Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

లే లే లెలేలే నా రాజా… నరాల్ని సుతారంగా గిచ్చి లేపే పాటగత్తె ఈమె…

February 12, 2023 by Rishi

Bharadwaja Rangavajhala………..  (9052864400)…….  తెలుగుసినిమా పాటల చరిత్రలో ఎల్.ఆర్.ఈశ్వరిది స్పెషల్ పేజ్. ఆంధ్రుల అల్లారు ముద్దుల గాయని ఎల్లార్ ఈశ్వరి అని ఆరోజుల్లో ఆరుద్ర కితాబు ఇచ్చారు కూడా. ఎల్.ఆర్.ఈశ్వరి ఓ తరహా గీతాలకు ప్రసిద్ది. దీనికి పూర్తి విరుద్దమైన ఇమేజ్ ఘంటసాల మాస్టారిది. అయితే విచిత్రంగా ఎల్ఆర్ ఈశ్వరితో జోడీ కట్టి కొన్ని అల్లరి పాటలు కూడా పాడేశారు ఘంటసాల మాస్టారు.


లీల తర్వాత హీరోయిన్లకు సుశీలతోనూ…కాదంటే…జానకితోనో పాడించడం సంగీత దర్శకుల అలవాటుగా ఉండేది. వ్యాంప్ సాంగ్స్ అనగానే ప్రత్యేకమైన హస్కీ వాయిస్ కావాలి కాబట్టి ఎల్.ఆర్.ఈశ్వరిని పిల్చేవారు. అయితే ఎల్.ఆర్.ఈశ్వరి హీరోయిన్లకూ పాడిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా ఘంటసాల తో కలసి పాడిన డ్యూయట్లూ ఉన్నాయి. ఎందుకనో ఈశ్వరితో పాడేప్పుడు మాస్టారు గాత్రం కూడా హుషారుగా పలుకుతుంది. కావాలంటే మీరే వినండి. ఆకులు పోకలు ఇవ్వద్దు నా నోరు ఎర్రగ – భార్యా బిడ్డలు

lreswari
ఘంటసాల, ఎల్.ఆర్ ఈశ్వరి కాంబినేషన్ లో వచ్చిన హిట్ సాంగ్స్ లో అధిక శాతం అక్కినేని అక్కౌంట్లోనే పడడం విశేషం. హీరో హీరోయిన్స్ ఒకరినొకరు టీజ్ చేసుకునే గీతాలు సహజంగా అక్కినేని వారి చిత్రాల్లోనే కనిపిస్తాయి. సరిగ్గా అలాంటి పాటల్లోనే ఘంటసాల, ఈశ్వరి కాంబినేషన్ వర్కౌట్ అవుతుంది. బంగారు గాజులు చిత్రంలోనూ అలాంటి పాటొకటి ఉంది. అక్కినేని భారతి పాల్గొనే నృత్య గీతమది. వేగలేక ఉన్నాను … అనే పాట

Ads


విజయావారి ఉమాచండీగౌరీ శంకరుల కథలోనూ ఈశ్వరి మాత్రమే పాడగలిగే డ్యూయట్ ఒకటి ఉంది. బి.సరోజాదేవి, ఎన్టీఆర్ ల మీద చిత్రీకరణ జరుపుకున్న ఆ యుగళగీతం పింగళి వారి రచన. అటవీ కన్యగా సరోజాదేవికి కావాలనే హస్కీ వాయిస్ ఎల్.ఆర్.ఈశ్వరితో పాడించారు సంగీత దర్శకుడు పెండ్యాల. ఓ సిగ్గులొలికే సింగారిపిల్లా – ఉమా చండీ గౌరీ శంకరుల కధ…

ఎల్.ఆర్.ఈశ్వరి వాయిస్ అంటే సంగీత దర్శకుడు ఎమ్మెస్ విశ్వనాథన్ కు విపరీతమైన ఇష్టం. తమిళ్ లోనూ తెలుగులోనూ అనేక పాటలు పాడించారాయన. శివాజీ గణేశన్ త్రిబుల్ యాక్షన్ చేసిన కోటీశ్వరుడులో చక్కనైన రామచిలుకుంది అనే పాట ఘంటసాల, ఎల్.ఆర్.ఈశ్వరి కల్సి పాడారు. ఇదే పాట తమిళ్ లో సుశీల పాడడం విశేషం.

lreswari
ఎన్.టి.ఆర్ జానపద చిత్రం అగ్గిపిడుగులోనూ ఘంటసాల, ఎల్లార్ ఈశ్వరి పాడిన డ్యూయట్ ఒకటుంది. సి.నారాయణరెడ్డి రాసిన ఈ సరదా గీతాన్ని టి.వి.రాజు తనదైన పద్దతిలో ట్యూన్ చేశారు. ఓ చినదానా…చినదానా అంటూ టీజింగ్ ధోరణిలో సాగే ఈ పాట కూడా చాలా చాలా పెద్ద హిట్.


