Bharadwaja Rangavajhala…………. ఘంటసాల మందు పాటలు…. తెలుగు సినిమా పాటల్లో మత్తు పాటలకు ఓ ప్రత్యేకత ఉంది. దేవదాసు సినిమా నుంచి మత్తు పాటలు పాడడంలో ఘంటసాల చాలా పర్ఫెక్ట్ అనే పాపులార్టీ మొదలైంది. తాగుబోతు పాటల్లో వేదాంతాన్ని గుప్పించేవారు మన సినీ కవులు. దేవదాసులో మల్లాది, సముద్రాల…ఆ తర్వాత రోజుల్లో ఆత్రేయ, దాశరధి ఇలా మధుగీతాలను అద్భుతంగా రాశారు. వాటిని ఘంటసాల అంతకన్నా గొప్పగా పాడారు.
ఓ సారి శ్రీశ్రీ గారు ఆరుద్రతో కల్సి… దేవదాసులో కుడిఎడమైతే పాట లో మల్లాది సాహిత్యం మీద చర్చించుకుంటున్నారట. అదీ ఓ రిక్షాలో ప్రయాణిస్తూ. ముఖ్యంగా నీ సిగలో పూలేనోయ్ అనడం వెనుక మల్లాది వారి భావం ఏమైఉంటుందని మాట్లాడుకుంటున్నారు. వీళ్లిద్దరి చర్చా విన్న రాక్షా కార్మికుడు…ఊర్కోండి బాబూ తాగుబోతు పాటలకు అర్ధాలేంటని చిరాకు పడ్డాడట.
జగమే మాయ నుంచీ ప్రారంభించి మందుపాటల్లో చాలా వాటిలో చివరలో ఓ దగ్గు … మధ్యలో ఓ నైరాశ్యం జోడించిన నవ్వు కామను. ఈ రెండినీ అద్భుతంగా పండించేయడం ఘంటసాల అలవాటు.
Ads
ఘంటసాల గానం చేసిన కొన్ని మందు గీతాలను గురించి నేను గుర్తు చేస్తాను. నేను తడమని వాటిని ఎలాగూ మిత్రులు ప్రస్తావిస్తారు కనుక మొత్తం కాటలాగు రడీ అయిపోతుందన్నమాట.
ప్రేమనగర్ చిత్ర ప్రారంభంలో హీరో విమానంలో తాగి ఓ పద్యం పాడతాడు. ఆ తరహా ఓపెనింగ్ సీన్ రాయడం ఆత్రేయ స్పెషాల్టీ. ఆ సీన్ లో వచ్చే పద్యం కోసం కవి కోకిల దువ్వూరి రామిరెడ్డిని వాడుకున్నారు. పద్యాలు పాడడంలో ఘంటసాలకు ప్రత్యేక అభినివేశం ఉండడమే కాదు…ఆ ఏరియాలో ఆయనకు విపరీతమైన పట్టు ఉంది. పైగా సీన్ లో నటిస్తున్నది…అక్కినేని నాగేశ్వర్రావు. వెరసి… అంతము లేని ఈ భువనమంత అద్భుతంగా పేలింది.
ఆ తర్వాత అదే సినిమాలో మనసుగతి ఇంతే … ఎవరి కోసం లాంటి పాటలు మామూలు విజయాన్ని అందుకున్నాయా?
మధుగీతాల్లో రచయిత ఆత్మను క్యారీ చేయడంలో ఘంటసాల చాలా ఎక్స్ పర్ట్. నిర్వేదాన్ని ఆయన అద్భుతంగా పలికిస్తారు. తను పాడబోయే పాట భావాన్ని ఆసాంతం…ఆకళింపు చేసుకునేవారు. ఆ పాడ పాడుతున్న పాత్రలోకి పరకాయప్రవేశం చేసేవారు. అప్పుడు పాటపాడడానికి సిద్దమయ్యేవారు. ఇక రికార్టింగ్ ధియేటర్ లో పాటను అదరగొట్టేసేవారు.
