అలోకేశ్ లహిరి అలియాస్ బప్పీలహిరి…! తన పాటల్లాగే ఒక జోష్… మొహంలో చింత, విచారం వంటివేమీ ఉండవ్… ప్రత్యేకించి తన ఆహార్యంలో కూడా విపరీతమైన బంగారు ఆభరణాలు కనిపించేవి… ఆయనకు అదొక ప్యాషన్ కమ్ ఫ్యాషన్… చేతులకు, మణికట్టుకు, మెడలో కడియాలు, హారాలు, ఉంగరాలు… బంగారమే కాదు, వెండి, డైమండ్స్… తను నడిచొస్తుంటే ఓ బంగారం షాప్ కదిలొస్తున్నట్టే… ఎప్పుడూ తన బంగారం పిచ్చిని దాచుకునే ప్రయత్నం కూడా చేయలేదు… కాలర్ ఎగరేసి, ప్రదర్శించుకునేవాడు… పదుగురిలో తనకు అదొక విశేష గుర్తింపు… గోల్డ్ ఈజ్ మై గాడ్ అని తరచూ చెప్పేవాడు…
ఓ హాలీవుడ్ పాప్ సింగర్‌ను చూశాక తనకు బంగారం మీద ప్రేమ పెరిగిందనీ, అది అదృష్టాన్ని తెచ్చిపెడుతుందనీ చెప్పేవాడు బప్పీ… నిజంగా ఇంట్లో ఎంత బంగారం ఉందో… తన పిల్లలకు, మనవళ్లకు, మనవరాళ్లకు ఎంత ఉందో తెలియదు గానీ… తను ప్లస్ భార్య చిత్రాణికి కలిపి 1721 గ్రాముల బంగారాన్ని అధికారికంగా చూపించాడు ఓ ఎన్నికల అఫిడవిట్‌లో… పదమూడున్నర కిలోల వెండి కూడా..! సరే, ఆయన సంపాదన ఆయన ఇష్టం గానీ తను చేసిన కొన్ని సినిమాలయితే బంగారమే… ప్రత్యేకించి డిస్కో తరహా సాంగ్స్, ట్యూన్స్ యువతను ఉర్రూతలూగించేవి…
హైదరాబాద్… 1982… కాచిగూడ చౌరస్తా… సుబ్బరామిరెడ్డి జంట థియేటర్లు మహేశ్వరి, పరమేశ్వరి… ఒక దాంట్లో నమక్ హలాల్… మరొకదాంట్లో డిస్కో డాన్సర్… రెండు సినిమాలు సూపర్ హిట్ కావడానికి ప్రధానమైన కారణం బప్పీలహిరి… ప్రత్యేకించి నమక్ హలాల్ సినిమాలో ట్యూన్లు, వాటికి తగినట్టుగా అమితాబ్ నటన… యువత జాతర ఆ థియేటర్ల వద్ద… ఈ సినిమా ఎన్ని వారాలు ఆడిందో ఆ నిర్మాతకూ గుర్తులేదేమో బహుశా… దటీజ్ బప్పీలహిరి…
Ads
తను పుట్టింది బెంగాల్… తల్లిదండ్రులిద్దరూ శాస్తీయ గాయకులే… చిన్నప్పటి నుంచే సంగీతం మీద పిచ్చి… మూడేళ్ల నుంచే తబలా మీద శిక్షణ… అదే కాదు, పియానో, గిటార్, సాక్సోఫోన్, ఢోలక్, బోంగోస్… తను కంపోజరే కాదు, సింగర్, యాక్టర్, రికార్డ్ ప్రొడ్యూసర్… అంతేకాదు, పొలిటిషియన్ కూడా…! బెంగాల్, శ్రీరాంపూర్ లోకసభ స్థానం నుంచి 2014లో బీజేపీ తరఫున పోటీచేశాడు… తన పిల్లలూ సంగీతకారులే… మరో హిందీ ప్రముఖ గాయకుడు, కంపోజర్ కిషోర్ కుమార్ తన బంధువే…
యాభై ఏళ్ల స్వర ప్రస్థానంలో హిందీ సినిమాలు బోలెడు, తెలుగులో కూడా చాలా సినిమాలు చేశాడు… ప్రత్యేకించి సింహాసనం, స్టేట్ రౌడీ, గ్యాంగ్ లీడర్… ప్రత్యేకించి గ్యాంగ్ లీడర్ పాటలు ఎంత సూపర్ హిట్టో చెప్పనక్కర్లేదు… బప్పి బెంగాల్, కన్నడ, తమిళ సినిమాలు కొన్ని చేసినా హిందీ పాటలే ఆయన ప్రపంచం… తరువాత తనను వాడుకున్నది తెలుగు నిర్మాతలే… గత ఏడాది కరోనా దాడిచేసింది, దానికితోడు అధిక బరువు… ఆమధ్య ఇండియన్ ఐడల్ షోలో కనిపించాడు, కదలడమే కష్టంగా ఉంది… బహుశా ఈ స్థూలదేహమే తన ప్రధాన అనారోగ్య కారకమేమో… లేకపోతే ఈ 69 ఏళ్లు కాదు, నిండు నూరేళ్లూ బతికేవాడేమో..!!
Share this Article