ఈరోజు దాదాపు డజన్ సినిమాలు రిలీజయ్యాయి… శుక్రవారమే రిలీజ్ చేస్తారు ఎవరైనా… వీకెండ్స్ కలిసివస్తాయని..! వీటిలో ఒక్కటీ స్టార్ సినిమా లేదు… ఉన్నంతలో జయం రవి, నయనతార నటించిన గాడ్ అనే సినిమా ఒక్కటే కాస్త ప్రేక్షకుడి దృష్టిని ఆకర్షించేది… అందులోనూ నయనతార ఉంది కాబట్టి… ఎస్, అదే మనం చెప్పుకోవాలి ఇక్కడ, ఇప్పుడు…
నయనతార సౌత్ ఇండస్ట్రీలోనే హయ్యెస్ట్ పెయిడ్, నంబర్ వన్ హీరోయిన్… వయస్సు మీద పడుతున్నా సరే డిమాండ్ తగ్గలేదు… అఫ్‌కోర్స్, మంచి నటే… కానీ గాడ్ నిర్మాత దర్శకులు ఆమెను జస్ట్ కేవలం ప్రచారం కోసం, ప్రేక్షకుల లుక్ పడటం కోసం మాత్రమే వాడుకున్నారు… మహా అయితే సినిమాలో అయిదారు సీన్లు ఉంటాయేమో ఆమెవి… కథలో ఆ పాత్రకు అస్సలు వాల్యూ లేదు… (నిజానికి ఆమె ప్రమోషన్ వర్క్ కూడా చేయదు…)
సినిమా కాబట్టి ఓ హీరోయిన్ ఉండాలి… హీరోయిన్ ఉంది కాబట్టి ఓ లవ్ ట్రాక్ ఉండాలి… లవ్ ట్రాక్ ఉంది కాబట్టి ఓ సాంగ్ పడాలి… ఇలా ఉన్నయ్ సినిమా టీం లెక్కలు… అసలు సీన్లే లేనప్పుడు, కేవలం అట్రాక్షన్, ఆడియెన్స్ అటెన్షన్ కోసమే ఆమెను తీసుకున్నప్పుడు ఇక నటన గురించి విశ్లేషణ ఏముంటుంది..? ఇక్కడ ప్రశ్న ఏమిటంటే..? ఈ రేంజ్‌కు వచ్చాక కూడా ఇలాంటి సినిమాల్ని ఆమె చేయాలా..? కేవలం డబ్బు కోసం వాల్యూలెస్ ఆఫర్లను తీసుకోవాలా..? ఇలా వచ్చిపోయే పాత్రలతో ఆమె ఇమేజ్ దిగజారదా..? కెరీర్‌కు నష్టదాయకం కాదా..?
Ads
ఇక హీరో విషయానికి వస్తే… జయం రవి తమిళంలో కాస్త చెప్పుకోదగిన స్టారే… డౌట్ లేదు… కానీ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా కనెక్టయిన హీరో కాదు… ఏవో కొన్ని సినిమాలు గుర్తొస్తాయి జయం రవి పేరు వినగానే… అంతేతప్ప జయం రవి అనగానే వెళ్లి సినిమా చూసేంత ఫాలోయింగ్ అస్సలు లేదు… కానీ ఈ సినిమా ఎక్కువగా తమిళ ప్రేక్షకుల కోసం ఉద్దేశించింది, ఇప్పుడు ఎడాపెడా పలు భాషల్లోకి డబ్ చేసేసి, వీలైంతన డబ్బు చేసుకోవడం ట్రెండ్ కదా, అలా తెలుగులోకి కూడా వదిలారన్నమాట…
ఇదొక పోలీస్ పాత్ర… మన సినిమాల్లో పోలీసోళ్లు చాలా పవర్ ఫుల్… సూపర్ కాప్స్ కదా… ఈ సినిమాలోనూ అంతే… ఆ పాత్ర పెద్దగా నటనను డిమాండ్ చేయదు… సో, అలా అలా చేసుకుంటూ పోయాడు… కథ విషయానికొస్తే… సైకో కిల్లర్లు, వరుస హత్యలు, ఎవరో హీరో వచ్చేసి మిస్టరీలను ఛేదించడం ఎట్సెట్రా బొచ్చెడు సినిమాల్లో చూశాం… పోనీ, ఆ పాత కథనైనా ఆసక్తికరంగా చెప్పగలిగాడా ఈ దర్శకుడు..? నో… పలుచోట్ల బోర్…
ఈరోజుల్లో ఓ సాదాసీదా కథతో ప్రేక్షకుడిని ‘నిలువు దోపిడీ కేంద్రాలైన’ థియేటర్లలో రెండు గంటలపాటు కూర్చోబెట్టడం అంటే తమాషా కాదు… బిగి సడలని ప్రజెంటేషన్, తరువాత ఏమవుతుందోననే థ్రిల్ అవసరం… ఓ గాడ్… ఈ సినిమాలో అదే లోపించింది… మిగతా సినిమా అంశాల మీద విశ్లేషణ కూడా పెద్దగా అక్కర్లేదు… నయనతార ఉంది కదా అని థియేటర్‌కు వెళ్తానంటారా..? మీ ఇష్టం… డబ్బు గులగులపెడుతుంటే అలాగే కానివ్వండి…
Share this Article