ఓటీటీలో ఏకబిగిన సినిమా మొత్తం చూసేసిన సినిమా ఈమధ్యకాలంలో ఇదే… సినిమా పేరు శామ్ బహదూర్… ఇది మన తొలి ఫీల్డ్ మార్షల్, ది గ్రేట్ ఇండియన్ సోల్జర్ మాణెక్ షా బయోపిక్… దర్శకురాలు మేఘన గుల్జార్… భేష్… రాజీ, చెపాక్ సినిమాలు తీసిన ఆమే… భలే సిన్సియర్ ఎఫర్ట్… ఆమెకన్నా రెండు రెట్లు విక్కీ కౌశల్‌ను అభినందించాలి… భేషున్నర… (జీ5 ఓటీటీలో ఉంది… థియేటర్లలో గత డిసెంబరు ఫస్టున రిలీజైంది… వసూళ్లు కూడా కుమ్మేసింది)
కత్రినా కైఫ్ భర్త విక్కీ… యురి, సర్దార్ ఉధమ్ వంటి సినిమాలతో ఆల్‌రెడీ తనొక డిఫరెంట్ హీరోనని నిరూపించుకున్నవాడే… మాణెక్ షాను మాత్రం అచ్చంగా ఆవాహన చేసుకున్నాడు… తన బాడీ లాంగ్వేజీ, హావభావాలు, మాట తీరుతో మళ్లీ మాణెక్ షాను తెరపై ఆవిష్కరించాడు అంటే అతిశయోక్తి కాదు… ఎక్సలెంట్ ఎఫర్ట్.., (మనకూ ఓ బెన్ కింగ్ స్లే ఉన్నాడు…) దర్శకురాలు, రచయిత కూడా షా ఊతపదాలు, పాపులర్ సరదా వ్యాఖ్యలను సందర్భానుగుణంగా భలే వాడుకున్నారు… ‘దేశం కోసం చావడం కాదు సైనికుడి బాధ్యత, శత్రువును చంపి దేశాన్ని కాపాడటం’ ‘మనం ఉండొచ్చు, పోవచ్చు, మన యూనిఫామ్ ఇజ్జత్ నిలవాలి’ ‘మన గౌరవం మన దుస్తుల్లో ఉంది’ ‘మనం దొంగలం కాదు, ఎవరి ఆస్తుల మీదా పడకండి’ వంటి డైలాగులు బాగున్నయ్…
ఎక్కడ ఏ డైలాగ్ వాడాలో అదే… అంతే… నిజానికి ఇలాంటి సినిమాలు మనమెందుకు తీయలేం అని గాంధీ వంటి ఇంగ్లిష్ సినిమాలు చూసినప్పుడు అనిపించేది… మనకు చేతకాదా..? ఎంతసేపూ వెకిలితనం, ఫాల్స్ హీరోయిజం, వెగటుతనం నిండిన కథలు, ఇమేజీ బిల్డప్పులు గట్రా ఉండే కథలు తప్ప… భీకరమైన సూపర్ హీరోయిక్ వేషాలు తప్ప మన హీరోలకు ఇంకే పాత్రలూ చేతకావా అనిపించేది… వైనాట్, మంచి సినిమా తీయడం మనకు ఎందుకు చేతకాదు అని మేఘన గుల్జార్ గంభీరంగా సమాధానం ఇచ్చినట్టుగా ఉంది ఈ సినిమా…
Ads
భారతదేశ రక్షణ, సమగ్రత కోసం పాటుపడిన రియల్ హీరోల బయోపిక్స్ తీయడం ఓ సాహసమే… ఎక్కడా వాళ్లను కించపరిచినట్టు ఉండకూడదు, అతిగా ఎక్స్‌పోజ్ చేయకూడదు, కొంత సినిమాటిక్ లిబర్టీ తప్ప అసలు కథలో ఎడాపెడా మార్పులు చేయకూడదు… వాళ్ల వ్యక్తిత్వాలపై మచ్చ వేయకూడదు… డాక్యుమెంటరీ కాకూడదు… నిఝంగా నిఝం… శామ్ బహదూర్ సినిమాలో వెంట్రుకమందం కూడా కమర్షియల్ వెగటు వాసనల్లేవు… ఒక్కచోట ఒక్క సీన్ కూడా కథను దాటి పక్కకు పోలేదు… అచ్చంగా మాణెక్ షా జీవితాన్ని, తన విజయాల్ని, కాదు, ఈ దేశం విజయాల్ని అక్షరాలా కళ్లముందుంచింది…
