కేసీయార్ ఏదో గొప్ప సాధించాడు అని రాయడానికి మనసొప్పకపోతే పోనీ… కానీ నిజాన్ని రాయాలి కదా…! ఆనందపడే ఓ సామాజిక మార్పును తెలియజెప్పాలి కదా..! కేసముద్రంలో ఒక కుటుంబం ఆడపిల్లను కన్న తమ కోడలికి అపూర్వంగా స్వాగతం పలికిన వార్తను దాదాపు అన్ని పత్రికలూ వేశాయి… (అందులోని విశేషాన్ని గుర్తించలేని ఓ పెద్ద దరిద్రం తప్ప)… అది దేనికి సూచిక..? తెలంగాణ సమాజం ఆడపిల్లను మహాలక్ష్మిగానే భావిస్తోంది… ఆడపిల్ల అని తెలుసుకుని అబార్షన్లు చేయడాలు, పుట్టగానే చంపేయడాలు వంటి ఉత్తరాది నైచ్యం మన సమాజంలో లేదు అని చెబుతోంది… మనం ఉన్నతంగా ఉన్నాం అని చెబుతోంది…
పోనీ, దీనికి సరిపడా గణాంకాలు ఉన్నాయా..? ఈ ప్రశ్నకు సమాధానం ఉంది… తెలంగాణ సమాజంలో ప్రస్తుతం మగ జనాభా కన్నా ఆడ జనాభా ఎక్కువ… ఉత్తరాదిలో ఒకటీరెండు రాష్ట్రాల్లో వెయ్యి మంది మగాళ్లకు మరీ 800 ఆడాళ్లున్న దశల్నీ చూశాం మనం… తెలంగాణలోనూ ఒకప్పుడు ఈ దుర్మార్గం కనిపించేది… కానీ ఇప్పుడు..?
Ads
సమాజంలో చైతన్యం వచ్చింది… వైద్య సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి… శిశుమరణాలు తగ్గాయి, ప్రసూతి మరణాలు తగ్గాయి… సంస్థాగత ప్రసవాలు పెరిగాయి… బిడ్డకూబిడ్డకూ నడుమ ఎడం పెరుగుతోంది… సరైన ఫ్యామిలీ ప్లానింగ్ జరుగుతోంది… అంతేకాదు, ఆడ అబార్షన్లు తగ్గాయి… మగ, ఆడ ఎవరయితేనేం అనే ధోరణి వస్తోంది… కొన్నేళ్ల క్రితం వెయ్యి మంది మగాళ్లకు 1007 మంది మహిళలు ఉండేవాళ్లు… ఇప్పుడది 1049కు పెరిగింది… (నిజం చెప్పాలంటే… ఆడపిల్లలే నయం అనే ధోరణి కూడా పెరిగింది)
నిజంగానే అభివృద్ధి కాముకులకు ఆనందాన్ని ఇచ్చే వార్త ఇది… నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే తేల్చిన గణాంకాలే ఇవి… కానీ మన మీడియా ఏం రాసింది..? ఇవన్నీ ఏవో అలా అలా టచ్ చేసి… తెలంగాణలో మస్తు తాగుతున్నరు… మహిళలు కూడా తాగుతున్నరు… తెలంగాణ మందు తాగడంలోనే నంబర్ వన్… టాప్… అసలు పల్లెల్లోనే కిక్కు ఎక్కువ… అంటూ దిక్కుమాలిన యాంగిల్ తీసుకుని, బదనాం చేస్తున్నట్టుగా, వెక్కిరిస్తున్నట్టుగా రాసుకుంటూ పోయింది… (అందుకే ఆంధ్రా మీడియా ఆంధ్రా మీడియాయే…)
గుజరాత్లో ప్రతి 16 మందిలో కేవలం ఒక్కరే మందు తాగుతున్నారని ఓ అబ్జర్వేషన్… అక్కడ ఏళ్లుగా మద్యనిషేధం ఉంది… సహజంగానే ఆ రాష్ట్రంలో మాంసాహారం, మద్యపానం తక్కువ… దాంతో తెలంగాణకు పోలిక ఏమిటసలు..? చావుకు, పుట్టుకకు మాత్రమే కాదు, ఏ సందర్భమైనా సరే, పదిమందితో కలిసి చుక్కేయడం తెలంగాణలో తరతరాలుగా ఉంది… ఆనందాన్ని, విషాదాన్ని కూడా మందు ముందు పెట్టుకుని మందితో షేర్ చేసుకుంటారు…
మహిళలు మాత్రం మనుషులు కారా..? ఓ చుక్కేస్తే తప్పేమిటి..? పొగతాగితే తప్పుపడదాం… అది అనారోగ్య కారకం కాబట్టి… కానీ ఎప్పుడో ఓసారి అకేషనల్గా ఓ పెగ్గేస్తే… ఇలా వెక్కిరించాలా..?
చివరకు జిల్లా పత్రికలు సైతం అలాంటి కథనాల్నే తీసుకున్నాయి… అసలు మేల్, ఫిమేల్ రేషియోలో పెరుగుదలను మంచిగా హైలైట్ చేసిన పత్రిక ఒక్కటైనా ఉందా..? కనీసం ప్రభుత్వ కమ్యూనికేషన్స్ విభాగాలకు కూడా చేతకాలేదు… మంచి మార్పు మనకు పట్టడం లేదు… ఏదో పిచ్చి కోణం పట్టేసుకుని, టాం టాం చేసి, తెలంగాణ సమాజాన్ని వెక్కిరించడం మాత్రం తెలుగు మీడియాకు బాగా చేతనవుతోంది… యద్భావం తద్భవతి… ఎంతసేపూ ఆ మందు గోలేనా..?! హాస్పిటళ్లలో మందు గోళీ గురించీ ఆలోచించాలి కదా…!!
Share this Article