మానేపల్లి గుడి దగ్గర భంగపాటు, మనోవికలం, అసంతృప్తి తరువాత చటుక్కున స్ఫురించింది… అరె, విష్ణువుకన్నా శివుడు భక్తసులభుడు కదా, దగ్గరలో ఏమైనా శివాలయం ఉందాని ఆలోచిస్తుంటే, ఆమధ్య ఓ బంధువు చెప్పిన స్వర్ణ శివలింగం, స్ఫటిక లింగం ఉన్న గుడి గుర్తొచ్చింది… ఎస్, ఛలో వెళ్దాం… పదండి…
మానేపల్లి గుడి దగ్గర నుంచి 18 కిలోమీటర్లు చూపిస్తోంది… భువనగిరి నుంచి చిట్యాల రోడ్డులో నాగిరెడ్డిపల్లి గ్రామంలో… రోడ్డు పొడవునా రియల్ ఎస్టేట్ వెంచర్లే… కొద్దిదూరం సింగిల్ రోడ్డు కూడా… జాగ్రత్తగా వెళ్లాల్సిందే… వెళ్లాక మనిషికి వంద, కారు పార్కింగ్‌కు 50 కట్టు, లేకపోతే ప్రవేశం కట్టు అన్నాడు…
(mahadhuni)
Ads
కాస్త లోపలకు వెళ్లాలి… రమణానందాశ్రమం, స్వర్ణశివాలయం వంటి ఏవేవో పేర్లు కనిపిస్తున్నాయి… మానేపల్లి దగ్గర సమ్మక్క జాతర కనిపిస్తే, ఈ ఆశ్రమం మరీ థార్ ఎడారిలో జనావాసాల సంఖ్యలాగా కనిపించారు జనం… ఎంట్రన్స్‌లోనే ఓ ఫుడ్ కోర్ట్… కాస్త నడిచి లోపలకు వెళ్తే చాలా చాలా ఆశ్చర్యాలు ఎదురుచూస్తున్నాయి…
నిజానికి ఈ గుడి కట్టిన… ఇంకా కడుతున్న ఆ స్వామిది కర్నూలు దగ్గర ఏదో ఊరట… ఇక్కడ వందల ఎకరాలు కొనేసి, దీన్ని స్థాపించాడు… జనం విరగబడతారనే ఆశతో భారీ ఏర్పాట్లు చేశాడు… అడుగడుగునా సమాచార కేంద్రాలు, బోలెడు దుకాణాలు గట్రా… ప్చ్, అంత దృశ్యం లేదు… ఎందుకో తెలియదు.,.
(nandi infront of saibaba)
ఎంట్రన్స్ మొదట్లోనే షిర్డి సాయి శక్తి పీఠం అని కనిపించింది… షిర్డి సాయి ఏమిటీ, శక్తి పీఠం ఏమిటీ..? అర్థం కాలేదు కాసేపు… అసలు శివుడు లయకారుడు, ఆదిదేవుడు… షిర్డి సాయి ఏమిటి..? చాలామంది గురువు అంటారు, గురువారం తనదే అంటారు… అదంతా భక్తుల ఓవరాక్షన్… నిజానికి షిర్డి సాయి గురువేమిటి..? గురువారానికీ సాయికి లింకేమిటి..?
