ఒకప్పుడు పెద్దలు శతాయుష్మాన్‌భవ అని దీవించేవాళ్లు… అంటే నూరేళ్లూ చల్లగా బతుకు అని..! కానీ ఒకప్పుడు మనిషి ఆయుర్దాయం 50 నుంచి 60 ఏళ్లే… పురిట్లో మరణం దగ్గర నుంచి రకరకాల వ్యాధులు, ప్రమాదాల బారిన పడి యుక్త వయస్సులోనే మరణించేవారినీ కలిపి, సగటు లెక్కేస్తే 40- 50 మాత్రమే ఉండేది… కానీ ఈరోజుల్లో 60 ఏళ్ల వయస్సు అనేది ముసలితనం కానేకాదు… మీరు 60 ఇయర్స్ నిండినవారిని చూడండి… యంగ్ కనిపిస్తుంటారు…
గతంలో చెప్పేవాళ్లు 50 దాటితే, ఇక లైఫంతా బోనసే అని… కాదు, ఆ కాలం పోయింది… మెడికల్ పరిశోధనలు, అనేక మొండి వ్యాధులకు మందులు, టీకాలు, చికిత్సలో ఆధునిక పద్ధతులు గట్రా మనిషి ఆయుర్దాయాన్ని గణనీయంగా పెంచాయి… ఈరోజు మరీ కేన్సర్లు, ప్రమాదాల బారిన పడకుండా ఉంటే 80 ఏళ్లు బతుకుతున్నారు… సో, ఇప్పుడు 70 దాటితే మిగతా బతుకు బోనసేనోయ్ అనొచ్చు… అయితే ఇదేసమయంలో లైఫ్ స్టయిల్ వ్యాధులు పెరిగిపోయాయనేదీ నిజం… ఇక ఆ చర్చలోకి వెళ్లకుండా ఈ వార్త విషయానికి వద్దాం…
ఆంధ్రజ్యోతి నవ్యలో ఓ స్టోరీ వచ్చింది… హెడింగ్… ఈ వందేళ్లలో ఒక్కసారీ గుడ్డు తినలేదు… నిజానికి ఈ హెడింగ్ గనుక ఈనాడులో ఎవరైనా పెడితే, మరుక్షణం కొలువు పోయి ఉండేది… రామోజీరావు వియ్యంకుడికి ఉన్న కోళ్ల వ్యాపారం కదా… గుడ్లకు వ్యతిరేకంగా ఒక్క ముక్క కూడా రాదు, వస్తే కొలువు ఊడిపోయి, గుడ్లు తేలేయాల్సిందే… నిజానికి కోడిగుడ్డు తినకపోవడం వల్ల చాలాకాలం బతికాడు అనే తప్పు అర్థం కూడా ఈ హెడింగ్ వల్ల వస్తుంది, కాబట్టి ప్రొఫెషనల్‌గా కూడా ఈ హెడింగ్ తప్పు… కోడిగుడ్డు చాలా కోణాల్లో మంచిదే… (పచ్చసొన మీద భిన్నాభిప్రాయాలున్నా సరే)…
Ads
అప్పసాని శేషగిరిరావు… నూరేళ్లు బతికిన ఆయన ఇంకా ఆరోగ్యంగా ఉండి, 101లోకి అడుగుపెడుతున్నాడు… స్టోరీ రాయాల్సిన ఆయుష్షే… కానీ తను చెప్పిన వివరాలకు నిజంగా అంత ప్రాధాన్యం ఉందా..? ఇదీ ప్రశ్న… మాంసం తినలేదు… కనీసం గుడ్డు కూడా తినలేదు… ప్రొటీన్ కావాలంటే శాకాహారంలో బోలెడు మార్గాలున్నయ్… మాంసం అక్కర్లేదు… ఇదీ ఆయన వివరణ… కానీ మాంసం తింటూ వందేళ్లకు పైబడి బతికినవాళ్లు బోలెడు… మాంసానికీ ఆయుష్షుకూ సంబంధం లేదు… మంచి అలవాట్లతో ఉన్నా సరే టపీమని ఎగిరిపోరనే గ్యారంటీ కూడా ఏమీలేదు…
పల్లె కాబట్టి కాలుష్యానికి దూరంగా బతికాను అనేది ప్లస్ పాయింటే… ఆ కోణంలో లక్కీ మ్యాన్… రోజూ వాకింగ్ వెళ్తాను… గుడ్ మంచి అలవాటే, శారీరక శ్రమకు ఏదో ఒక వ్యాపకం కావాలి, కానీ దానివల్ల ఆయుష్షు పెరుగుతుందనే సూత్రీకరణ తప్పు… చక్కెర, నూనె వాడకం తక్కువ… గుడ్, ఇదీ మంచి సలహాయే… ఆల్కహాల్, సిగరెట్లు అలవాటు లేవు… బీపీ లేదు, సుగర్ లేదు… గుడ్, ఇవీ మంచి అలవాట్లే… టెన్షన్లు లేకుండా ప్రశాంతంగా బతకాలి, అదే పూర్ణాయుర్ధాయం అంటున్నాడు…
వోకే, టెన్షన్లు లేని బతుకు మంచిదే… కానీ ఆల్కహాల్, సిగరెట్ల అలవాట్లుండీ… మాంసం, గుడ్లు తింటూ కూడా బోలెడు మంది కనీసం 90 ఏళ్ల వరకూ బతికిన ఉదాహరణలు ఈమధ్య కనిపిస్తున్నాయి… ప్రతి మనిషికీ ఓ బాడీ కాన్‌స్టిట్యూషన్ ఉంటుంది… అది దిట్టంగా, బలంగా ఉంటే ఏది వచ్చినా దేహం ఎదుర్కుంటుంది… అన్నీ జీర్ణం చేసుకుంటుంది, అవసరం లేనివి విసర్జిస్తుంది… అంతేతప్ప కేవలం అలవాట్లే మనిషి ఆయుష్షు నిర్ధారిస్తాయని ఇదమిద్ధంగా చెప్పలేం… ఆయన చెబుతున్న అలవాట్లు మంచివే… కానీ అవే ఆయుష్షును పెంచుతాయనే భావన టెక్నికల్‌గా కరెక్టు కాదు… కేన్సర్లు, అకస్మాత్తుగా ముంచుకొచ్చే కరోనాలు గట్రా ఎంత మంచి అలవాట్లున్ వ్యక్తినైనా ఇట్టే కబళిస్తాయి… అలాగని మంచి అలవాట్లు వద్దని కాదు… కానీ వాటితోనే ఎక్కువ కాలం బతుకుతామనేది సరైన సూత్రీకరణయితే కాదు…!!
Share this Article