట్టి ఇంపాక్ట్ చూపించే సీన్ కనిపించడం లేదు…
ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలు రెండు… అనుష్క, విక్రమ్ ప్రభు… ఈయన శివాజీ గణేషన్ మనమడు, ప్రభు కొడుకు… పదేళ్లయినా ఈరోజుకూ ఇది నా సినిమా అని చెప్పుకునే సినిమా చేయలేదు… సో, ఫెయిల్యూర్ కేరక్టర్లన్నీ భలే కలిశాయన్నమాట… ఘాటి జాతి కోసం అనుష్క చేసిన పోరాటమే ఈ సినిమా…
అనుష్కను తెరమీద చూస్తేచాలు ప్రేక్షకుడికి ఆనందం… అంతటి స్టార్‌డమ్ ఆమెది.,. కానీ ఈ సినిమాలో ఆమె ప్రభావం అంతంతమాత్రమే… పేరుకు ఆమె సెంట్రిక్ సినిమా అయినా, అసలు ఆ పాత్రకు సరైన ప్రాధాన్యమే లేదు… ఇది క్రిష్ ఫెయిల్యూరే… పూర్ కేరక్టరైజేషన్…
మరోవైపు, విక్రమ్ ప్రభు సినిమా మొదటి భాగంలో చాలా ఎక్కువ స్క్రీన్ టైమ్ పొందాడు.., దాదాపు అతనే ప్రధాన హీరోగా అనిపించాడు… అతనితో ప్రేక్షకులు పెద్దగా కనెక్ట్ కారు…
నిజానికి క్రిష్ వైవిధ్యమైన కథల్ని ఎంచుకుంటాడు… ఈసారీ అంతే, కానీ ఫలించలేదు… టేకాఫ్ సరిగ్గానే ఉన్నా, తరువాత ఏ భావోద్వేగమూ లేక నిస్సారమైపోయింది… విక్రమ్ ప్రభును పెంచి, అనుష్కను తగ్గించడం స్ట్రాటజిక్ బ్లండర్… సినిమాలోని విలన్ పాత్రలు కూడా అంత బలంగా లేవు… చైతన్యరావు పాత్ర అతి…
ఇలాంటి సినిమాలను బాగా ఎలివేట్ చేయాల్సిన బాధ్యత సంగీత దర్శకుడు నాగవల్లి సాగర్‌ది కూడా… పాటలు ఓ లాంఛనం… బీజీఎం పేలవం.,. మొదటి సగమే నిరాసక్తంగా ఉందిరా బాబూ అనుకుంటే, అవే లోపాలు సెకండాఫ్‌లోనూ కొనసాగి, చివరకు క్లైమాక్స్ కూడా అనాసక్తంగా ఉండిపోయి, చివరకు సినిమా నిరాశను మిగిలిస్తుంది…
Share this Article