.
అసలు ఈ జీతెలుగు వాడికి ఏం పుట్టింది..? టీవీ సీరియళ్ల ఫార్ములా పోకడలు, అంటే అత్తలు, ఆడపడుచుల విలనీ కదా సబ్జెక్టు…! వీలయితే ఒకటోరెండో మగ కేరక్టర్లనూ ఆ విలనీకి తోడుగా నడిపించాలి కదా…
మధ్య మధ్య క్షుద్ర పూజలు, మంత్రాలు, మూఢ నమ్మకాలతో కథల్లో ట్విస్టులు పెట్టాలి కదా… అవసరమైతే ఒక ఎపిసోడ్‌కూ మరో ఎపిసోడ్‌కూ లింక్ లేకుండా కథ అడ్డదిడ్డంగా నడిపించగలగాలి కదా… ఏ టీవీ చానెల్ అయినా సరే ఈ పద్దతిని ఫాలో కావాలి కదా… పనికిమాలిన చెత్తంతా ప్రేక్షకుల మెదళ్లకు ఎక్కించాలి కదా…
Ads
ఈ సంప్రదాయాన్ని బ్రేక్ చేస్తే ఎలా..? ఉదాహరణకు జగద్ధాత్రి సీరియల్… రాత్రి అనుకోకుండా ఒక ఎపిసోడ్ చూడబడ్డాను… హీరోయిన్ దీప్తి మన్నె… రీసెంటుగా పెళ్లి చేసుకుంది… బాగా చేస్తోంది… ఈ ఎపిసోడ్ దగ్గరకు వద్దాం…

కథ నుంచి డీవియేట్ అయిపోయి… ఆత్మహత్య చేసుకోబోయిన ఓ రైతు కుటుంబానికి అండగా నిలుస్తుంది… బ్యాంక్ లోన్ల రికవరీకి ఏజెన్సీలను నియమించుకుంటాయి… అవి రౌడీ కేరక్టర్లను రంగంలోకి దింపుతాయి… వాడెవడో ఈ రైతు కుటుంబం దగ్గరకు వచ్చి, రేపటిలోగా అప్పు చెల్లించకపోతే రైతు బిడ్డను ఎత్తుకుపోతాను అని బెదిరిస్తాడు… దాంతో వాళ్లు సామూహికంగా ఆత్మహత్యకు ప్రయత్నిస్తారు…
అనుకోకుండా ఆ రైతు చేతిలో పెస్టిసైడ్ సీసా చూసి, ఆయన్ని వెంబడించి, ఆత్మహత్య ప్రయత్నాన్ని ఆపి… ఆ లోన్ రికవరీ రౌడీలను పిలిపిస్తుంది జగద్ధాత్రి… వాడికి క్లాస్ పీకుతుంది… లోన్ రికవరీ పద్ధతి, షరతులు, పరిమితులను ఆమె చెప్పిన ఇన్‌ఫర్మేషన్ బాగుంది… ఈ సీరియల్ రచయితలు ఎవరో కాస్త వర్క్ చేసినట్టున్నారు… గుడ్…

ఇక్కడ సమస్య ఏమిటంటే..,? ఇలా జనానికి, సమాజానికి మంచి ఇన్‌ఫర్మేషన్, అప్పుల బాధితుల్లో కాస్త స్థయిర్యాన్ని నింపే ఇలాంటి ఎపిసోడ్లు టీవీ సీరియళ్ల చెత్తా ధోరణలకు వ్యతిరేకం కదా… అలా ఎలా చేస్తున్నది జీతెలుగు యాజమాన్యం..?
హేమిటో… రాను రాను జీతెలుగు వాళ్లు ఇలా చెడిపోవడం ఏమిటో అస్సలు సమజ్ కావడం లేదు… ప్చ్, టీవీ సీరియళ్ల పవిత్రమైన పోకడలను బద్ధలు కొట్టడం ఏమిటో..! టీవీ సీరియళ్లకు మహారాజ పోషకులు, సారీ మహారాణి పోషకులైన ఆడ లేడీస్ తీవ్రంగా వ్యతిరేకించాలి..!!
Share this Article