ఘంటసాలలో ప్రత్యేకత ఏమిటంటే…ఆయనకు రంగస్ధలానుభవం ఉంది. ఆ తర్వాత విజయనగరం కళాశాలతో క్షుణ్ణంగా శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారు. ఈ రెండితో పాటు సాహిత్యం మీదా పట్టుంది. స్వయంగా కవి. బహుదూరపు బాటసారి, ఇది సంధ్యా సమయం లాంటి కొన్ని పాటలను ఆయనే రాశారు.
తొలి రోజుల్లో ఆయన పాటలు రాసుకుని పాడే పద్దతీ ఉండేది. అయితే సినిమాల్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ తాపీ ధర్మారావు, సముద్రాల, పింగళి, మల్లాది, శ్రీశ్రీ లాంటి కవులు తగలడంతో ఆయన వారి సాహిత్యాన్ని పాడడానికే సిద్దమయ్యారు. ఈ అన్నీ కలసి ఉండడంతో ఘంటసాల పాడిన పాటల్లో డెప్త్ వచ్చేది. అందుకే ఇన్నేళ్లైనా…అవి మన్ని వెంటాడుతూన్నాయి.
కొందరికి పదవి నిషా… ఇంకొందరికీ…పెదవి నిషా… ఇలా మనిషికి మత్తునిచ్చే అంశాలు చాలా ఉన్నాయని… అలాంటప్పుడు కేవలం మధ్యం తాగేవాళ్లనే తాగుబోతులనడం కుసంస్కారం అవుతుందని వాదిస్తాడు దాశరధి. ఈ విమర్శనాత్మక మధు గీతాన్ని మనుషులు మమతలు సినిమాలో జగ్గయ్య మీద చిత్రీకరించారు డైరక్టర్ ప్రత్యగాత్మ. దీన్ని మన మనసుల్లోకి క్యారీ చేసి రిజిష్టరు చేసేసింది మాత్రం ఘంటసాలే.
ఎన్టీఆర్ కూడా పరువు ప్రతిష్ట, నిండు మనసులు చిత్రాల్లో మధుగీతాల్లో నటించారు. అయితే… ఆయన ఎక్కువగా రాముడు మంచి బాలుడు టైప్ కారక్టర్లు చేయడం వల్ల మందు పాటలు చేసినా… అవి పెద్ద విజయాలు సాధించలేదు. అయితే పరువు ప్రతిష్టలో వచ్చే మందు పాట రాజశ్రీ రాశారు. పెండ్యాల స్వరం కట్టారు. అందులో నాకు ఇష్టమైన లైను …
తాగుతావు ఎందుకంది లోకం …
బతుకుతావు ఎందుకంది హృదయం …
లోకానికి హృదయానికి నా ప్రేమే సమాధానం
అన్నగారు కాస్త అతి చేసినా ఘంటసాల గాత్రం మీదుగా పాట బానే ఉంటుంది.
మందు పాటల విషయంలో అక్కినేని నందమూరిని మించి పోయారు. నిజానికి ఆయన ఎన్టీఆర్ ఎంట్రీ తర్వాత ఆత్మవిమర్శ చేసుకుని ప్రేమ, మందు రూటులో ప్రత్యేక పట్టాలేసుకుని ముందుకు పోయారు. బాపు రమణలు తీసిన బుద్దిమంతుడులో టాటా వీడుకోలు పాట కూడా అర్ధవంతమైన మందు గీతమే. మనసైన పిల్ల కనిపించిన తర్వాత మధుపాత్రకెదలో ఇంక ఏ మాత్రం చోటు లేదనేస్తాడు ఆరుద్ర.
ఆరుద్రకి మందు కవిత్వం రాయడంలో నైపుణ్యం ఉంది…
తాగుచుండే బుడ్డి
తరుగుచుండే కొద్దీ …
మెదడు మేయును గడ్డి
ఓ కూనలమ్మ అని తన కూనలమ్మ పదాల్లో రాసుకున్నారు.
