ఒక వృత్తిని ప్యాషన్ తో ఎంచుకుని చేసే జర్నీ వేరు.. అనుకోకుండా ఓ ప్రొఫెషన్ లో ఉద్యోగిగా మారి పని చేయడం వేరు. అలాంటి డిఫరెన్స్ అన్ని రంగాల్లో మనకు అణువణువునా కనిపిస్తూనే ఉంటుంది. ఒకవైపు వారి విధులను భారంగా భావిస్తూనే.. మరోవైపు, వాళ్ల హక్కుల కోసం మాత్రం పోరాడే ఎందరో టీచర్లను చూస్తున్న నేటి రోజుల్లో.. అందుకు భిన్నమైన ఓ ఉపాధ్యాయురాలి లైఫ్ స్టోరీని తప్పక చెప్పుకోవాలి. మిగిలినవారితో పోల్చి ఆమెనెక్కువ చేయడమూ కాదు.. ఇతరులను తక్కువ చేయాలనీ కాదు.. కానీ, నిబద్ధత, అంకితభావంతో ఒక గురువు పనిచేస్తే వచ్చే మార్పుపై ఓ చర్చకైతే తెర లేపవచ్చు. అదిగో అలాంటి టీచరమ్మే అర్చన నూగూరి.
అర్చన నూగూరి.. మంచిర్యాల జిల్లా రెబ్బనపెల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు. వృత్తి రీత్యా తనకు దక్కిన ప్రమోషన్ లో భాగంగానే కాదు.. నిజంగా కూడా ఉపాధ్యాయుల్లోనే ఓ ప్రధాన ఉపాధ్యాయురాలు. తాజాగా రాష్ట్రపతి అవార్డ్ అందుకున్న ఉత్తమ టీచర్. ఎందుకు..? అర్చనకు ఉపాధ్యాయ వృత్తి పట్ల ఉన్న నిబద్ధత. గిరిజన గూడాల్లో నేటి బాలలను రేపటి భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాలన్న ఆకాంక్ష. తన తాతను చూసి ఇన్స్పైరైనారు అర్చన. ఎందరో గిరిజన విద్యార్థులకు ఎలాంటి ఫీజుల్లేకుండానే చదువు చెప్పిన తన తాత.. వారి చదువులకు పైగా ఆర్థిక సాయం కూడా చేసేవాడంటారామె. అలా ఉపాధ్యాయ వృత్తిపై తన తాతను చూశాక మమకారం పెంచుకున్నారు అర్చన.
సాధారణంగా ఏ ఇంజనీరో, డాక్టరో, యాక్టరో, కలెక్టరో ఇలా పాప్యులారిటీ ఉన్న రంగాల పట్ల ఆసక్తిని కనబర్చేవారే నేటి జనరేషన్ లో ఎక్కువ కనిపిస్తారు. కానీ, వాళ్లందరినీ తీర్చిదిద్దే ఉపాధ్యాయ వృత్తి పట్ల ఆసక్తిని కనబర్చేవారు వేళ్లమీదే లెక్కించవచ్చు. ముఖ్యంగా మధ్యతరగతివారు.. గ్రూప్ ఎగ్జామ్స్ కు ఓవైపు ప్రిపేరవుతూనే డీఎస్సీలు రాస్తూ.. వచ్చిన టీచర్ పోస్ట్ లో సెటిలైపోయేవాళ్లు.. ఇలా రకరకాల మధ్యతరగతి నేపథ్యమే ఈ ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్న మెజార్టీలో కనిపిస్తుంటుంది. కానీ, ఉపాధ్యాయ వృత్తినే సాధించాలనే తపనతో ఆ వృత్తిలోకి వచ్చేఅర్చన నూగూరి లాంటివాళ్లు వేళ్లమీద లెక్కించేవారు ఏ కొందరో మాత్రమే.
