నిజానికి ఈ వార్తకు మీడియాలో మంచి ప్రాధాన్యత లభిస్తుందని అనుకున్నా…! వార్త ఏమిటంటే..? సింగరేణి సంస్థ పీఎస్పీపీ, అంటే పంప్డ్ స్టోరేజీ పవర్ ప్లాంట్ నిర్మించబోతోంది… అంటే ఏమిటి..?
దిగువన ఓ రిజర్వాయర్… పైన ఓ రిజర్వాయర్… పవర్ డిమాండ్ తక్కువగా (ఆఫ్ పీక్ అవర్స్) ఉన్నప్పుడు కింది రిజర్వాయర్ నుంచి నీటిని పైకి తోడిపోస్తారు… పవర్ డిమాండ్ (పీక్ అవర్స్) ఉన్నవేళల్లో ఆ రిజర్వాయర్ నుంచి కిందకు పంపిస్తూ జలవిద్యుత్తు ఉత్పత్తి చేస్తారు…
సౌరవిద్యుత్తు అందుబాటులో ఉంటే, నీటిని పైకి ఎత్తిపోయడానికి ఆ విద్యుత్తు వాడతారు… ఈ పద్ధతినే హైబ్రీడ్ పవర్ జనరేషన్ అనీ అంటుంటారు… ప్రైవేటు రంగంలో ఇలాంటి ప్లాంట్లు వస్తున్నాయి… ప్రభుత్వ యాజమాన్యంలోని సింగరేణి ఆ దిశగా ఆలోచన చేయడం శుభం… సింగరేణికి ఇది కాస్త ఈజీ.., ఓ నిర్మాణాత్మక, ఉపయుక్త ఆలోచన చేస్తోంది… ఎలాగంటే..?
Ads
గనుల్ని తవ్వుతూ పోతుంటారు కదా… ఓపెన్ కాస్ట్ గనులైతే కిలోమీటర్ల కొద్దీ విస్తీర్ణంలో లోతుగా తవ్వుతారు… ఇప్పుడు వాటిని అలా వదిలేయకుండా… రిజర్వాయర్లుగా మార్చాలని, పంప్డ్ స్టోరేజీ పవర్ ప్లాంటు నిర్మాణాలుగా వాడుకోవాలనీ ప్లాన్…
దీనివల్ల పీక్ అవర్స్ లో పవర్ జనరేట్ చేసుకోవడానికి అదనపు సామర్థ్యం సమకూరినట్టే..! మార్కెట్‌లో ఆఫ్ పీక్ రేటు వేరు, పీక్ అవర్స్ రేటు… సో, ఇది అన్నిరకాలుగానూ ప్రయోజనకరం… కమర్షియల్ కోణంలోనూ…
ఇదేకాదు, సంప్రదాయేతర విద్యుదుత్పత్తి దిశలో ఇంకా చాలా ప్రయోగాలు జరగాల్సి ఉంది… జరుగుతున్నాయి… ఇంకా ఇంకా థర్మల్ ప్లాంట్ల మీద ఆధారపడే పరిస్థితి లేదు… నిజానికి శ్రీశైలం వంటి పవర్ హౌజుల్లో కూడా రివర్సబుల్ పంపింగ్ సిస్టం ఉంది… అంటే ఒకసారి దిగువకు వదిలేసిన నీటిని మళ్లీ అవే మోటార్లతో పైకి తోడిపోసుకోవచ్చు… మళ్లీ మళ్లీ పవర్ జనరేట్ చేసుకోవచ్చు… దాన్ని ఎంతవరకూ సద్వినియోగం చేసుకుంటున్నామనేది పే-ద్ద ప్రశ్న…
సింగరేణి విషయానికే వస్తే… కాలంతో పాటు అదీ మారాలి… బొగ్గు గనులను మాకిచ్చేయండి, మేం తవ్వుకుంటాం అనే ధోరణి ఇకపై కుదరదు… ఇతర మైనింగ్ సంస్థలకు దీటుగా వేలంలో నిలవాలి, దక్కించుకోవాలి… ఎందుకంటే, సింగరేణి అనుభవం, సామర్థ్యం ముందు ప్రైవేటు కంపెనీలు పోటీలో నిలబడలేవు కాబట్టి… ఇతర రాష్ట్రాలు, ఇతర మైనింగ్ కంట్రాక్టుల మీద కూడా దృష్టి సారించాలి…
అంతేకాదు, భిన్నమైన రంగాల్లోకి ప్రవేశించాలి… ఇప్పటికే థర్మల్ విద్యుత్తు ప్లాంట్ల వైపు మళ్లింది… పైగా ఇవి పిట్ హెడ్ స్టేషన్లు, బొగ్గు రవాణా ఖర్చు ఉండదు, సొంత బొగ్గు… తక్కువ రేటుకే పవర్ జనరేట్ అవుతుంది… సౌరవిద్యుత్తు, పవన విద్యుత్తు (అవకాశం ఉంటే) మీదా కాన్సంట్రేట్ చేయాలి… ఇదుగో ఇలా పంప్డ్ స్టోరేజీ పవర్ ప్లాంట్ల పైనా దృష్టి పెట్టాలి…
ప్రస్తుతం ఇల్లెందులో 100 మెగావాట్ల పీఎస్పీపీతో స్టార్ట్ చేస్తారు… మెగావాట్‌కు 6 కోట్ల వరకూ నిర్మాణవ్యయం అవసరం… దీనివల్ల నిరుపయోగంగా ఉండిపోయే గని ప్రాంతాన్ని (బొగ్గు తవ్వాక) ఇలా వినియోగంలోకి తీసుకురావచ్చు… మంచి ఆలోచన, మంచి అడుగు..!!
Share this Article