.
ఆమె సినీరంగ ప్రవేశం పెద్ద వార్తేమీ కాదు… కానీ మరీ ఆ గత వైభవ దర్శకుడి ద్వారా లాంచ్ అవుతుందనేదే అసలు చర్చనీయాంశం… విషయం ఏమిటంటే..?
హీరో ఘట్టమనేని కృష్ణ మనమరాలు, అంటే తన పెద్ద కొడుకు రమేష్ బాబు బిడ్డ భారతి సినిమాల్లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోందట… తెలియని మొహమేమీ కాదు… మహేష్ బాబు బిడ్డ సితార వీడియోల్లో తరచూ కనిపిస్తుంటుంది…
Ads
అప్పట్లో కృష్ణ బిడ్డ మంజుల సినిమాల్లోకి రావడానికి ప్రయత్నిస్తే… ఫ్యాన్స్ అస్సలు సహించలేదు, వద్దన్నారు… కృష్ణ కూడా వెనక్కి తగ్గాడు… ఆమె తరువాత కొన్నాళ్లకు ఒకటీరెండు సినిమాలేవో చేసినట్టుంది తమిళం, మలయాళం భాషల్లో… మొత్తానికి ఇండస్ట్రీలో ఓ తారగా కుదురుకోలేదు…
కానీ ఇప్పుడు రోజులు మారాయి… నటుల వారసత్వాన్ని ఆడపిల్లలు కూడా అందిపుచ్చుకుంటున్నారు… అందరిలాగే వాళ్లూ… ఉదాహరణకు నీహారిక..! మహేష్ బాబు బిడ్డ సితార కెరీర్ కూడా ఇండస్ట్రీలోనే ఉండబోతోంది…
రమేష్ బాబు సినిమాల్లో సక్సెస్ కాలేదు, కృష్ణ ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు… ఇప్పుడాయన లేడు… తన పిల్లల్లో అబ్బాయి జయకృష్ణను త్వరలో హీరోగా లాంచ్ చేయాలని ఓ ప్రయత్నం… మహేష్ బాబు కూడా ప్రోత్సహిస్తున్నాడని వార్తలు…
ఆర్ఎక్స్ 100 సినిమాతో హిట్ కొట్టిన అజయ్ భూపతి ఈ జయకృష్ణను టాలీవుడ్ కు పరిచయం చేస్తున్నాడని ఓ టాక్… హీరోయిన్ ఎవరో తెలియదు గానీ ఈలోపు జయకృష్ణ సోదరి భారతి సినీరంగ ప్రవేశం వార్తలు మొదలయ్యాయి… ఫోటోజెనిక్… లుక్కు బాగుంది…
గుంటూరుకారం సినిమాలోని కుర్చీ మడతపెట్టి పాటకు డాన్స్ చేస్తూ ఈమధ్య తను ఇన్‌స్టాలో పెట్టిన వీడియో వైరల్ అయ్యింది… హీరోయిన్‌గా నేను ఫిట్ అని చెప్పుకోవడానికి ఆ వీడియో చేసినట్టుగా ఉంది… ఇంతకీ ఆమెను లాంచ్ చేసే ఆ దర్శకుడు ఎవరట..?
తేజ..! ఒకప్పుడు తను పెద్ద దర్శకుడు… చాన్నాళ్లుగా తను సక్సెస్ బాటలో లేడు… గత 20 ఏళ్లలో ‘నేనే రాజు నేనే మంత్రి’ అనే ఓ మోస్తరు సినిమా తప్ప వేరే సక్సెస్ సినిమా లేదు తన కెరీర్‌లో… నిర్మాత, రచయిత, దర్శకుడిగా బహుపాత్రాభినయం చేసినా సరే…
తన కొడుకు అమితోవ్‌ను లాంచ్ చేయడానికి ఏదో పిరియాడికల్ లవ్ స్టోరీ ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు… అదుగో తన పక్కన హీరోయిన్‌గా భారతి నటిస్తుందట… సినిమారంగం పూర్తిగా సెంటిమెంట్ బేస్డ్… ఏళ్లుగా ఒక్క హిట్టూ లేని దర్శకుడి ద్వారా అరంగేట్రం ఇప్పించడానికి మహేష్ బాబు అంగీకరిస్తాడా..? ఏమో, డౌటే..!!
అన్నట్టు కృష్ణ బిడ్డ ఇందిరా ప్రియదర్శిని, సుధీర్ బాబుల కొడుకు చరిత్ మానస్ కూడా హీరోగా లాంచ్ అవుతున్నాడట… ఆ వివరాలు పెద్దగా బయటకు రాలేదు… మొత్తానికి కృష్ణ ప్రపంచం మొత్తం సినిమాలే… కుటుంబం కూడా అదే బాటలో… ఆయన మనమడు, పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ కొడుకు అశోక్ కూడా సినిమాల్లోకి వచ్చాడు కదా…!! సుధీర్ బాబు సరేసరి..!!
Share this Article