మొన్నొక వార్త… గప్‌చుప్‌లో బఠానీల స్టఫ్ఫు, రసం బదులు విస్కీ పోసుకుని గప్‌చుప్‌గా లాగిస్తున్నారట కొందరు… ఇష్టపడుతున్నారు, కొత్త ట్రెండ్ అని ఏదేదో రాశారు గానీ… బహుశా కొత్తగా ఉంది కదాని రాసి ఉంటారు గానీ, నిజానికి అలా ఉండదు… పెద్దగా ఎవరూ ఇష్టపడరు…
ఇక ఇక్కడి నుంచి మద్యప్రియులుకాని వాళ్లు డిస్‌కార్డ్ అయిపొండి… నిజానికి ఎక్కువ శాతం మందుప్రియులు తాగుతున్నామనే భావనను ఎంజాయ్ చేస్తారు, తాగడంకన్నా అదే ముఖ్యం వాళ్లకు, మద్యం పరిమాణం ముఖ్యం కాదు, కాస్త మత్తు అనిపించగానే ఆపేస్తారు…
సోషల్ గ్యాదరింగుల్లో, మర్యాదకు ఓ స్మాల్ లేదా ఓ లార్జ్‌తో ముగించేవాళ్లన్నమాట… కొందరికి, అంటే ఫుల్ అడిక్టెడ్ వాళ్లకు కిక్కు ఎక్కితేనే లెక్క… కక్కితేనే కిక్కు… తూలిపోవడం, మాట తూలడం, నిలబడలేకపోవడం దాకా వస్తే వాడినెవడూ బాగు చేయలేడన్నమాట… వాళ్లకు మందు ఓ వ్యసనం… అలాంటివాళ్లు సైతం ఈ గప్‌చుప్ తాగుడును ఇష్టపడరు, ఎందుకంటే..?
Ads
వాడికి గొంతులోకి ద్రవం సరళంగా, తమకు నచ్చిన ఫ్లేవర్, ఘాటుతో దిగిపోవాలి… అంతే తప్ప ఘనపదార్థంతో కలిసి, అంటే స్టఫ్ఫుతో కలిసి కలగాపులగం చేసి మింగరు… ఇంకా నయం, రాను రాను స్టఫ్పులో ఏ మంచూరియా ముక్కనో విస్కీలో ముంచుకుని తిని, కొత్త ట్రెండ్ గురూ అంటారేమో…
ఒకటీరెండు ఉదాహరణలు చెప్పుకుందాం… ఏ మద్యం ఎప్పుడు తాగాలో, ఏ సందర్భంలో ఎంత తాగాలో, ఎలా తాగాలో కూడా మర్యాదపూర్వక లెక్కలుంటయ్ కొన్ని… పార్టీ పెగ్, టేబుల్ పెగ్, కర్టెసీ పెగ్ ఇలా… టెకీలా ఉందనుకొండి, నేరుగా 30 ఎంఎల్ షాట్ కొట్టేయడమే… కాకపోతే చాలామంది వెంటనే కాస్త ఉప్పును నాలుకకు అద్దుకుని నోట్లో నిమ్మబద్ద పెట్టేసుకుంటారు… స్కాచ్ అయితే తాగరు, ఐస్ క్యూబ్స్ వేసుకుని చప్పరిస్తారు, సోడా కోక్ గట్రా కలపరు… సేమ్, వోడ్కా కూడా నేరుగా కొట్టేయడమే… ఇంకేమీ కలపరు… బ్రాందీ, జిన్, రమ్… ప్రతి దానికీ ఓ లెక్క ఉంటుంది…
బీర్ అయితే ఎంత ఫ్రెష్ అయితే అంత టేస్ట్, విస్కీ అయితే ఎంత పాతబడితే అంత టేస్టు, అంత కాస్టు… అదే మహిళలు కూడా తాగే వైన్‌కూ తాగే పద్ధతి ఉంటుంది… ఆబగా గుటగుట తాగితే దాన్ని తాగడం అనరు, అలాగే నిజమైన మద్యంప్రియులు మంచింగ్‌ను పెద్ద సీరియస్‌గా తీసుకోరు… ఏదో కాస్త టైంపాస్ నమలడం, అంతే… సో, గప్‌చుప్ పెగ్, రా పెగ్, దింపకుండా స్ట్రెయిట్ పెగ్ వంటివి చెప్పుకోవడానికి, రాసుకోవడానికి బాగుంటయ్… తప్ప ఎంజాయ్ చేయడానికి కాదు…
అదేదో నాని సినిమాలో ఆమధ్య క్వార్టర్ బాటిల్ మూతవిప్పి నోట్లో పెట్టుకుని, చేత్తో పట్టుకోకుండా మొత్తం తాగేస్తాడు గర్వంగా… నొటోరియస్, హార్డ్ కోర్ డ్రింకర్లు అయితేనే అలా రా పెగ్, స్ట్రెయిట్‌గా కొడతారు, చాలా డేంజర్ కూడా… ఎప్పుడో కాలేయం డామ్మని తన్నేస్తుంది… (కల్లులోనూ ఈత కల్లు వేరు, పోత్తాడి కల్లు వేరు, పండుతాడి కల్లు వేరు, జీలుగ కల్లు వేరు… సారాల్లోనూ అంతే…)
సో, మందు తాగే విధము తెలియండీ జనులారా మీరు… ఎప్పుడైనా విస్కీ షాపుల ముందు గమనించండి, మాస్ ఏరియాల్లో… కొందరు వర్కర్లు పని మధ్యలో ఆపి వస్తారు, ఒకటో రెండో పెగ్గుల్ని ప్లాస్టిక్ గ్లాసులో పోసుకుని, మొత్తం ఒకేసారి కొట్టేస్తారు, వెంటనే ఓ వాటర్ ప్యాకెట్‌ను నోటితో చింపేసి, తాగేస్తారు… అంతే… మరేమీ లేదు… వెళ్లిపోతారు… అదుగో అలాంటి వాళ్లకు ఇలాంటి పద్ధతులు మన్నూమశానాలు ఏమీ వర్తించవు…!!
గప్‌చుప్ పెగ్ గురించి చివరగా, స్ట్రెయిట్‌గా రా పెగ్ తరహాలో చెప్పాలంటే… ఎప్పుడో ఓసారి బొంగులో చికెన్ తింటే మజా… ఎప్పుడూ అదే తింటే..? చింతకాయ పచ్చడి మెతుకులకన్నా అధ్వానం అనిపిస్తుంది మెల్లిమెల్లిగా..!!
Share this Article