.
ఈరోజు నాకు పత్రికల్లో నచ్చిన వార్త ఇది… తెల్లారిలేస్తే చాలు పత్రికల్లో టీవీలు చెత్త పొలిటికల్ స్వనిందలు, పరనిందలు, బూతులు, దోపిడీలు, నేరాలు, యుద్ధాలు, హత్యలు, అత్యాచారాలు… ఫుల్లు నెగెటివిటీ అలుముకుంటోంది…
అసలే లోకంలో ఎవడినీ ఎవడూ నమ్మలేని రోజులు… ఎవడిని ఎలా ముంచేద్దామనేకుట్రలు, కుటిల ఆలోచనలు… కాస్తో కూస్తో పాజిటివిటీని పెంచే వార్తల్లేవు, దొరికినా రాసేవాడు లేడు… అందుకే ఆంధ్రజ్యోతిలో కనిపించిన ఈ వార్త నచ్చింది…
Ads
ఇదీ ఆ వార్త…
ఎవరు ఏమైపోతో మాకేంటి… అనుకొనే రోజులివి! కానీ వారు అలా అనుకోలేదు. ఎప్పుడో 18 ఏళ్ల క్రితం మరణించిన తమ స్నేహితుడి కుమార్తె వివాహానికి పెళ్లి పెద్దలుగా మారారు. పల్లకి మోసి మరీ దగ్గరుండి పెళ్లి చేశారు.
మిత్రుడి కుమార్తెను సొంత బిడ్డలాగా పెళ్లి కుమార్తెను చేసి, అత్తారింటి సాగనంపిన అపురూప ఘట్టం నంద్యాల జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. ఆళ్లగడ్డ తాలుకా రుద్రవరం మండలం నల్లవాగుపల్లె గ్రామానికి చెందిన స్నేహితులు ప్రభాకర్, శివకుమార్ రెడ్డి, చంద్రలాల్, మృత్యుంజేయ, రఘువీర్ రాధా కృష్ణ తదితరులు నంద్యాలలోని శ్రీరామకృష్ణ విద్యాలయంలో 1982-83 లో పదో తరగతి పూర్తి చేశారు.
వీరిలో ప్రభాకర్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రభాకర్ 2007లో అనారోగ్యంతో మృతిచెందారు. అయితే అతని స్నేహితులు.. ప్రభాకర్ కుటుంబానికి ఐదు ఎకరాల భూమి ఇప్పించడంతో పాటు అన్ని విధాలా అండగా నిలిచారు. ప్రభాకర్ భార్య సువర్ణ వ్యవసాయం చేసుకుంటూ కుమార్తెలను చదివించారు.
పెద్ద కుమార్తె లక్ష్మీ డిగ్రీ పూర్తి చేసింది. రెండో కుమార్తె బిటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. లక్ష్మికి ఇటీవల ఆళ్లగడ్డ మండలం దాచేపల్లికి చెందిన పవన్‌తో పెళ్లి నిశ్చయమైంది. ఈ క్రమంలో అదే మండలంలోని రామతీర్థం ఆలయంలో స్నేహితులు దగ్గరుండి వైభవంగా వివాహం జరిపించారు.
స్నేహితులు పెళ్లి పనులతో పాటు పెళ్లికుమార్తె పల్లకి కూడా మోసి స్నేహమంటే ఇదేరా! అని చాటి చెప్పారు…
ఇదీ ఆ వార్త… ఎప్పుడో 1982లో క్లాస్‌మేట్స్ వాళ్లు… అదీ టెన్త్ క్లాసులో… ఇన్నేళ్లయినా తమ క్లాస్‌మేట్ కుటుంబాన్ని వాళ్లు ఆదుకున్న తీరు నిజంగా అభినందనీయం… ఇలాంటి స్నేహితులను సంపాదించుకున్న ఆ ప్రభాకర్ ఆత్మ ఆనందపడి ఉంటుంది, బిడ్డ పెళ్లిపల్లకీ మోస్తున్న తన క్లాస్‌మేట్లను చూసి…
అనేకచోట్ల స్కూల్ రీయూనియన్లు, కాలేజీ రీయూనియన్లు జరుగుతూ ఉన్నాయి కదా… ఇలాంటివి పంచుకొండి…! లేవా..? ఈ కథను మీమీ వాట్సప్ గ్రూపుల్లో పంచుకొండి… పాజిటివిటీ పదిమందినీ చేరుతుంది.., ప్రస్తుత సమాజానికి ఇవే అవసరం..!
చివరగా… అన్ని స్నేహాల్లోకెల్లా చెడ్డీదోస్తానాను మించింది లేదేమో..!!
Share this Article