.
ఉన్న పంచాయితీలు సరిపోవని… కొత్తగా ఏవేవో కైలాట్కాలకు తెరతీయడంలో మన సినిమా వాళ్లు ప్రసిద్ధహస్తులు… కాస్త నోటి దురుసు, మాట పెళుసు వంటి లక్షణాలేమో బహుశా… నిర్మాత నాగవంశీ ఇప్పుడు ఏకంగా నార్త్, సౌత్ ఆడియెన్స్ నడుమ పెంట పెట్టేశాడు…
ఇడుపు కాయితం టైటిల్ వివాదం ఆంధ్రా- తెలంగాణ నడుమ కొత్త వాగ్వాదాలకు దారితీసి, ఇంకా నడుస్తూనే ఉంది కదా, ఇప్పుడు ఈ కొత్త పంచాయితీ… జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ కొత్త సినిమా రాబోతోంది… దానికి నాగవంశీ నిర్మాత… ప్రజెంట్ టైటిల్ గాడ్ ఆఫ్ వార్ (God of War)… పోస్టరో, గ్లింప్సో ఏమంటారో గానీ ఓ బొమ్మ రిలీజ్ చేశారు… సినిమాను అధికారికంగా అనౌన్స్ చేయడమన్నమాట…
Ads
ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఒక పెద్ద ప్రాంతీయ, సాంస్కృతిక వివాదానికి దారితీసింది. సినిమా పోస్టర్‌ను షేర్ చేస్తూ నాగవంశీ, “Born in the North. Forged in the Heartland. Worshipped in the South.” (ఉత్తరాన జన్మించాడు.. దేశ హృదయభూమిలో రూపుదిద్దుకున్నాడు.. దక్షిణాన పూజలందుకుంటున్నాడు) అని రాశాడు.

ఈ సినిమాలో ఎన్టీఆర్ శివుని కుమారుడైన కుమారస్వామి (మురుగన్/కార్తికేయుడు) పాత్రలో లేదా ఆ నేపథ్యం ఉన్న కథలో నటిస్తున్నట్లు హింట్ ఇచ్చారు. అయితే, ‘ఉత్తరాన పుట్టాడు’ అనే లైన్ తమిళ నెటిజన్లకు, అక్కడి సినిమా విమర్శకులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది.
“మురుగన్ మా తమిళ దేవుడు, ఆయన పుట్టిందే తమిళనాడులో… హిస్టరీని, కోట్ల మంది నమ్మే పురాణ గాథల్ని మీకు ఇష్టమొచ్చినట్టు మార్చకండి” అంటూ తమిళ ఆడియన్స్, ‘కుమారస్వామి ఉత్తరాది దేవుడే’ అంటూ తెలుగు/ ఉత్తరాది ఆడియన్స్ సోషల్ మీడియాలో వాదనలకు దిగారు.
కార్తికేయుడి పుట్టుకకు, తమిళనాడుకు ఉన్న సంబంధం ఏమిటి? ఈ వివాదాన్ని అర్థం చేసుకోవాలంటే.. పురాణాల్లోని ‘సంస్కృతీకరణ’ (Sanskritisation) , దక్షిణ భారత ‘ద్రవిడ సంస్కృతి’ మధ్య ఉన్న వ్యత్యాసాలను చూడాలి.
1. ఉత్తరాది/సంస్కృత పురాణాల వెర్షన్ … (కార్తికేయుడు) ఉత్తరాది సంస్కృత గ్రంథాలు (శివపురాణం, కుమారసంభవం, మహాభారతం) ప్రకారం…: తారకాసురుడనే రాక్షసుడిని సంహరించడానికి శివుని తేజస్సు నుండి హిమాలయాల్లోని గంగానది లేదా శరవణ (హిమాలయ ప్రాంతం)లో కార్తికేయుడు జన్మించాడు. ఈయనను దేవసేనాధిపతిగా, ‘స్కందుడు’ లేదా ‘కార్తికేయుడు’ అని పిలుస్తారు. అంటే ఈ కథల ప్రకారం ఆయన పుట్టింది ఉత్తర భారతదేశంలో (హిమాలయాలు).
2. దక్షిణాది/ తమిళ సంస్కృతి వెర్షన్… (మురుగన్) తమిళ సాంప్రదాయం, ప్రాచీన ‘సంగం సాహిత్యం‘ (Sangam Literature) ప్రకారం…:మురుగన్ (ఆదిలో ‘చేయోన్’ అని పిలిచేవారు) తమిళుల సొంత, స్థానిక (Indigenous) దేవుడు. ఆయనకు హిమాలయాలతో సంబంధం లేదు, ఆయన తమిళనాడులోని కురుంజి (పర్వత ప్రాంతం)కి చెందిన దేవుడు.
తమిళ సంస్కృతిలో మురుగన్ అంటే అందం, యువత్వం, శక్తికి ప్రతిరూపం. ఆయన తమిళ భాషను సృష్టించాడని, తమిళ సంస్కృతికి ఆద్యుడని అక్కడి ప్రజల నమ్మకం.

