అప్పట్లో కేసీయార్ అనేవాడు… ఈ మోడీకి ప్రజలతో కనెక్ట్ కావడం తెలియదు అని..! ఆఁ చెప్పొచ్చాడులే, తను జనంతో పెద్ద కనెక్ట్ అయినట్టు, తనూ తన మాటలు అని ఆక్షేపించకండి… మోడీకి జనాన్ని ప్రేమించడం తెలియదు… సగటు పేద, మధ్యతరగతి మీద భారం తగ్గించడానికి ఏం చేయాలి అనే కోణంలో ఏమీ ఆలోచించడు… అవసరమైతే మళ్లీ నోట్ల రద్దు వంటి నిర్ణయాలతో ఆర్థికవ్యవస్థను ఒక్క పోటు పొడిచేయగలడు… నాది తప్పయితే నన్ను ఉరితీయండి అంటూనే జనం జేబులు ఖాళీ చేయగలడు… కరోనా పిరియడ్‌లో లక్షల కోట్ల ఆత్మనిర్భరాలు గట్రా రోజుల తరబడీ ప్రకటించింది ఈ ప్రభుత్వం, కానీ ఆ విపత్తువేళ కూడా మానవీయ ధోరణితో స్పందించలేకపోయింది… ఫాఫం, నిర్మలా సీతారామన్ ఏం చేస్తుంది లెండి… ఎవరో రాసిచ్చిన ప్రభుత్వ పాలసీని ఆయాసపడుతూ మీడియా ముందు చదవడం తప్ప… తాజాగా ఓ వార్త కనిపించింది… రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో ప్రీమియం పెట్రోల్ ధర 100 రూపాయల మార్క్ దాటిందట తొలిసారిగా… వావ్… కొట్టండి చప్పట్లు, వెలిగించండి దీపాలు, ఆలపించండి కీర్తనలు…
ఎహె, ఇంకా వంద దాటలేదు, ఆ శ్రీగంగానగర్‌లో సాధారణ పెట్రోల్ ధర 98 మాత్రమే ఉంది, అనవసరంగా మా మోడీని తిట్టేయకండి ప్లీజ్ అని ఎవరూ అనాల్సిన పనిలేదు… అందరూ పెట్రోల్ ధర వంద దాటినట్టుగానే చిమచిమలాడుతున్నారు… రాష్ట్రాలను బట్టి 85 నుంచి 90 దాకా పలుకుతోంది ధర… ప్రభుత్వం తమను మోసగిస్తోందనే భావన బలపడుతోంది… పెరిగే పెట్రోల్, డీజిల్ ధరల భారం రవాణా ఖర్చులను పెంచి, అందరి మీద ఆ ప్రభావం పడుతుందని తెలుసు కదా… మల్టిపుల్ ఎఫెక్ట్… మరి మోడీ ఎందుకు పట్టించుకోడు..? ఇదీ ప్రశ్న… జవాబు లేని ప్రశ్న… క్రూడ్ ధర పెరిగితే మన దగ్గర కూడా ధర పెరుగుతుంది కదా, అది తగ్గితే మన దగ్గర ధరలు తగ్గుతాయి, అందులో మోడీ చేసిందేముంది, పోనీ, రాష్ట్రాలు పన్నులు తగ్గించొచ్చు కదా… అనే అతితెలివైన ఉల్టా దాడి జరుగుతోంది సోషల్ మీడియాలో…
Ads
ఏ రాష్ట్రం ఎక్కువ పన్నులు వేస్తోంది..? కేంద్రం ఎంత దండుకుంటోంది..? అనే లెక్కల్లోకి వివరంగా వద్దు గానీ….. జనాన్ని బాదడానికి రాష్ట్రాలకూ, కేంద్రానికీ పెట్రోల్, డీజిలే దొరికాయి… మద్యం, సిగరెట్లు గట్రా ఇప్పటికే టాప్ రేట్లకు తీసుకెళ్లారు పన్నులు వేసీ వేసీ… ఇక ఈ ఇంధనాలే బాదడానికి వీలుగా కనిపిస్తున్నాయి ఇంకా…! జనం కోపం ఏమిటంటే..? క్రూడాయిల్ ధర మరీ దారుణంగా పతనం అయినప్పుడు, ఆ ధరల తగ్గుదల జనానికి చేరకుండా ఎడాపెడా సుంకం పెంచుకుంటూ పోయాడు మోడీ… క్రూడ్ పడిపోయిన ప్రతిసారీ సుంకం పెరిగింది… ఇప్పుడిక క్రూడ్ ధరలు పెరుగుతుంటే, మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరీ అదుపు తప్పకుండా ఆ సుంకాలు ఎందుకు తగ్గించకూడదు..? నో, నో, మోడీని జనానికి మేలు చేసే పనులు అస్సలు అడగొద్దు అంటారా… సరే, సరే, అడిగినా ఆయనేమీ చేయడులే గానీ… అవును సారూ… పెట్రోల్ ధర సెంచరీకి చేరగానే, దేశవ్యాప్తంగా ఏమైనా విజయోత్సవాలు ప్లాన్ చేశారా సార్…?!
Share this Article