శంకర్ జీ…. హీరోయిన్లు ఐరన్ లెగ్గులా.. లక్కీ ఐకాన్ లా… 70 ఏళ్ల కిందటిమాట అప్పట్లో కృష్ణకుమారి అనే పొడగరి అందమైన అమ్మాయికి అవకాశాలు ఎదురెక్కి వెళ్లాయి. ఎన్టీఆర్ కూడా సొంత చిత్రం పిచ్చిపుల్లయ్యలో హీరోయిన్ గా అవకాశం ఇచ్చాడు. అయినా ఏం లాభం, హీరోయిన్ గా నటించిన చిత్రాలు దాదాపు పది దాకా బాల్చి తన్నేశాయి. అప్పుడెవరూ ఆమెను ఐరన్ లెగ్ అనలేదు.
చిన్న చిన్న క్యారెక్టర్లు చేసింది. అక్కినేని, ఎన్టీఆర్ లతో జమునకు పొసగక పోవటంతో అదృష్టం కృష్ణకుమారిని వరించింది. అంతకుముందు ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ ఇల్లరికం సినిమాలో అక్కినేనితో జోడీ కట్టింది. ఆ సినిమా సూపర్ హిట్. తర్వాత సినిమా భార్యభర్తలు. అందులో కూడా ముందు జమునను అనుకున్నారు. కానీ అక్కినేని అభ్యంతరంతో కృష్ణకుమారిని హీరోయిన్ గా తీసుకున్నారు. నటనకు మంచి స్కోపున్న పాత్ర. మంచి మార్కులు కూడా కొట్టేసింది. ఇక హీరోయిన్ గా వెనక్కి తిరిగిచూడాల్సిన అవసరం రాలేదు. ఎన్టీఆర్, ఏయన్నర్, కాంతారావులతో వరస హిట్లు.
అసలు ఈ ఐరన్ లెగ్ అనేమాట రమ్యకృష్ణతోనే మొదలైంది అనుకుంటా… నిజానికి రమ్యకృష్ణ చేసిన చాలా చిత్రాలు ప్లాఫ్ అయినా భానుచందర్ హీరోగా నటించిన భలేమిత్రులు లాంటి హిట్టు సినిమాలు ఉన్నాయి. ఏం లాభం, అవేవి లెక్కలోకి తీసుకోలేదు. ఐరన్ లెగ్ ముద్ర కొట్టేశారు. మోహన్ బాబు సొంత చిత్రం అల్లుడు గారులో అవకాశం దక్కించుకుంది. మోహన్ బాబు సొంత సినిమాలన్నీ అప్పటివరకు వరుస ప్లాఫులే.. ఇక హీరో వేషాలు మానేసి మళ్ళీ విలన్ గా చేయటం మొదలు పెట్టాడు.
Ads
హీరో అంటే ఆ క్రేజ్ వేరు కదా.. అందుకే మలయాళంలో మోహన్ లాల్ నటించిన సూపర్ హిట్ చిత్రాన్ని అల్లుడు గారుగా రీమేక్ చేసారు. దర్శకుడు రాఘవేంద్ర రావు. మెయిన్ హీరోయిన్ శోభన. ఇంకేం కావాలి. సెకండ్ హీరోయిన్ గా రమ్యకృష్ణకు అవకాశం ఇచ్చాడు రాఘవేంద్రరావ్. సినిమా సూపర్ హిట్. రాఘవేంద్రరావు కోటరిలో చేరిపోయింది రమ్యకృష్ణ. వరుసగా అల్లరి మొగుడు, అల్లరి ప్రియుడు లాంటి హిట్ చిత్రాల్లో మెరిసింది. ఐరన్ లెగ్ కాస్త గోల్డెన్ లెగ్గుగా మారిపోయింది.
80, 90ల్లో హీరోయిన్స్ గ్లామర్ డాల్ గా చేసినా అడపాదడపా నటనకు స్కోపున్న హీరోయిన్ ఒరియంటెడ్ సినిమాల్లో నటించేవాళ్ళు. 2000 సంవత్సరం తర్వాత లెక్కలు మారిపోయాయి. హీరోయిన్లను హీరో టీజ్ చేయటానికి, పాటల్లో గెంతులు వేయటానికి, హీరో అంటే పడి చచ్చే కామాంధురాలుగా చూపడం మొదలుపెట్టారు. ఇక నటనతో పనేముంది. పైగా హీరోయిన్లకు డబ్బింగ్ అరువు గొంతులు కూడా తోడయ్యాయి. ఇక్కడ కొట్టింది దెబ్బ…
నటనతో, సొంత గొంతుతో పనిలేనప్పుడు బోడి తెలుగు హీరోయిన్లే ఎందుకు… అందుకే ఇతర రాష్ట్రాల నుండి హీరోయిన్లను దిగుమతి చేసుకుంటున్నారు. అందులో ఉత్తరాది భామలకు స్కిన్ షో పట్ల ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. ఇంటా బయటా ఎలా కావాలంటే అలా కో- ఆపరేట్ చేస్తారు. వీళ్లను చూసి ధియేటర్ కు వచ్చేవాళ్ళు తక్కువే ఆ మాటకొస్తే వీళ్ళు స్కిన్ షో చేస్తూ గంతులేయటానికి తప్ప నటనకు స్కోప్ ఉండదు. మరి అలాంటప్పుడు మరి ఐరన్ లెగ్ అంటూ వీళ్ళను సినిమా ఫ్లాపులకు ఎందుకు బాధ్యులను చేస్తారు. ఎందుకంటే హీరో జోలికెలితే పుట్టగతులు ఉండవు. తర్వాత సినిమాకు డేట్లు ఉండవు.
పూజా హెగ్డే అరవింద సమేత, అల వైకుంఠపురంలో హిట్ కాగానే గోల్డెన్ లెగ్ అయ్యింది. రాధే శ్యామ్, ఆచార్య ప్లాఫ్ కాగానే ఐరన్ లెగ్ ముద్ర కొట్టి పక్కన పడేశారు. ఆదుకుంటాడనుకున్న త్రివిక్రమ్ గుంటూరు కారం నుండి తొలగించి శ్రీలీలను పెట్టుకుని కళ్ళలో కారం కొట్టాడు. శ్రీలీలకు రెండుమూడు హిట్లు రాగానే గోల్డెన్ లెగ్, మూడు ఫ్లాప్స్ రాగానే మళ్ళీ ఐరన్ లెగ్ గా మారిపోయింది.
ఇప్పుడు హీరోయిన్ల పరిస్థితి ఎలా ఉందంటే సినిమాలకు కేవలం సెంటిమెంట్లలాగా వాడుకుంటున్నారు. అంటే నక్కతోక తొక్కితే, లాఫింగ్ బుద్ధా పెట్టుకుంటే, తాబేలు బొమ్మ పెట్టుకుంటే, లేక భార్య, కూతురో ఎదురొస్తే అదృష్టం అని ఎలా భావిస్తారో … హీరోయిన్లు కూడా అలా సెంటిమెంట్ గా తయారయ్యారు. నటన రాకపోయినా కేవలం సెంటిమెంట్ కోసమే సక్సెస్ ఫుల్ హీరోయిన్స్ కు కోట్లు గుమ్మరిస్తారు… ఏం ఇండస్ట్రీరా బాబూ…
Share this Article