.
కప్పు టీ లక్ష రూపాయలు… బంగారు టీ, కాఫీ
“నీ ఇల్లు బంగారం కాను…” అని మాటవరసకు ఆశ్చర్యపోతాం కానీ… మన మాట పొరపాటునైనా నిజమవుతుందని తెలిస్తే… కలలో కూడా అనం. చరిత్రలో నిలిచిపోయినదంతా సువర్ణాక్షర లిఖితమే కావాలి. మంచిదేదయినా బంగారంతో పోల్చాల్సిందే.
Ads
బంగారంలాంటి ఇల్లు;
బంగారంలాంటి సంసారం;
బంగారంలాంటి మనసు;
బంగారు పాప;
బంగారు తొడుగు;
నిలువెత్తు బంగారం;
బార్న్ విత్ గోల్డెన్ స్పూన్;
మన బంగారం మంచిదైతే…;
బంగారు గాలానికి బంగారు చేపలు పడవు;
బంగారు చెప్పులైనా కాళ్లకే తొడగాలి;
బంగారానికి తావి అబ్బినట్లు;
కంచు మొగునట్లు కనకంబు మోగదు.
…ఇలా మన సామెతలు, వాడుక మాటల నిండా బంగారమే బంగారం. తవ్వుకున్నవారికి తవ్వుకున్నంత కోలార్ బంగారు గని తెలుగు భాష.
“తల్లిగర్భమునుండి ధనము తేడెవ్వడు
వెళ్లిపోయెడినాడు వెంటరాదు
లక్షాధికారైన లవణమన్నమె కాని
మెఱుగు బంగారంబు మ్రింగబోడు
విత్తమార్జనజేసి విర్రవీగుటె కాని
కూడబెట్టిన సొమ్ము తోడరాదు
పొందుగా మఱుగైన భూమిలోపల బెట్టి
దానధర్మము లేక దాచి దాచి
తుదకు దొంగల కిత్తురో దొరల కవునొ
తేనె జుంటీగ లియ్యవా తెరువరులకు?
భూషణవికాస శ్రీధర్మ పురనివాస
దుష్టసంహార నరసింహ దురితదూర”
అని ధర్మపురి నరసింహస్వామి ముందు కూర్చుని శతాబ్దాల క్రితం కవి శేషప్ప సీసపద్యాల్లో, తేటతెలుగు తేటగీతుల్లో వాపోయాడు. ఇప్పుడు రోజులు మారాయి. లక్షాధికారులు అక్షరాలా మెరుగు బంగారమే మింగుతున్నారు. లక్షాధికారులు కానివారు కూడా మెరుగు బంగారమే మింగాలనుకుంటున్నారు.
దుబాయ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అంటే అంతర్జాతీయంగా డబ్బుచేసినవారికి వ్యాపారావకాశాల గని. అక్కడ భారతీయ మూలాలున్న ఒక మహిళ బోహో పేరిట ఒక వినూత్నమైన కేఫ్ ప్రారంభించారు. మన కరెన్సీలో లక్ష లేదా లక్షా పది వేల రూపాయలు మీవి కాదనుకుంటే ఒక కప్పు బంగారు టీ లేదా ఒక కప్పు బంగారు కాఫీ తాగచ్చు. తాగాక వెళుతూ వెళుతూ తాగడానికి ఇచ్చిన ఆ వెండి కప్పు, ఆ వెండి పళ్ళెం కూడా వెంట తీసుకెళ్ళచ్చు.
ఇక్కడ టీ, కాఫీ వేడివేడిగా సర్వ్ చేయడానికి ముందు బంగారం పొడి చల్లుతారు. ఇక్కడ బంగారాన్ని తిని, తాగి, పీల్చి వెళుతున్నవారిని చూసి “డబ్బుందని బంగారం తింటారా?” అన్న సామెత తనకు తాను పక్కకు జరుగుతోంది.
రోజూ చిటికెడు జీలకర్ర, ఆవాలు, మిరియాలు, ధనియాలు, అల్లం, శొంఠి తింటే జీర్ణక్రియ అద్భుతంగా ఉంటుందని అనాదిగా మనకు తెలుసు. ఇప్పుడు ఈ బంగారాన్ని చల్లుకుని టీ కాఫీలు తాగే బోహో రుచి అలవాటైతే భవిష్యత్తు ఎలా ఉంటుందో?
ఎంతచెట్టుకు అంత గాలి. ఉన్నవారు బంగారు పొడి చల్లుకుని టీ, కాఫీలు తాగుతుంటే లేనివారు బెల్లం పొడి చల్లుకుని తాగుతూ ఉంటారు. ఉన్నవారిని లేనివారు ఎప్పటికీ అందుకోవడానికి వీల్లేకుండా బంగారు పొడి చల్లుళ్ళ ఆవిష్కరణలు జరుగుతూనే ఉంటాయి. బంగారం పొడి బోరు కొడితే వజ్రం పొడి పుడుతుంది.
అన్నట్లు-
బంగారు పొడిని మనుషులు తినవచ్చా? తాగవచ్చా? అరుగుతుందా? పేగులు తట్టుకోగలవా? అన్నది ఉదరకోశ సంబంధ వ్యాధుల నిపుణులైన ఏ నాగేశ్వర రెడ్లో చెప్పాల్సిన విషయం. వెండి పొరల్ని స్వీట్లపై అతికించి తింటుంటాం సరే, కానీ బంగారం..?
అయినా మనలో మనమాట. నానా కలుషిత విషరసాయనాలతో పండించే, ప్రాసెస్ చేసే, నిలువచేసే నానా గడ్డి కరిచి అరిగించుకుని…బతికి బట్టగట్టగలుగుతున్నప్పుడు ఆఫ్టరాల్ మేలిమి బంగారాన్ని తిని, తాగి అరిగించుకోలేమా! ఏమిటి?
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
ఒక చొప్పదంటు ప్రశ్న… మామూలు ఆహారం తింటే విసర్జించబడేది మామూలు మలం… మరి..?
Share this Article