(lingam with 11 metals)
కాస్త లోపలకు వెళ్లాక పంచ లోహాల విగ్రహాలకు ఎవరో అభిషేకం చేస్తున్నారు… ఆ పక్కనే 11 లోహాలతో చేసిన విగ్రహానికి కూడా… దేని విశిష్టత దానిదేనట… ధూపం వేస్తున్నారు… శివుడికి ధూపమేమిటీ… మళ్లీ అదొక ఆశ్చర్యం… ఓ పక్కన దేవీ విగ్రహాలు అనేకం వరుసగా ఉన్నాయి, పెద్ద షెడ్డు… ఆ ఆవరణలో మొత్తం 2000కు పైగా శివలింగాలు… బాగున్నాయి…
(siva lingams with 8 different metals)
అనేకమంది యోగుల పేర్ల మీద, శివుడి సహస్ర నామాల పేర్ల మీద… అన్నింటికీ ప్రాణప్రతిష్ట జరిగిందని ఒక సేవిక చెప్పింది… విజయవాడ దగ్గర ఏదో ఊరట… తరచూ వచ్చి సేవ చేస్తుంటుంది… చుట్టూ తిరిగి చూడాలంటే నడక కష్టం, బ్యాటరీ వెహికిల్స్ ఉన్నాయి తిప్పడానికి… కానీ ఈ శివలింగాలు పెట్టిన కంపార్ట్‌మెంట్లలో లింగాల నడుమ ప్రముఖంగా షిర్డి సాయి విగ్రహం కూడా…
(every where sai )
ఓచోట మహాధుని కూడా ఉంది… ఆ షిర్డి సాయికీ శివుడికీ సాపత్యం ఏమిటో జుత్తు పీక్కున్నా అర్థం కాలేదు… మా బాగా షిర్డిలో ఆత్మసాక్షాత్కారం పొందాడు, ఆయన శిష్యరికం చేశాడు, అందుకే ఆ షిర్డి ప్రభావం ఈ పీఠం మీద కూడా కనిపిస్తుంది అని చెప్పిందామె… షిర్డి సాయి ఎప్పటివాడు, ఈ స్వామి శిష్యరికం చేయడం ఏమిటి అని నేనడగలేదు… అక్కడ బోలెడు బోర్డులు… ఏయే సరుకులతో అభిషేకం చేస్తే ఏమేం పీడలు నివారణ అవుతాయో చెబుతూ…
(abhisekham to golden lingam)
కానీ అక్కడ కేవలం జలాభిషేకమే… జంటకు 1000… ఓచోట స్వర్ణలింగం ఉంది… మరోచోట మూడు అడుగులు స్ఫటిక లింగం ఉంది… ఆ 2 వేల విగ్రహాలు రకరకాల శిలలతో చేసినవే… షిర్డి సాయి మాత్రమే కాదు, ఈ బాబా ఎందుకైనా మంచిదని బుద్ధుడు, నానక్, మహావీరుడు, కబీర్ దాస్ వంటి ఇతర మత ముఖ్యుల విగ్రహాలూ పెట్టాడు… కొందరు సూఫీ, ఇతర సిద్ధయోగుల విగ్రహాలు కూడా… ఓ విశాల భావన… పర్లేదు.., ఎందుకో గానీ క్రిస్టియానిటీ ఛాయలు మాత్రం ఏమీ లేవు…
(saibaba besides ammavaru)
ఓచోట సాయిబాబా విగ్రహానికి ఎదురుగా నంది విగ్రహం ఉండటం మరింత ఆశ్చర్యం కలిగించింది… ఈ బాబా ఎవరో గానీ, షిర్డి సాయిని ఆ శివుడిగా మార్చేశాడు అనిపించింది… బహుశా ఈ యాంటీ సెంటిమెంటే ఈ గుడికి నెగెటివ్ అయ్యిందా..? ఏమో, తెలియదు… ఒకచోట మొక్కుల లింగం పేరిట భారీ లింగం కనిపించింది… దాదాపు పదీపదిహేను ఎకరాల మేరకు ఫ్లోరింగ్… నిజం చెప్పాలంటే గుడి బాగుంది… మెయింటెనెన్స్ బాగుంది… చాలా ఖర్చవుతున్నా సరే, రాజీపడటం లేదు… అభినందనీయం…
ఎటొచ్చీ మన ఆశ్చర్యాలకే సరైన ఆధ్యాత్మిక సమాధానం దొరకదు… ఫాఫం, ఆ గుడిని ఏ సంకల్పంతో కట్టాడో గానీ, ఆ బాబాకు కూడా సంపూర్ణంగా తెలుసనీ నేననుకోవడం లేదు… పాపం శమించుగాక..!! ఏమోలే… మన సంకుచిత, అరకొర మెదళ్లకు అర్థం కాని ఏదో ఆధ్యాత్మిక నిగూఢ పరమార్థం ఏదో ఉండే ఉంటుది… ఓం నమఃశివాయ..!!
Share this Article