.
ఒక మనిషి మరణించబోతున్నాడు…
ఆ మనిషి చావుకు దగ్గరై ఉన్నప్పుడు, చివరి ఊపిరుల వేళ…
తాను చచ్చిపోతున్నాననే నిజాన్ని అర్థం చేసుకున్నాడు.
అప్పుడు ఆయనకు దేవుడు కనిపించాడు – తన చేతిలో ఒక పెట్టె పట్టుకుని ఉన్నాడు…
Ads
దేవుడు అన్నాడు: “పోయే సమయం వచ్చింది…”
మనిషి ఆశ్చర్యంతో అన్నాడు: “ఇంత త్వరగానా? నేను ఇంకా ఎన్నో పనులు చేయాలని అనుకున్నాను!…”
దేవుడు స్పందించాడు: “క్షమించు, కానీ ఇప్పుడే నీ జీవిత ప్రయాణ సమయం అయిపోయింది…”
మనిషి అడిగాడు: “మీ చేతిలో ఉన్న పెట్టెలో ఏముంది?”
దేవుడు బదులిచ్చాడు: “నీ సొత్తు…”
మనిషి విస్మయంతో: “నా సొత్తా? అంటే నా వస్త్రాలు, డబ్బు, ఆస్తులా…?”
దేవుడు నవ్వుతూ అన్నాడు: “అవి ఇక నీవి కావు… అవి భూమికి చెందినవి కదా…”
మనిషి అడిగాడు: “అయితే నా జ్ఞాపకాలా..?”
దేవుడు: “అవి కాలానికి చెందినవి కదా, నీవెలా అవుతాయి…”
“నా కుటుంబం? నా స్నేహితులు?”
దేవుడు సమాధానం ఇచ్చాడు: “వారు తాత్కాలిక సహప్రయాణికులు మాత్రమే!”
“నా భార్య, పిల్లలా?”
దేవుడు మృదువుగా అన్నాడు: “వారు నీ హృదయానికి చెందినవారు… వాళ్లు కూడా నీ సహప్రయాణికులు కొంతకాలం….”
మనిషి ఆశతో: “అయితే పెట్టెలో నా శరీర భాగాలున్నాయేమో కదా?”
దేవుడు అడ్డంగా తలూపుతూ: “కాదు, అవి దుమ్మూ ధూళికి చెందినవి… వాటికి విలువేముంది..?”
మనిషి చివరగా అడిగాడు: “అయితే నా ఆత్మ కావచ్చు…?”
దేవుడు బదులిచ్చాడు: “ఆత్మ నాది!… నాలో కలిసిపోయినట్టే… నువ్వే తెరిచి చూడు…”
మనిషి భయంతో, కన్నీళ్లతో ఆ పెట్టెను తీసుకుని తెరిచాడు. పెట్టె ఖాళీగా ఉంది.
విచారంతో మనిషి అన్నాడు: “అయితే నాకంటూ ఏమీ మిగల్లేదా..? అంతా ఖాళీ… శూన్యమేనా..?”
దేవుడు మృదువుగా తలూపుతూ అన్నాడు: “అవును… నీకంటూ జీవితంలో మిగిలింది ఏమీ లేదు…”
“అయితే నా జీవితం అంతా ఏమిటి..?”
దేవుడు చెప్పాడు: “నీ జీవితంలో జీవించిన ప్రతి క్షణం నీదే..!”
ప్రతి క్షణం – నీవు జీవించినంతవరకు – నీదే… జీవితం అంటేనే క్షణాల సమాహారం… ఆ క్షణాలను ప్రేమించు. వాటిని ఆస్వాదించు… గతం… అది గతమే! అది మన వశంలో లేదు. మన దృష్టిని దాటి ప్రతిక్షణం గడిచిపోయింది. అవును, అవన్నీ గతం…
మనం జీవితాన్ని ఓ తడవ వెనక్కి తిరిగి చూసుకుంటే… ఆ తలుపులపై ఉన్న బోర్డు చెబుతోంది: ‘‘ఈ వ్యక్తి మరణించాడు…’’
సంపదలు, ఆస్తుల, అంతస్థులు, అహాలు, ఆధిపత్యాలు, విజయాలు, పతకాలు, వైభోగాలు… ఏవీ నీతో రావని చెప్పడానికే ఈ పెట్టె గురించి చెప్పాను… అర్థమైంది కదా… ఇక పద… నిర్వికారంగా నాతోపాటు….!!
ఇదంతా ముందే తెలిస్తే ప్రతి క్షణాన్ని మరింత ఆస్వాదించేవాడిని కదా దేవా..?
దేవుడు నవ్వాడు… మార్మికంగా… అర్థమయ్యేట్టు నవ్వితే తను దేవుడెలా అవుతాడు… జగన్నాటక సూత్రధారి..!! (ఇంగ్లిషులో కనిపించిన కంటెంటుకు తెలుగు అనువాదం..)
Share this Article