భావ ప్రధాన గీతాలు ఆలపించడంలో ఘంటసాల అనితర సాధ్యుడు. ఘంటసాల పాటలు నేరుగా హృదయాన్ని తాకుతాయి. అందులో అవి మధు గీతాలైతే మరింత భావాత్మకంగా పాడేవారు. మరి వారు మధువు పుచ్చుకునేవారా లేదా అనే విషయంలో నాకు క్లారిటీ లేదు. అది అంత పరిశోదనాత్మక అంశంగా కూడా తోచదు.
పాత్ర అనుభవిస్తున్న నైరాశ్యాన్ని తన స్వరంలో నటుడిని మించిన రీతిలో పలికిస్తారు ఘంటసాల.
మధువు పుట్టింది నాకోసం…
నేను పుట్టింది నీ కోసం….
అంటూ మా ఇంటిదేవతలో దాశరధి కృష్ణమాచార్య ఓ మంచి పాట రాశారు.
రెండు శ్రీలు ధరించి…రెండు పెగ్గులు బిగించి…వెలుగు శబ్ద విరించి…అన్న మహాకవి శ్రీశ్రీ కూడా తెలుగు సినిమాల కోసం… మధుగీతాలు రాశారు. తను రాసిన సినిమా పాటల్లో శ్రీశ్రీకి బాగా నచ్చిన పాట కూడా మధుగీతమే కావడం విశేషం. పంతాలూ పట్టింపులు చిత్రం కోసం రాసిన ఈ పాటలో ఈ బతుకుందే మా సెడ్డ బరువు అనే వాక్యం తనకు ఇష్టమేవారు శ్రీశ్రీ. మా సెడ్డ బరువు అనే మాట చెప్పింది చదలవాడ కుటుంబరావుట.
ఈ బతుకుందే మా సెడ్డ బరువు …
మోసం ఒక్కటే చానా తేలిక..
నిజముందే ఎంతో కరువు …
దానిని దాచు పొదుపుగ వాడు … అవును … నిజం ఇలా సాగుతుంది శ్రీశ్రీ కలం.
దేవదాసు ఇచ్చిన స్ఫూర్తితో కావచ్చు…అక్కినేని నెమ్మదిగా భగ్నహీరో పాత్రల్లో రాణించారు. ప్రజల పల్స్ తెలిసాకే ఉర్దూ సాహిత్యం మీద ఉన్న పట్టుతో కావచ్చు…దాశరథితో ఎక్కువగా మధుగీతాలు రాయించుకునేవారు నిర్మాత దర్శకులు. ఖుషీ, నిషా, మజా లాంటి మత్తైన ఉర్దూ పదాలతో దాశరథి రచన సాగేది. తాతినేని రామారావు డైరక్షన్ లో వచ్చిన అక్కినేని నాగేశ్వర్రావు నటించిన నవరాత్రి లోనూ ఈ తరహా గానం నీ కలం నుంచి వచ్చింది.
నిషాలేని నాడు … హుషారేమి లేదు …
ఖుషీ లేని నాడూ మజా లేనె లేదు …ఇదీ పాట.. ఇందులో ఘంటసాల తాగుబోతు నవ్వు నవ్వుతాడు. అది మాత్రం సూపర్. ఇలాంటి నవ్వే … తెనె మనసులు చిత్రంలో దేవుడు నేనై పుట్టాలి పాటలో కూడా నవ్వుతారాయన.
ఘంటసాల పాడిన మధువు గీతాలన్నిట్లోకీ అగ్రతాంబూలం నిస్సందేహంగా జగమేమాయకే దక్కుతుంది. తాగుబోతులో ఉండే సంఘర్షణ…తిరుగుబాటు తత్వం…ఆ ఫీల్ ను గానంలో క్యారీ చేయగలగాలి గాయకుడు. దేవదాసులో ఘంటసాల జగమేమాయ కోసం నవ్విన నవ్వులు…దగ్గులూ పాపులర్ కావడానికి కారణం ఇదే.
ఘంటసాల పాడిన మందు గీతాల్లో కొన్నిటిని నేను గుర్తు చేసుకున్నాను. మరిన్ని ఉండవచ్చు. అవెవరికైనా గుర్తొస్తే వాటికి సంబంధించిన జ్ఞాపకాలతో ముందుకు వస్తారని ఆశిస్తూ …
స్వస్తి …
Share this Article