దేవుళ్లే కాదు, వాళ్ల జన్మస్థలాలు కూడా అప్పుడప్పుడూ వివాదాల్ని రేకెత్తిస్తుంటాయి… దేవుళ్లు ఫలానాచోట పుట్టారు అని చెప్పడానికి చారిత్రిక ఆధారాలేముంటయ్..? స్థలపురాణాలు, నమ్మకాలే ఆధారాలు… కానీ రామాయాణం అలా కాదు… రాముడి కథ నిజమైందేననీ, కల్పన కాదనీ కోట్ల మంది తరతరాలుగా నమ్ముతున్న నేల ఇది… జాతి ఆరాధ్యుడు… అయోధ్య రాముడి జన్మస్థలి వివాదం తెలిసిందే కదా… కొందరైతే అసలు రాముడు అయోధ్యలో పుట్టనేలేదని కూడా వాదిస్తారు… అవునూ, రాముడు సరే, హనుమంతుడు పుట్టిందెక్కడ..? ఇక్కడ, కాదు ఇక్కడ అనే వివాదాలున్నయ్… ఇప్పుడు ఓ కొత్త వాదనకు సాక్షాత్తూ తిరుమల, తిరుపతి దేవస్థానం తెర లేపుతోంది… కాదు, అన్ని వివాదాలకు, నమ్మకాలకు తెరవేస్తోంది అని కూడా అనుకోవచ్చు… ఎలాగంటే…? అక్కడో ఇక్కడో కాదు… హనుమంతుడు పుట్టింది ఈ తెలుగు నేలపైనే… తెలుగువాడే… తిరుమలలోని అంజనాద్రి హనుమంతుడి జన్మస్థలం…
పలు శాసనాలు, పురాణాల్లోని అంశాలు గట్రా పరిశీలించి, అధ్యయనం చేసి, టీటీడీ ప్రత్యేక కమిటీ ఒకటి దీన్ని తేల్చేసింది… వచ్చే ఉగాదిన తమ ఫైండింగ్స్ ప్రకటించబోతున్నది ఆ కమిటీ… ఓ పుస్తకం కూడా విడుదల చేయబోతున్నది టీటీడీ దీనిమీద… గత డిసెంబరులో ఈ అంశం మీద కమిటీ ఏర్పాటు చేశారని ‘ముచ్చట’లో చెప్పుకున్నాం, గుర్తుంది కదా… ఇప్పుడది కొలిక్కి వచ్చింది… తేల్చేశారు… హనుమంతుడు తెలుగువాడే… ‘ఎహె, హనుమంతుడి కాలానికి అసలు తెలుగు భాష పుట్టిందా, మరి తెలుగువాడెలా అవుతాడు..?’ అంటారా..? అవున్నిజమే…. ఇప్పటి తెలుగునేలపై అప్పుడు పుట్టిన హనుమంతుడు అని చెప్పుకుని గర్విద్దాం… ఏమంటారు..?
Ads
అసలే హనుమంతుడు ఈ దేశప్రజలకు ఆరాధ్యదైవం… ఎంత అంటే..? రాముడు, కృష్ణుడు, శివుడు గట్రా ఏ దేవుళ్లూ లేకపోయినా సరే… ప్రతి ఊళ్లోనూ హనుమంతుడి గుడి మాత్రం ఉంటుంది… ఊరి మీదికి వచ్చే భూతప్రేతాలను హనుమంతుడు తన తోకతో కొట్టి చంపేస్తాడని నమ్మకం కదా… ఈమధ్య హనుమంతుడి కులం ఏమిటీ అని ఉత్తరాది నేతలు కీచులాడుకుంటూ ఉన్నారు… మన దేశానికి పెద్ద శాపం మన రాజకీయ నేతలే కాబట్టి… హనుమంతుడి కులం మీద కైలాట్కం ఏమిట్రా అని తిట్టేవాళ్లు లేరు కాబట్టి, వాళ్లను అలా కాసేపు వదిలేద్దాం… మరి హనుమంతుడు మావాడే అని అంతటి టీటీడీ అధికారికంగా ప్రకటిస్తే కొత్త వివాదం తలెత్తదా..? తలెత్తకపోవచ్చు, ఎందుకంటే ఇది నమ్మకాలకు సంబంధించిన వ్యవహారం…!!
