సండేలాంటి లైపూ మండేలా మండుతోంది… అసలు పాట ఎత్తుకోవడమే మైండ్‌కు మండేలా తాకింది ఆ గీత రచయిత భాషలో చెప్పాలంటే… సండేలాంటి లైఫు అంటే వోకే, బద్దకంగా స్టార్టయి, జాలీగా గడిచి, ఏ వినోదంతోనో ముగుస్తుందీ అనుకుందాం… కానీ మండే అంటే మండటం ఏమిటి..? ఓహో… మండే మళ్లీ డ్యూటీకి వెళ్లాలి కదా, అది ‘మండే’ రోజు అన్నమాట… హబ్బ, ఏం కవిహృదయం… అదిరిపోయింది బాసూ…
గాలోడు, కాలింగ్ సహస్ర సినిమాల తరువాత రాబోయే సుడిగాలి సుధీర్ సినిమా G.O.A.T… అబ్బా, అదేనండీ బకరా అని పెట్టలేక, మేక అని అస్సలు పెట్టలేక అలా గోట్ అని పెట్టేశారు అనుకుంటున్నారా..? నో, నెవ్వర్… దాని ఫుల్ ఫామ్ తెలియాలంటే సినిమా చూడాలి… కానీ అంతకుముందు వాళ్లు రిలీజ్ చేసిన ఈ చిత్రాతివిచిత్ర గీతాన్ని విని భరించాలి… సమజ్ చేసుకోవాలి… లేదా మండేలా మండిపోవాలి… ఎహె, ఇక్కడే ఆగిపోకండి, ఇంకాస్త ముందుకెళ్దాం… ఇంకా షాళా ఉన్నయ్…
Ads
ఈ గుండెల్లోన బీటూ చావు డప్పయి మోగుతోంది… ఏమిటీ… ఎట్టెట్టా… గుండెల్లోన బీటు చావు డప్పయి మోగుతోందా..? ఏమన్నావు బాబూ, మళ్లీ అను… అని మనం బ్రహ్మానందం టైపులో ఆశ్చర్యానందాల్లో నిండా మునిగిపోవాలన్నమాట… గ్రహచారం గాడ్జిల్లాలా గదిలోకి దూరిందట… దురదృష్టం దుష్మన్‌లా దుంపంతా తెంచిందట… ఇక్కడ ఈ రెండు వాక్యాల వరకూ వోకే…
అయ్యో పాపం సారూ, ఎట్టా బుక్కయ్యారు… లారీ గుద్దిన ఆటోలా దెబ్బయిపోయారు… ఇట్టా లాకయ్యారు… త్రీడీలో చూస్తున్నారూ హారర్ పిక్చరూ… ఓ అమ్మాయి చెప్పినట్టల్లా నడవాల్సిన ఏదో సిట్యుయేషన్ వస్తే లారీ గుద్దిన ఆటో అయిపోవడమా..? వామ్మో… పైగా గుండెలో బీటు చావు డప్పా..? వైలెంటుగా ఇన్నాళ్లూ ఉండేటి సారూ, సైలెంటుగా వయోలిన్ వాయిస్తున్నారు అట… వాల్కెనోలా రోజూ బ్లాస్టయ్యేవారు, బాల్కనీలో రోజాలా చిగురిస్తున్నారు అట… హేమిటో… హేమిటేమిటోగా అనిపిస్తోంది…
ఇస్రో ఇసిరిన రాకెట్‌లా ఎగిరేస్తున్నారు… సరే, సరే, ఓచోట మాత్రం బాగున్నట్టుంది… నాలోకం విడిసి నీలోకంలోనా మాలోకం అయిపోవడం ఇంకా బాగుందే అనే చోట… నీ ఊహల్లో ఎగిరీపోకుండా క్లిప్పే పెట్టావే… నిజానికి సుడిగాలి సుధీర్ ఏ ఎమోషనైనా బాగా చేస్తాడు… ఈ పాటలోనూ అలాగే బాగున్నాడు… కానీ ఎటొచ్చీ ఆ పాట సాహిత్యమే (సాహిత్యమే అనాలట సినిమా పాటల్ని కూడా…) కాస్త గడబిడ చేస్తున్నట్టుగా ఉంది…
సంగీత దర్శకుడు ఎవరు, రాసింది ఎవరు, పాడింది ఎవరు అని అడక్కండి… నాకేమీ తెలియదు, నేనేమీ చూడలేదు… నాకేమీ గుర్తులేదు… సెలవు… ఠాట్, ఛస్, అంటే మిగతా సినిమాల్లో పాటల్లో సాహితీపరిమళాలు గుబాళిస్తున్నాయా అని కూడా అడక్కండి… మచ్చుకు ఏదో ఒకటి గీటురాయితో గీకి చూస్తాం, బంగారమో, కాకిబంగారమో తెలుసుకోవడానికి…!!
Share this Article