డైరక్టర్ బాలచందర్ కథతో రూపుదిద్దుకున్న సర్వర్ సుందరం తెలుగులోనూ పెద్ద విజయం సాధించింది. సినిమా వాళ్ల జీవితాల నేపధ్యంలో సాగే కథ కావడంతో సౌందర్ రాజన్ పాట పాడుతున్న దృశ్యాలు ఉంటాయి. ఈ రికార్టింగ్ సందర్భంగా ఆర్కెస్ట్రా కండక్ట్ చేస్తున్న ఎమ్మెస్ విశ్వనాథన్ కూడా కనిపిస్తారు. ఇంతకీ విషయం ఏమిటంటే… డబ్బింగ్ వర్షన్ లో సౌందర్ రాజన్ కు ఘంటసాల ప్లేబ్యాక్ పాడడం. ఆ పాటలో ఘంటసాలతో ఎల్.ఆర్.ఈశ్వరి గొంతు కలిపారు.


అరవై దశకంలో హిట్ ట్రయో ఒకటి తెలుగు మాస్ సినిమా సంగీతాన్ని ఏలింది. సత్యం సంగీతం… ఆరుద్ర రచన… ఎల్.ఆర్.ఈశ్వరి గానం… ఈ ముగ్గురి కాంబినేషన్ లో అనేక క్లబ్బు సాంగ్స్ అలనాటి యూత్ ను ఉర్రూతలూపాయి. ఘంటసాల మాస్టారు కూడా సత్యం తరహా గీతాన్ని కంపోజ్ చేయాల్సి వచ్చింది. బాబూరావ్ డైరక్ట్ చేసిన జరిగిన కథ చిత్రంలో లవ్ లవ్ లవ్ మీ నెరజాణా అనే పాటను స్వీయ సంగీత దర్శకత్వంలో ఈశ్వరితో కల్సి పాడారు ఘంటసాల.


విజయ్ భట్ ప్రొడక్షన్స్ వారి భలే రంగడులోనూ ఎల్.ఈశ్వరి, ఘంటసాల కాంబినేషన్ లో ఓ సూపర్ మాస్ సాంగ్ ఉంటుంది. కొసరాజు రాఘవయ్య కలం నుంచి వచ్చిన ఆ గీతాన్ని కె.వి.మహదేవన్ స్వరపరిచారు. బావను అల్లరి పట్టించే మరదలు ఎంత ఉత్సాహంగా ఉంటుందో… అదంతా తన స్వరంలో పలికించింది ఈశ్వరి. తాను కూడా ఈశ్వరికి ఏ మాత్రం తీసిపోని రేంజ్ లో పాడేశారు ఘంటసాల.


తెలుగులో వచ్చిన ముద్దుపాటల్లో అందరికీ ఠక్కున గుర్తొచ్చేది ముద్దంటే చేదా… నీకా ఉద్దేశ్యం లేదా అనే పాట. అయితే అంతకన్నా హుషారైన పాట ఇంకోటి ఉంది. సిపాయి చిన్నయ్య చిత్రం కోసం ఎమ్మెస్ విశ్వనాథన్ స్వరపరిచిన గీతం అది. ఆరుద్ర సాహిత్యం. విశ్వనాథన్ ఎటూ ఎల్.ఆర్.ఈశ్వరికే పెద్ద పీట వేసేవారు. ఇక అదర్ సైడ్ అక్కినేని కాబట్టి ఘంటసాలతో స్వరం కలిపించారు.

ఘంటసాల మాస్టారంటే ఎల్.ఆర్.ఈశ్వరికి చాలా అభిమానం. గౌరవం. చాలా ఇంటర్యూల్లో ఘంటసాలతో తను పాడినప్పటి విషయాలను ప్రస్తావించారావిడ. ఈ కాంబినేషన్ లో వచ్చిన పాటలన్నిటిలోకీ టాప్ సాంగ్ ప్రేమనగర్ లో ఉంది. ఆత్రేయ రచించిన ఆ గీతం అప్పటికీ ఇప్పటికీ మాస్ మనసుల్ని కొల్లగొడుతూనే ఉంది. లేలేలే నారాజా అంటూ సాగే ఆ పాటలో ఘంటసాల గాత్రం మత్తుగా స్టైలిష్ గా సాగుతుంది…  (ఘంటసాల వర్ధంతి సందర్బంగా )

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!
  • పాకిస్థాన్‌కు కుడిఎడమల వాయింపు… చైనా అమ్మిన సరుకు తుస్సు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions