ఇలాంటివి బహుశా కేవలం ఈ దేశంలోనే జరుగుతాయేమో…. బహుశా ప్రపంచంలో కేవలం హిందూ దేవుళ్లంటే మాత్రమే అలుసేమో… ఇక్కడ అధికారి అంటే అంతే… మూలవిరాట్టులనూ పెకిలించి మరీ కోర్టుకు లాక్కురాగలరు… విచారించగలరు… ఏమో, తిక్క లేస్తే జైలులో, అదీ సాలిటరీ సెల్‌లోె పారేయగలరు… వార్త చదువుతుంటే నవ్వాలో, ఏడవాలో, జాలిపడాలో, కోపగించుకోవాలో, అబ్బురపడాలో అర్థం కాదు… నిజానికి ఇలాంటివి మెయిన్ స్ట్రీమ్ మీడియాకు ఎందుకు పట్టవు…
ఇండియన్ మార్క్ మేధావులు లోలోపల సంబరపడిపోతూ ఉండవచ్చుగాక… ఇలాంటి విషయాలు మాట్లాడుకోవడం మానేసి మనం ఆర్ఆర్ఆర్ గురించి కొట్లాడుకుంటున్నాం… తన్నుకుంటున్నాం… వేల కోట్లను తగలేస్తున్నాం… హీరోలకు దండలేసి పూజిస్తున్నాం… కటౌట్లకు అభిషేకాలు జరిపించేసి బోలెడు పుణ్యాన్ని సంపాదించుకుంటున్నాం…
Ads
అసలు కేసేమిటంటే… అది చత్తీస్‌గఢ్ రాష్ట్రం… అది రాయగఢ్… 25వ వార్డుకు చెందిన సుధా రజ్వాడే ఈమధ్య బిలాస్‌పూర్ హైకోర్టులో ఓ పిటిషన్ వేసింది… 16 మంది ఓ ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని ఓ గుడిని కడుతున్నారనేది ఆరోపణ… నిందితుల్లో శివుడిని కూడా చేర్చేసింది… విచారణ చేపట్టిన హైకోర్టు సింపుల్‌గా వెంటనే దర్యాప్తు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది… వెనువెంటనే స్థానిక తహసిల్దార్ ఆఫీసు రంగంలోకి దిగింది…
ప్రాథమిక విచారణ తంతు పూర్తిచేసి ఈనెల 25న జరిగే విచారణకు హాజరై, భూకబ్జా ఆరోపణలపై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు… ఒకవేళ విచారణకు హాజరు కాకపోతే చట్టప్రకారం చర్యలు తప్పవని, భూమిని ఖాళీ చేయించడంతోపాటు 10 వేల చొప్పున జరిమానా ఉంటుందని ఓ చట్టాన్ని కూడా ఉదహరించారు వాటిల్లో…
సాధారణంగా ఇండియాలో ఎవరైనా సరే, ప్రభుత్వ సర్వీసులో చేరగానే ముందుగా తమ మెదళ్లను కోల్డ్ స్టోరేజీలోకి విసిరేసి, సంపాదనకు, అక్రమాలకు మాత్రమే అప్పుడప్పుడూ వాడుతుంటారనే అపప్రథ ఉంది కదా… జ్ఙానేంద్రియాలు కూడా విలాసాలకు తప్ప ఇతరత్రా ఏ అవసరానికీ వాడరు కదా… ఎస్, ఇక్కడ శివుడు అపరాధి ఎలా అయ్యాడు..? విచారణకు ఎలా హాజరవుతాడు..? నోటీసులు జారీచేసినవాడి బుర్ర ఏమైంది..? అదీ ఓ తహసిల్ ఆఫీసు…
పోనీ, అది భూకబ్జా ప్రయత్నమే అనుకుందాం… అక్రమంగా, దుర్మార్గంగా, పరమ నికృష్టంగా గుడి కడుతున్నారు అనుకుందాం… తహసిల్దార్ నోటీస్ ఇవ్వగానే సదరు లింగాన్ని పెకిలించి, ఓ ట్రాలీలో వేసుకుని విచారణకు తీసుకుపోయారు… ఆ ఫోటోలు, ఆ వార్త ఎవడికీ పట్టలేదు… ఆర్‌జీహెచ్ న్యూస్ అనే ఓ లోకల్ మీడియా సదరు వీడియోలను, ఫోటోలను లాబీట్ అనే లీగల్ వార్తల వెబ్‌సైటుకు అందించింది… అప్పుడు ఒకరో ఇద్దరో ఓహో, ఇదీ వార్తే కదా అని లేటుగా రాసినట్టున్నారు…
తీరా విచారణకు తీసుకుపోయాక, కేసు వాయిదా వేశారు… శివుడొస్తేనేం, ఎవరైతేనేం… అవసరమైతే కస్టడీలోకి తీసుకోవాలని కూడా పోలీసులను ఆదేశించగలరు ఈ దేశంలో… మరి ప్రభుత్వ అధికారి అంటే మజాకా..? చత్తీస్‌గఢ్ సర్కారు అంటే మజాకా..? ఇక్కడ ఓ డౌట్… ఎవడైనా మన తిరుమల వెంకన్న మీదో, మన యాదగిరి నర్సన్న మీదో, ఏ పద్మనాభుడి మీదో, ఏ మధుర మీనాక్షి అమ్మవారి మీదో ఫిర్యాదు చేస్తే… ఏ దిక్కుమాలిన తహసిల్దారో నోటీసులు జారీ చేస్తే, విచారణకు రాకపోతే మర్యాద దక్కదు అని బెదిరిస్తే ఆ దేవుళ్లు ఏం చేయాలి..? ఆ సీన్ తలుచుకుంటేనే ఒక విభ్రమ..!!
Share this Article