ఒకటే కులం… ఒకే ప్రాంతం… వేర్వేరు కుటుంబాలు… వేర్వేరు రాజకీయ రంగులు రుద్దుకుంటారు… తెల్లారిలేస్తే కత్తులు, కారాలు నూరుకుంటారు… రాజకీయ విభేదాలేమీ ఉండవ్… ఉన్నదంతా కుటుంబకక్షలే… అవి దిగువన కార్యకర్తల వరకూ విస్తరిస్తాయి… నిప్పురవ్వ పడితే చాలు నరుక్కోవడమే… ఎన్ని పుస్తెలు రాలిపడినా, ఎందరు తల్లుల కడుపులు కోసుకుపోయినా ఆ విద్వేషాలు అలాగే కొనసాగుతూ ఉంటయ్… బొచ్చెడు ఉదాహరణలు… సరే, ఇక్కడ సీన్ కట్ చేయండి…
ఆ ఇద్దరూ ప్రత్యర్థులు… పొలిటికల్ గోదాలో దిగారంటే తిట్టేసుకుంటారు… సవాళ్లు విసురుకుంటారు… పార్టీలు వేర్వేరు… కానీ ఇద్దరూ వ్యక్తిగతంగా కలిస్తే ఆ వైరం ఏమీ ఉండదు… కార్యకర్తల దాకా అందరూ కలిసే ఉంటారు… విద్వేషాలు ఓ లెవల్ వరకే… అంతకుమించి విషం వ్యాపించడానికి లేదు… రాజకీయాల్ని పక్కనపెడితే అందరూ చుట్టాలే, దోస్తులే… అదీ మనం ఆహ్వానించి, అభినందించాల్సిన గుణం… వాళ్లిద్దరిలో ఒకరికి పెళ్లి… రాజకీయ ప్రత్యర్థిని ‘అన్నా, పెళ్లికి రావాలి’ అని పిలిచాడు… ఆయన కూడా హుందాగా సతీసమేతంగా వెళ్లి, ఆశీర్వదించాడు… ఎంత హాయిగా ఉంది చదువుకోవడానికి… ఫోటో చూస్తారా..? మరింత ఆనందంగా ఉంటుంది…
Ads
విజయనగరం జిల్లాలో ఇది… ఒకసారి కాస్త పాత రోజుల్లోకి వెళ్దాం… చీపురుపల్లి నుంచి బొత్స సత్యనారాయణ పోటీ… తనపై కిమిడి నాగార్జున పోటీ… బరిలో దిగాక తప్పదు కదా… తిట్టేసుకున్నారు… బొత్స పెద్ద అవినీతి తిమింగలం, మొత్తం జిల్లాను నాకేశాడు, ఇక వదిలించుకుందాం అంటూ నాగార్జున రెచ్చిపోయాడు… బొత్స కూడా అంతే… కత్తులు తిప్పేసుకున్నారు… ఎన్నికలైపోయాయి… బొత్స గెలిచాడు, మంత్రి అయ్యాడు…
ఓరోజు నాగార్జున నుంచి బొత్సకు ఫోన్… భయ్యా, నా పెళ్లి… తప్పకుండా రావాలి… అని పిలిచాడు… ఠాట్, నా ప్రత్యర్థిని నేనెలా పిలుస్తాను అని అనుకోలేదు ఆ కుర్రాడు… తనవైపు తన పాజిటివిటీని ప్రదర్శించాడు… మరి బొత్స..?
ఛస్, ఆ పిల్లాడు పిలవడం ఏమిటి..? నేను పోవడం ఏమిటి..? నథింగ్ డూయింగ్ అని అనుకోలేదు… ఆ కుర్రాడి పెళ్లిరోజున ఉన్న పనులన్నీ వాయిదా వేసుకుని మరీ భార్య ఝాన్సీతో సహా పెళ్లికి వెళ్లాడు, కొత్త బట్టలు పెట్టాడు… ఆశీర్వదించి వచ్చాడు… పోలా… కడుపు నిండిపోలా… ఒక్కసారి ఊహించండి, ఆ పెళ్లి మండపంలో వ్యాపించిన సకారాత్మక వాతావరణం… ఎస్, రాజకీయాలు ఒక దశను దాటి విద్వేషాన్ని వ్యాపించే స్థాయికి పెంచకూడదు… పైగా రేప్పొద్దున ఎవరు ఏ పార్టీలో ఉంటారో… మనమెందుకు తన్నుకోవడం… పల్లెపల్లెకూ ఆ నెగెటివిటీని ఎందుకు వ్యాప్తి చేయడం…?
మొన్నామధ్య మనం ముచ్చటలోనే ఓ వార్త చదువుకున్నాం… గుర్తుందా..? సేమ్, ఇలా అభినందించదగినదే… కరీంనగర్లో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, మంత్రి కమలాకర్, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మియ్య తదితరులు… ఇదుగో లింకు…
ప్రత్యర్థులు మాత్రమే, శత్రువులు కారు… పర్సనల్ వైరాలిక్కడ జాన్తా నై…
Share this Article