ఇండియన్ మిలిటరీ అకాడమీలో శిక్షణ కాలం నుంచి మొదలుపెట్టి… జపాన్ ఆర్మీతో పోరాటం, కాశ్మీర్ ఆక్రమణకు ప్రయత్నించిన పాకిస్థాన్‌పై పోరాటం, ప్రత్యేకించి బంగ్లాదేశ్ విముక్తి పోరాటం వరకు అన్ని కాలాల సీన్లను రీక్రియేట్ చేశారు… ఆయా కాలాల్లోకి మనల్ని తీసుకువెళ్తుంది మేఘన టీమ్… వాహనాలు, తుపాకులు, ట్యాంకులు, దుస్తులు గట్రా అన్నీ నాటి రెట్రో వాతావరణాన్ని సృష్టించాయి… మిలిటరీ వాతావరణాన్ని ప్రతిచోటా సాక్షాత్కరింపజేసింది… బంగ్లాదేశ్ యుద్దానికి మన ఆర్మీని సన్నద్ధం చేసినప్పుడు పాటలో మన వివిధ ప్రాంతాల ఆర్మీ రెజిమెంట్లను చూపిస్తూ, వాళ్ల నినాదాల్ని యథాతథంగా వినిపిస్తూ సాగే పాట సూపర్బ్… బీజీఎం అంటే దడదడ మోతలు కాదని ఈ సినిమా బీజీఎం గుర్తుచేస్తూ ఉంటుంది…
మన జలియన్‌వాలా బాగ్ వంటి దురంతమే ఢాకా యూనివర్శిటీలోనూ సాగుతుంది… బాగా చిత్రీకరించారు… ప్రత్యేకించి యాహ్యా ఖాన్ (పాకిస్థాన్ ఆర్మీ చీఫ్)తో మాణెక్ షా దోస్తీ, తరువాత అదే యాహ్యాఖాన్‌పై బంగ్లాదేశ్ వార్‌లో మాణెక్ షా విజయం ఏమాత్రం అతి లేకుండా ఉంది… ప్రత్యేకించి కాశ్మీర్ నుంచి మహారాజును తీసుకువచ్చేటప్పుడు రన్ వే మీద సైనికులను వరుసగా నిలిపి, వెలిగే కాగడాలనే సిగ్నల్ లైట్లుగా చేసి, విమానం టేకాఫ్ అయ్యే సీన్ కంటికింపుగా ఉంది… షా రిటైర్‌మెంట్ దగ్గర కథ ఆపేశారు… హాస్పిటల్‌లో షాను పరామర్శించడానికి కలాం వెళ్లిన సీన్ కూడా యాడ్ చేస్తే మరింత బాగుండేదేమో అనిపించింది…
షా జీవితంలోని కీలక సందర్భాల్లో పరిణామాల్ని ఆనాటి వీడియో క్లిప్పులు, పేపర్ క్లిప్పింగులు, రేడియో వార్తలతో చెప్పడం బాగుంది… ఎస్, ఇలా ఏ కమర్షియల్ వాసనలు లేని సినిమా తీస్తే రిటర్న్స్ ఎలా అని నిర్మాతలు ఆలోచించలేదు… మేఘనకు ఫుల్ స్వేచ్ఛను ఇచ్చారు… ఆమె ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంది… ఎస్, ఇదుగో ఇలాంటి సినిమాల్నే పిల్లలకు చూపించాల్సింది… మన యానిమల్స్, కుర్చీ మడతపెట్టే దరిద్రాలు కాదు… సినిమా అంటే వినోదమే కాదు… ఈకాలంలో దానంత బలమైన కమ్యూనికేషన్ వేరే లేదు… సినిమా అంటే చరిత్ర కూడా, విజ్ఞానం కూడా, స్పూర్తిదాయని కూడా…
ఎన్నో చెత్తా సినిమాలను పలు భాషల్లోకి తర్జుమా చేస్తుంటారు, పాన్ ఇండియా అంటారు, అసలు ఇవి కదా పాన్ ఇండియా సినిమాలు… కనీసం జీ5లో పెట్టినప్పుడు తెలుగు, ఇతర భాషల వెర్షన్లను పెట్టినా బాగుండేది… అఫ్‌కోర్స్ హిందీలోనే డైలాగులు బాగున్నయ్, తెలుగులోకి అనువదిస్తే వధించినట్టు అయ్యేదేమో… సినిమాను ఎంచక్కా చూడొచ్చు… కాదు, కాదు… చూడాలి… మన దేశ చరిత్ర, మన ఆర్మీ విజయాలు, స్వాతంత్రం నాటి పరిణామాలు గట్రా ఓసారి మాణెక్ షా కోణంలో అవలోకనం చేసుకోవడానికి చూడాలి…! (ప్లీజ్, ఈ సినిమా చూశాక మన తెలుగు సినిమాలు, మన హీరోలు, మన దర్శకులతో పోల్చుకోకండి… మన థర్డ్ రేట్ టేస్టుల గురించీ ఆలోచించకండి…)
Share this Article