ఈ రెండూ ఎలా కలిశాయి? కాలక్రమేణా (కొన్ని శతాబ్దాల క్రితం), ఉత్తరాది ‘స్కందుడు’, తమిళుల ‘మురుగన్’ ఇద్దరూ ఒక్కరేనని పురాణాలు ఒకదానిలో ఒకటి విలీనమయ్యాయి. మురుగన్ ఉత్తరాది నుండి దక్షిణానికి వచ్చి, ఇక్కడి గిరిజన కన్య అయిన ‘వల్లి’ని వివాహం చేసుకుని తమిళనాడులోని పళని, తిరుత్తణి వంటి క్షేత్రాలలో (ఆరుపడై వీడుగల్) స్థిరపడ్డాడని పురాణ కథలు చెబుతాయి.
వివాదానికి అసలు కారణాలు (నార్త్ వర్సెస్ సౌత్) తమిళ గుర్తింపు (Tamil Identity): తమిళనాడులో ‘మురుగన్’ కేవలం ఒక దేవుడు మాత్రమే కాదు, తమిళ అస్తిత్వానికి ప్రతీక. టాలీవుడ్ మేకర్స్ తమ పాన్-ఇండియా మార్కెట్ కోసం మురుగన్‌ను ‘ఉత్తరాది దేవుడిగా’ ప్రొజెక్ట్ చేసి, ఆయన ద్రవిడ మూలాలను తక్కువ చేస్తున్నారని తమిళ నెటిజన్ల ఆరోపణ.
కథల వక్రీకరణ భయం: ఒక ద్రావిడ/ తమిళ దేవుడిని బాలీవుడ్ లేదా నార్త్ ఆడియన్స్‌కు నచ్చేలా మార్చి చూపిస్తున్నారనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. తెలుగు ఆడియన్స్ మాత్రం పురాణ గ్రంథాల ప్రకారం ఆయన హిమాలయాల్లోనే జన్మించాడని, నాగవంశీ చెప్పిన దాంట్లో తప్పేమీ లేదని పురాణాల శ్లోకాలను కోట్ చేస్తూ సమర్థిస్తున్నారు. వెనకేసుకొస్తున్నారు…

సినిమా పరంగా చూస్తే.. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏ కథనైనా రీసెర్చ్ చేసి తనదైన స్టయిల్‌లో రాస్తుంటాడు. నాగవంశీ పెట్టిన ట్వీట్ కేవలం భారతదేశాన్ని మొత్తం కనెక్ట్ చేసేలా (ఉత్తరాది జననం నుండి దక్షిణాది పూజల వరకు) ఒక సినిమాటిక్ హైప్ కోసం రాసిందే అయినప్పటికీ, అది కాస్తా నార్త్- సౌత్ సాంస్కృతిక యుద్ధానికి దారితీసింది. సినిమా విడుదలయ్యాక కానీ ఈ వివాదానికి పూర్తి క్లారిటీ వచ్చేలా లేదు!
ఈ ట్వీట్‌లో సదరు దేవుడికి సంబంధించిన అనేక వివరాలు, ఫోటోలున్నాయి… https://x.com/Anandmpl/status/1933529641026986251
Share this Article