.
నిజానికి రామోజీ ఫిలిమ్ సిటీ మీద సీనియర్ బాలీవుడ్ నటి కాజోల్ చేసిన వ్యాఖ్య మామూలుది కాదు… తను, తన భర్త, అనుభవం, పరపతి వల్ల ఆమె బాలీవుడ్లో ఎవరూ ఇగ్నోర్ చేయలేని కేరక్టర్…
ఏమన్నది..? రామోజీ ఫిలిమ్ సిటీలో నెగెటివ్ వైబ్స్ వెంటాడాయి, ఎప్పుడు బయటపడతానురా బాబూ అని భయపడాల్సి వచ్చింది… థాంక్ గాడ్, బయటపడ్డాను అంటోంది… మామూలు వ్యాఖ్య కాదు… ఇకపై తారలు రామోజీ ఫిలిమ్ సిటీకి రావడానికి భయపడే పరిణామం…
Ads
అసలే రామోజీరావు కలలుకన్న ఫిలిమ్ సిటీ వేరు… ప్రస్తుతం ఏదో ఓ మోస్తరుగా నడుస్తోంది… కావచ్చు, ప్రణాళిక, ఆచరణ వైఫల్యాలు కారణాలు కావచ్చు… కానీ ‘మోస్ట్ హాంటెడ్ ఏరియా’ అని కాజోల్ చేసిన వ్యాఖ్యల ప్రభావం బలంగానే ఉండనుంది…
అల్లాటప్పాగా కాదు, భ్రమల్లో పడి కాదు.., నిజంగానే ఆమె సఫర్ అయిఉండవచ్చు… లేకపోతే గిన్నీస్ బుక్కులోకి ఎక్కిన ఓ ఫిలిమ్ సిటీ మీద వ్యాఖ్యలు చేసేంత మూర్ఖురాలు కాదు ఆమె… మరో ఉదాహరణ చూద్దాం…
రామోజీరావుకు దేవుడంటే నమ్మకం లేదు, కానీ కీరవాణి మాత్రం దేవుళ్ల ఫోటోల పక్కన రామోజీరావు ఫోటో పెట్టి పూజిస్తాడు… తను కావాలని నెగెటివ్‌గా వ్యాఖ్యలు చేయడు కదా… తనే చెప్పాడు ఓసారి…
‘‘చంద్రముఖి 2 టైంలో ఓ ఘటన జరిగింది… రామోజీ ఫిల్మ్ సిటీలోని సింఫనీ రూంలో ఫీమేల్ సింగర్లు అంతా పాటలు పాడుతున్నారు…. అయితే ఆ టైంలో వారి చెవుల్లో ఏవో వింత శబ్దాలు వినిపించేవి. ఎవరో వచ్చి తాకినట్టుగా అనిపిస్తుండేది. ఆ సింగర్లంతా వచ్చి నాతో ఆ మాటలు చెప్పారు’’
కీరవాణి అయితే జన్మలో రామోజీరావు ఫిలిమ్ సిటీకి వ్యతిరేకంగా ఉద్దేశపూర్వకంగా మాట్లాడడు కదా… రవిబాబుకూ ఇదే అనుభవం… దాంతోనే అవును అనే సినిమా తీశాడు… ప్రత్యేకించి అదేదో గది గురించి రాశీ ఖన్నా , నుస్రత్ కూడా ఇదే విషయాన్ని ప్రస్థావించారట…
రాశీ ఖన్నాకి అయితే ఓ డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్ అయిందట. రూంలో ఎవరో ఉన్నట్టుగా.. బెడ్డుని షేక్ చేస్తున్నట్టుగా.. దుప్పట్లు లాగుతున్నట్టుగా అనిపించేదట… బాలీవుడ్ నటి నుస్రత్‌కి అయితే మరో వింత అనుభవం ఎదురైంది… తాను ప్యాక్ చేసుకుని పెట్టుకున్న డ్రెస్సులన్నీ చెల్లాచెదురుగా పడి ఉండేవట… ఫుడ్ కూడా ఎవరో సగం తిని వదిలేసినట్టుగా అనిపించేదట…
సరే, ఎవరి అనుభవాలు వాళ్లవి… కానీ కాజోల్ వ్యాఖ్యల ప్రభావం బాగానే పడుతుంది… మరేం చేయాలి..? రామోజీరావు నాస్తికుడు… పూజలు గట్రా అస్సలు పడవు… వారసులకు నాస్తికత్వం లేకపోయినా ఈ హోమాలు, దిష్టితీతలు, విరుగుడు తంత్రాల నమ్మకాలు లేవు… ఈనాడు ఎడిటోరియల్ బాధ్యులూ అంతే…
మరీ కేసీయార్ స్థాయిలో ఆయుత చండీయాగం చేయించలేరు, కనీసం వేణుస్వామితో దశమహావిద్యల పూజలూ చేయించలేరు… ఎస్, నిజంగానే ఓ కార్పొరేట్, కమర్షియల్ ఫిలిమ్ సిటీ కాజోల్ వ్యాఖ్యలకు విరుగుడుగా ఏం చేయాలి..? ఖండిస్తే, అదొక గోకుడు, మరింత పెంట… కామ్‌గా ఉంటే నష్టం సరేసరి… భలే చిక్కు సమస్య..!!
Share this Article