ఫైమా..! ఈమె గురించి కాస్త చెప్పుకోవాలి… చెప్పుకునేట్టు చేస్తోంది… తెలుగు టీవీ ప్రోగ్రామ్స్ రెగ్యులర్గా చూసేవాళ్లకు ఈమె ఎవరో తెలుసు… గతంలో ఈమె పటాస్, పోవేపోరా షోలలో కనిపించింది… కానీ వాటిని చూసేవాళ్లు లేరు కాబట్టి పెద్దగా చాలామందికి తెలియదు… కానీ ఇప్పుడు జబర్దస్త్లో రెగ్యులర్ ఆర్టిస్ట్ ఈమె… సో, చాలామందికి తెరపరిచయమే… మామూలు పరిచయం కాదు… చూస్తేనేమో బక్కపలుచగా… కాస్త డార్క్ షేడ్లో… పెద్దగా ఆకట్టుకునే పర్సనాలిటీ కాదు… కానీ ఇదే ఆమెను నిలబెట్టిందేమో… తోటి కమెడియన్లు, స్క్రిప్టు రైటర్లు ఆమె ఫిజికల్ అప్పియరెన్స్ మీద జోకులు వేస్తున్నారు… వెకిలి వ్యాఖ్యలు… బాడీ షేమింగ్… అయితేనేం, ఆమె వాటినే తన బలాలుగా మార్చుకుంది… ఆమెలోని ఎనర్జీ, కామెడీ టైమింగు చూస్తే ముచ్చటేస్తుంది… అవసరమైతే మరింత నలుపును పులుముకుని మరీ స్కిట్స్ చేస్తోంది… కొందరు సీనియర్ కమెడియన్లు కూడా ఆమె టైమింగ్ ముందు వెలవెలబోతున్నారు… అందుకే ఈమె గురించి మనం చెప్పుకుంటున్నాం…
నిజానికి ఈటీవీ నడుస్తున్నదే ఈ జబర్దస్త్ షో రేటింగుల మీద… జనం కూడా చెత్తా బూతు షో అంటూనే చూస్తుంటారు… మరీ రోజా పెత్తనం ఎక్కువయ్యాక ఆ స్కిట్లలో కామెడీ కూడా నానాటికీ కరువైపోయింది… సగం పంచులు ఆమే వేసి, అదో ఘనకార్యంలాగా తనే పడీ పడీ నవ్వుతూ ఉంటుంది… ఆ కమెడియన్లు తిట్టుకోలేక, ఏమీ అనలేక నానా చావూ చస్తుంటారు… కాస్త ఎప్పుడైనా ధైర్యం చేసి హైపర్ ఆది ఈ ధోరణి మీదా చెణుకులు వేస్తాడు గానీ, మారిపోతే రోజా ఎందుకవుతుంది..? అసలే శశిరేఖ వంటి పాత్రల్ని కూడా పోషిస్తూ ఈటీవీని తెగ ఉద్దరిస్తున్నదాయె..!! ఫస్ట్ నుంచీ ఈ షోకు లేడీ గెటప్పులు తప్ప నిజమైన లేడీ యాక్టర్లను తీసుకోవడం లేదు ఎందుకో… చమ్మక్ చంద్ర టీంలో సత్య బాగానే చేసేది కానీ ఆమె కూడా వెళ్లిపోయింది… స్టార్ మా, జీ తెలుగులో కూడా ఒకటీ అరా కామెడీ ప్రోగ్రామ్స్ వచ్చినా, లేడీ కమెడియన్లు ఎవరూ పెద్దగా ఎమర్జ్ కాలేదు… ఈటీవీలోనే ఎక్కువగా కనిపించే రోహిణి భలే క్లిక్కయింది… డాన్స్, ఎమోషన్, కామెడీ, సీరియస్… ఏదైనా సరే అదరగొట్టేస్తోంది… నిజానికి ఆమె సినిమాల్లో లేడీ కమెడియన్గా పనికొచ్చే కేరక్టర్… ఎలాగూ కామెడీ పండించే లేడీ ఆర్టిస్టులు ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదు కూడా…
Ads
రీతూ అందంగానే ఉంటుంది కానీ, ఆమెలో ఓ లోపం… స్కిట్ నడుస్తుంటే మధ్యలో తనే నవ్వేస్తుంది, పాత్ర నుంచి బయటికి వచ్చేస్తుంది… దాంతో ఆమె షైన్ కావడం లేదు… సేమ్ ప్రాబ్లం వర్షకు కూడా… వర్ష బాగా చేయగలదు, కానీ స్కిట్లో ఇన్వాల్వ్ కావాలి ఇంకా… తనకు నిలదొక్కుకునే స్కోప్ ఉంది, మెరిట్ కూడా ఉంది… నిజానికి కామెడీ చేయడం కష్టం… అందుకే ఆర్టిస్టులు పెద్దగా నిలదొక్కుకోవడం లేదు… ఇప్పుడున్న స్థితిలో కమెడియన్లకు మంచి ఆర్జన ఉంది, పాపులారిటీ ఉంది, లేడీ ఆర్టిస్టులకు కొరత కూడా ఉంది… లేడీ ఆర్టిస్టులు కామెడీ ప్రాక్టీస్ చేస్తే మంచిదే… మాటీవీలో సుజాత, ఆషు, అరియానా తదితరులు కాస్త ట్రై చేసినా పెద్దగా క్లిక్ కావడం లేదు… ఇదుగో ఇలాంటి టఫ్ స్థితిలోనూ ఫైమా క్లిక్కవుతోంది… బాడీ షేమింగుదేముందిలెండి… హైపర్ ఆది అయితే విష్ణుప్రియ ముక్కు మీద ఇప్పటికి వందసార్లు పంచులు వేసి ఉంటాడు… రోహిణి లావు మీద కూడా…! అసలు ఆది వెక్కిరించని వాళ్లు ఎవరున్నారు..? రష్మి, అనసూయ తప్ప… వాళ్లను ఏమైనా అంటే వాళ్లు ఊరుకోరు కదా, అక్కడే నిలబెట్టి సర్ఫ్ లేకుండా కడిగేస్తారు… అందుకే మిగతావాళ్లను వెక్కిరిస్తూ ఉంటాడు… నిజానికి బాడీ షేమింగ్ ద్వారా కామెడీ పుట్టించాలనుకోవడం నీచమైన అభిరుచి… ఐనా సరే, ఆ బురద నుంచే ఫైమా ఎదుగుతోంది… కీపిటప్ ఫైమా… ఆల్ ది బెస్ట్..!!
Share this Article