Ads
ఉపాధ్యాయ వృత్తి పట్ల ఉన్న గౌరవం.. ఆ వృత్తినెంచుకుంటే సమాజాన్ని ఎంతగా ప్రభావితం చేయవచ్చనే అవగాహన… అలా చేయడం వల్ల మానసికంగా తాము పొందే సంతృప్తి ఉన్నప్పుడే అర్చన నూగూరి వంటి ఉత్తమ ఉపాధ్యాయులు అక్కడక్కడా తారసపడుతుంటారు. అలా రెబ్బనపల్లి ప్రభుత్వ పాఠశాలను మంచిర్యాల జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే ఒక పేరుండేలా తీర్చిదిద్దారు అర్చన. ఎంతసేపూ హక్కులంటూ పోట్లాడేవారు.. పీఆర్సీలు, మధ్యంతర భృతి వంటివాటిపై బయట అరుగులపై చర్చలు పెట్టేవారు.. స్కూల్స్ కు డుమ్మాలు కొట్టేవారు.. లేదా, ప్రభుత్వ పాఠశాలల్లోనే రెండు బెంచీలను ఒకటి చేసి మధ్యాహ్నం విద్యార్థుల ముందే కునుకు తీసేవారు.. ఓవైపు ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూనే మిత్తీలకిచ్చే వడ్డీ వ్యాపారులుగా మారేవారు.. ఇన్ని చేసుకుంటూ ఎప్పుడూ తమ వృత్తిపై అసంతృప్తినే పైగా వెళ్లగక్కేవారు కనిపించే రోజుల్లో అర్చన వంటి టీచర్ల మాట అరుదే. అందుకే సెప్టెంబర్ 5, 2023న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా రాష్ట్రపతి అవార్డ్ అందుకున్న అర్చన అందుకు హండ్రెడ్ పర్సెంట్ అర్హురాలు.
ఇంతకీ అర్చన ఏం చేశారు.. ఏం చేస్తున్నారు..?
అర్చన ప్రధానోపాధ్యాయురాలిగా బాధ్యతలు చేపట్టాక రెబ్బనపల్లి ప్రాథమిక పాఠశాలలో ఏడుశాతం ఎన్ రోల్ మెంట్స్ పెరిగాయి. డ్రాపవట్స్ సంఖ్య తగ్గిపోయింది. ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని.. లేదా ప్రభుత్వాలు చేయడంలేదని చేతులు దులుపుకోలేదు అర్చన. తన సొంత ఖర్చులతో చుట్టుపక్కల గిరిజన విద్యార్ధులు స్కూల్ కు రావడానికి రవాణా ఖర్చులను బేర్ చేస్తున్నారు అర్చన. అదనపు తరగతి గదులనూ ఏర్పాటు చేయించగల్గారు. తన జీతంలో 20 వేల రూపాయల మొత్తాన్ని నెలకు గిరిజన పేద విద్యార్థుల చదువుల కోసం వెచ్చిస్తున్న చదువుల తల్లి సరస్వతి అర్చన. తెలుగు, ఇంగ్లీష్, గణితం సబ్జెక్ట్స్ ను బోధిస్తూ గత 20 ఏళ్లుగా ఉపాధ్యాయ వృత్తిలో అలుపెరుగని గురువుగా ముందుకు సాగుతున్న అర్చన… కనీసం డిగ్రీ కూడా పూర్తి కాకుండా టీటీసీ పూర్తి చేసి 19 ఏళ్ల వయస్సులో టీచరయ్యారు.
రెబ్బనపల్లి ప్రాథమిక పాఠశాలను అర్చనకు ముందు అర్చన ఎంట్రీ తర్వాత అన్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. నవంబర్ 2000లో అర్చన పాఠశాలలో చేరినప్పుడు.. కేవలం 34 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. కానీ, చుట్టుపక్కల ఉన్న ఊళ్లన్నీ ఎక్కువశాతం గిరిజన గూడాలు. పొట్టకూటి కోసం బతుకుచిత్రంపైనే దృష్టి పెట్టే ఆ పేదలకు చదువు విలువ ఎలా తెలిసేది..? అర్చన సుమారు నెల రోజుల పాటు కాళ్లకున్న చెప్పులరిగేలా తిరిగారు. విద్య ఆవశ్యకతెంతో ఇంజెంక్ట్ చేశారు. విద్యతో పైకెదిగిన వారి సక్సెస్ స్టోరీసేంటో వీడియోల రూపంలో చూపించి.. పేరెంట్స్ ను ఒప్పించారు. అయితే, వారు సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న రెబ్బనపల్లి పాఠశాలకు చేరుకోవాలంటే ఎలా..? మళ్లీ ఇదో సమస్య! గుంతల రోడ్లతో ఉన్న పల్లెల నుంచి విద్యార్థులు బడికి చేరుకునేందుకు తన సొంత ఖర్చులతో ఆటోలను ఏర్పాటు చేశారు. అలా మొత్తానికి రెబ్బనపల్లి స్కూల్ లో డ్రాపవుట్స్ సంఖ్యను తగ్గించి.. తాను చేరినప్పుడు 34 మంది విద్యార్థులు మాత్రమే ఉన్న సంఖ్యను.. ఇప్పుడు 275కు పెంచితే.. అందులో 103 మంది బాలికలే ఉండటం మరో విశేషం.