నిజానికి ఇప్పటివరకూ హనుమంతుడి జన్మస్థలం ఏదని ఈ దేశం నమ్ముతోంది..?
ఇది ఆంజనేయ పర్వతం… ఇక్కడ తన పేరిట ఓ గుడి కూడా ఉంది… రామాయణం ప్రకారం కిష్కింధ అంటే అది ప్రస్తుతం తుంగభద్ర ప్రాంతమనీ… ఇప్పటి హంపీయే అప్పటి కిష్కింధ అని జనం విశ్వాసం… రామాయణంలో పేర్కొన్న రుష్యమూక పర్వతం కూడా అక్కడే ఉంది… ఒకప్పుడు ఇదంతా దండకారణ్యమేననీ, రాముడు వింధ్య పర్వతశ్రేణిని దాటి, సీతను అన్వేషిస్తూ కిష్కింధ వైపు వచ్చాడనేది రామాయణ గాథ.,..
ఇదే హంపీలోని గుడి… మెజారిటీ ప్రజల విశ్వాసం మేరకు కిష్కింధ అంటే అది దక్షిణ భారతమే… కానీ దేశంలోని ఇంకా పలుచోట్ల హనుమంతుడి జన్మస్థలాలున్నయ్… అవి ఆయా ప్రాంతాల ప్రజల విశ్వాసం… నిజానికి కిష్కింధ కేవలం వాలి, సుగ్రీవుల రాజ్యం అనీ, హనుమంతుడు పుట్టింది వేరేచోట అనీ, తరువాత కిష్కింధకు చేరి ఉంటాడనీ వాళ్ల నమ్మకం…
ఇది మహారాష్ట్రలోని నాసిక్… త్య్రంబకేశ్వరానికి ఆరేడు కిలోమీటర్ల దూరంలో ఉన్న అంజనేరి పర్వతమే హనుమంతుడి జన్మస్థలి అని అక్కడి ప్రజల నమ్మిక… ఆ పర్వతంపైనే హనుమంతుడి తల్లి అంజనీదేవి తపస్సు చేసిందని అంటారు… ఇక్కడ కూడా హనుమంతుడికి గుడి ఉంది…
ఇది గుజరాత్… దంగ్ జిల్లా… ఇక్కడ నవసారి అనే ప్రాంతం… ఒకప్పుడు దీన్ని కూడా దండకారణ్యం అనేవారనీ… ఇక్కడ ఉన్న ఆంజనా పర్వతమే హనుమంతుడి జన్మస్థలి అని ఆ ప్రాంత గిరిజనుల నమ్మకం… అక్కడ అంజనీ గుహ కూడా ఉంది… అందులోనే అంజనీ దేవి హనుమంతుడికి జన్మ ఇచ్చిందని స్థలపురాణం…
ఇది జార్ఖండ్… గుమ్లా జిల్లా… ఈ జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో అంజన్ అనే ఓ గ్రామం ఉంది… అదే హనుమంతుడు పుట్టిన స్థలమని ఈ ప్రాంత ప్రజలు విశ్వసిస్తారు… అంజనీదేవికి కూడా ఓ గుడి ఉంది ఇక్కడ… అసలు వాలి, సుగ్రీవుల రాజ్యం కూడా ఇదేనని ఆ ప్రజల నమ్మకం…
ఇది హర్యానా… కైతల్ పట్టణం… ఒకప్పుడు దీని పేరు కపితల్… క్రమేపీ కైతల్ అయిపోయింది… ఈ ప్రాంతాన్ని కపిరాజు కేసరి పరిపాలించేవాడు… ఇక్కడే అంజనీదేవి హనుమంతుడికి జన్మనిచ్చింది… ఇది అక్కడి స్థలపురాణం… రాజస్థాన్, చురు జిల్లా, సుజన్ గఢ్ సమీపంలోని లక్షక గుట్టలు హనుమంతుడి జన్మస్థలం అని మరో స్థలపురాణం… సో, ఇవన్నీ కాదు, అంజనాద్రే ఆంజనేయుడి అసలు జన్మస్థలి అని టీటీడీ తేల్చేస్తోంది కాబట్టి, అర్జెంటుగా టీటీడీయే ఓ భవ్యమందిరాన్ని నిర్మిస్తే… పాలకులకు కూడా పుణ్యం, పురుషార్థం… రాజకీయంగా కూడా ప్రయోజనకరం..!!
Share this Article