ఈమధ్య విడుదలైన 35 చిన్న కథ కాదు అనే సినిమా ప్రధానంగా మ్యాథ్స్ మీద కదా… GIFTED అనే ఈ సినిమా కూడా మ్యాథ్సే మీదే … కానీ కథ పూర్తిగా వేరు… కథనం వేరు… ప్రభావం వేరు…
ఒక మేథమెటీషియన్. మన గణితం శకుంతలాదేవిలాగా… ఏ మ్యాథ్స్ ప్రాబ్లెమ్‌ని అయినా ఇట్టే సాల్వ్ చేయగల గొప్ప మేధావి. ఇంగ్లాండ్‌లో పుట్టి పెరిగి.. అక్కడే గొప్ప పేరు తెచ్చుకున్న ఆమె.. పెళ్లి చేసుకొని అమెరికా వస్తుంది. అక్కడితో ఆమె గణిత శాస్త్ర పరిశోధన ఆగిపోతుంది. ఇక తనకు పుట్టిన కూతురు తనకంటే మేధావి అని తెలుసుకుంటుంది. దీంతో స్కూల్ మానిపించి.. తోటి పిల్లలతో కలవనీయకుండా కట్టడి చేసి 24 గంటలూ లెక్కల బుక్కులపైనే దృష్టి పెట్టేలా చేస్తుంది.
చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ తప్ప మరో ప్రపంచం తెలియదు.. తల్లి కోరికను తీర్చడమే లక్ష్యంగా మారిపోతుంది. గొప్ప గొప్ప మ్యాథమెటీషియన్స్ సాల్వ్ చేయలేని ప్రాబ్లెమ్స్ కూడా ఇట్టే అలవోకగా చేసేస్తుంది. ఒక పెద్ద ప్రాబ్లెమ్‌ను సాల్వ్ చేసే క్రమంలో తీవ్రమైన ఒత్తిడితో ఆత్మహత్య చేసుకుంటుంది.
Ads
ఇప్పటి వరకు నేను చెప్పిన కథకు సంబంధించి ఆ సినిమాలో ఒక్క సీన్ కూడా ఉండదు. కానీ సినిమా చూస్తున్న క్రమంలో అదంతా నటీనటుల సంభాషణల ద్వారా తెలుస్తుంది.
ఇక సినిమా విషయానికి వస్తే… మేరీ అనే 7 ఏళ్ల పాపకు చిన్నప్పటి నుంచే మ్యాథ్స్ సులువుగా వచ్చేస్తుంది. తన అంకులు ఆ పాపను కిండర్‌గార్డెన్ స్కూల్‌కు పంపితే.. అక్కడ మేడమ్ చేప్పే లెక్కలు సిల్లీగా అనిపిస్తాయి. కాలేజీ విద్యార్థులు నేర్చుకునే లెక్కలను కూడా అలవోకగా చేసేస్తుంటుంది. దీన్ని గమినించిన ఆ పాప టీచర్.. తన మామ ప్రాంక్‌కు ఇదే విషయం చెప్తుంది. కానీ కొట్టి పారేస్తాడు.
కొన్నాళ్లకు ఆ పాప గ్రాండ్ మదర్ అక్కడకు వస్తుంది. తన మనుమరాలిని తనతో తీసుకెళ్తాను… గొప్ప మేథమెటీషియన్‌ను చేస్తానని చెప్తుంది. దీనికి ఆ పాప అంకుల్ తిరస్కరిస్తాడు. చివరకు ఈ గొడవ కోర్టుకు చేరుతుంది. ఆ పాప లీగల్ గార్డియన్ తానే అని గ్రాండ్ మదర్ వాదిస్తుంది. కానీ చివరి వరకు పాప తన దగ్గరే ఉండాలని అంకుల్ పోరాడుతుంటాడు. పాపకు కూడా అంకుల్ దగ్గరే ఉండాలని అనిపిస్తుంది.
చివరకు కోర్టు ఏం తేల్చింది? అప్పట్లో ఆత్మహత్య చేసుకున్న యువతికి.. ఈ పాపకు ఏం సంబంధం అని తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. తల్లిదండ్రులు తాను సాధించలేని లక్ష్యాలను పిల్లలపై రుద్దితే ఎలాంటి ప్రభావాలు ఉంటాయనేది ఈ సినిమాలో చూపించారు. మనసుకు హత్తుకునే సీన్లు, సంభాషణలు ఈ సినిమాలో ఉన్నాయి. పాప యాక్టింగ్‌ను మాత్రం మరిచిపోలేరు.
ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. ఇంగ్లీష్ లేదా హిందీలో చూడొచ్చు. మంచి ఫీల్ రావాలంటే ఇంగ్లీష్‌లో చూడండి. నెట్‌ఫ్లిక్స్ రెకమండెడ్ మూవీ…. #భాయ్‌జాన్ – జాన్ కోరా
Share this Article