సమస్యలనే విజయానికి సోపానంగా మల్చిన టీచర్…
సమస్య వస్తే ఎలా ఎలా అని ప్రశ్నించుకుని కూర్చుని మథనపడకలేదు అర్చన. ఆ సమస్యలు కూడా తన వ్యక్తిగతమైనవేమీ కాకపోయినా.. విద్య పట్ల.. ఆ విద్య పేదలకందే విషయం పట్ల ఆమెకున్న కన్సర్న్.. ఆ సమస్యలన్నీ ఆమె వ్యక్తిగత సమస్యల దృక్కోణంలోనే ఆమెకు కనిపించాయి. అయితే, ప్రతీ సమస్యకూ ఓ పరిష్కారముంటుందని నమ్మిన టీచరమ్మ కావడంతో.. పాఠశాల మౌలిక సదుపాయాల విషయంలో ఉన్నతాధికారులకు విన్నవించడం, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం మాత్రమే చేయకుండా.. ఆ విషయాన్ని తన వద్ద చదువుకుని విదేశాల్లో సెటిలైన వారికి చేరవేసింది. అలా రాజేంద్రప్రసాద్ అనే పూర్వ విద్యార్థి చొరవతో బ్రింగ్ ఏ స్మైల్ ఫౌండేషన్ తో పాటు.. పద్మావతి ఛారిటబుల్ ట్రస్ట్ వంటి స్వచ్ఛంద సంస్థల సహకారంతో.. స్థానిక రాజకీయ నాయకుల చొరవతో రెబ్బనపల్లి స్కూల్ ముఖచిత్రాన్నే మార్చేశారు అర్చన.
అయితే, ప్రస్తుతం హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్న సంగనభట్ల రాజేంద్ర ప్రసాద్ చొరవ.. తన టీచరమ్మ అర్చన తపనకు మరింత తోడైంది. రాజేంద్రప్రసాద్ మద్దతుతో రెబ్బనపల్లి స్కూల్ పేరు తెలంగాణా రాష్ట్రంలోనే కాదు.. ఇప్పుడు ఇండియా మొత్తం ఓ నినాదమైంది.
వాషింగ్టన్ తెలుగు అసోసియేషన్ సహకారంతో పాటు.. స్థానిక ఎమ్మెల్యే సహకారంతో పాఠశాలలో బోర్ వెల్, ఆర్వో ప్లాంట్, బెంచీలు, కుర్చీలు, టేబుల్స్, డెస్క్ టాప్స్, ఇతర ఫర్నీచర్, సుమారు వెయ్యికి పైగా పుస్తకాలతో ఓ లైబ్రరీ వంటి సదుపాయాలను కల్పించడంతో పాటు.. కేంద్రం అందించే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ పథకంలో భాగంగా రెండు ఎల్ఈడీ ప్రొజెక్టర్స్, ఐదు కంప్యూటర్లతో ఇప్పుడు రెబ్బనపల్లి స్కూల్ ను ఎడ్యుకేషనల్ హబ్ లా మార్చేసింది. దాంతో అసలు విద్య విలువే తెలియని గిరిజన గూడాల పిల్లలు.. ఇప్పుడు కంప్యూటర్ కీబోర్డ్ పై వేళ్లాడిస్తూ డిజిటల్ టెక్నాలజీని అందిపుచ్చుకున్న అవగాహనతో భవిష్యత్ వైపు అడుగులేస్తున్నారు.
తమ విద్యార్థులు భవిష్యత్ పరిపూర్ణ వ్యక్తులుగా ఎదగాలన్నదే అర్చన తలంపు!
ఆత్మరక్షణ కోసం ఓ ప్రైవేట్ శిక్షకుడి ద్వారా కరాటే క్లాసులతో పాటు.. స్పోర్ట్స్, డ్యాన్స్ వంటి క్లాసులను కూడా ఏర్పాటు చేసి ఎక్స్ట్రా క్యారిక్యూలమ్ యాక్టివిటీస్ లోనూ తర్ఫీదందిస్తున్నారు రెబ్బనపెల్లి పాఠశాలలో. అంతేనా..? విద్యార్థులకు కేవలం విద్యతో వచ్చిన జ్ఞానముంటే సరిపోదు. దాన్ని వ్యక్తీకరించే భావ వ్యక్తీకరణ కావాలంటే లాంగ్వేజ్ స్కిల్స్ తప్పనిసరి. ప్రపంచంలో ఎక్కడికెళ్లినా కనీసం ఇంగ్లీష్ పరిజ్ఞానం అనివార్యమైన స్థితిని గమనించి.. పట్టుబట్టి రెబ్బనపల్లి పాఠశాలలో ఆంగ్ల మాధ్యమాన్ని కూడా ప్రవేశపెట్టి ఇప్పుడు 360 డిగ్రీల కోణంలో విద్యార్థులను తీర్చిదిద్దే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు అర్చన.
ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే ఉన్న రెబ్బనపల్లి స్కూల్ లో.. అర్చన మరో నలుగురు ప్రైవేట్ టీచర్లను ఏర్పాటు చేసుకుని.. ఎన్జీవోల సాయంతో ఇద్దరికీ, తనకొచ్చే జీతంలోని మరో ఇద్దరికి జీతాలు అందిస్తున్నారు. తనను తాను చదువుల్లో అప్ గ్రేడ్ చేసుకుంటేనే.. విద్యార్థులకు సరైన బోధన అందించగలనన్న విశ్వాసం అర్చనది. ఆ దిశగా ఆమె మరెందరో గురువులకు స్ఫూర్తిగా నిలవడంతో పాటు.. ట్రాన్స్ ఫార్మింగ్ ఇండియా బై నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020పై ఓ బుక్ కూడా రాయడం విశేషం. అంతేకాదు.. తాను ఓ గురువుగా మారాక కూడా పరిస్థితుల నుంచి, తన చుట్టపక్కల వ్యక్తుల నుంచీ, సమస్యల నుంచీ తానేం నేర్చుకున్నదీ.. ఎలా నేర్చుకున్నదీ అనే అంశాలపై ఆమె రాసిన రెండు ఆర్టికల్స్ కూడా ఇంటర్నేషనల్ జర్నల్స్ లోనూ ప్రచురితమయ్యాయి.
ఎందరో విద్యార్థులకు విద్యనందించే గురువుగా ఉంటూనే.. నిత్య విద్యార్థిగా అర్చన తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో రాజస్థాన్ పిలానీలోని శ్రీధర్ యూనివర్సిటీ నుంచి మహిళా సామాజిక-సాంస్కృతిక-రాజకీయ-ఆర్థిక అభివృద్ధి అనే అంశంపై తన పీహెచ్డీ చేస్తున్నారు. అంతేకాదు.. గురువుగా ఇంతచేసినా ఇంకా ఏదో చేయాలన్న తపనతో కనిపించే అర్చన.. నేటి బాలల రేపటికి చదువొక్కటే మార్గమంటారు. అందుకే.. తన రిటైర్మెంట్ అనంతరం అనాథబాలల కోసం ఓ స్కూల్ నే నిర్మించే యోచనలో ఉండటం మరింత విశేషం. మరి.. మన తెలంగాణా అక్షర సరస్వతి అర్చన రాష్ట్రపతి అవార్డ్ కు అర్హురాలవ్వడంలో పెద్ద విశేషమేముంది..? షరా మామూలే!….. Article By రమణ కొంటికర్ల
Share this Article