.
చిన్న సినిమా… చాలా తక్కువ బడ్జెట్… వెటరన్ తార సిమ్రాన్ తప్ప పెద్దగా మిగతావాళ్లు తెలియదు… కానీ హఠాత్తుగా మౌత్ టాక్ పెరిగి తమిళ ఇండస్ట్రీలో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది తాజాగా… సినిమా పేరు టూరిస్ట్ ఫ్యామిలీ…
మరీ కొన్ని సైట్లలో రాసుకొస్తున్నట్టు కలెక్షన్ల సునామీ అనేంత సీనేమీ లేదు… కానీ ఖచ్చితంగా చెప్పుకోదగిన సినిమాయే… వరల్డ్ వైడ్ కలెక్షన్లు నాలుగు రోజుల్లో 15.63 కోట్లు అంటే తక్కువేమీ కాదు… అయితే..?
Ads
మొదటిరోజు 2 కోట్లు, తరువాత రోజు పడిపోయి 1.7 కోట్లు… కానీ మంచి టాక్ రావడంతో జనం థియేటర్లకు వస్తున్నారు… మూడో రోజు 2.7 కోట్లకు పెరిగి, నాలుగో రోజు 3.75 కోట్లు… ఇంకా పెరగనున్నాయి… ఇదంతా తమిళనాడు కలెక్షన్లే సుమా…
హైదరాబాదులో కూడా కొన్నిచోట్ల సబ్ టైటిల్స్‌తో వేశారన్నారు, వసూళ్ల వివరాలు తెలియవు… కాకపోతే యాక్యుపెన్సీ బాగానే ఉందట… చెన్నైలో మాయాజాల్ అనే మల్టీప్లెక్స్‌లో ఒకేరోజు నలభై షోలు వేయడం అంటే మామూలు విషయం కాదు… సో, ఇంకా కలెక్షన్లు బాగా పెరగనున్నాయి…
అసలు ఏముంది సినిమాలో..? తమిళ రివ్యూలను ఒక్కసారి క్రోడీకరిస్తే… కామెడీని, భావోద్వేగాలను ఆసక్తికరంగా మిళాయించి తెరకెక్కించడం చిత్ర విజయానికి ప్రధాన కారణం… అవును… దర్శకుడు అభిషన్ జీవింత్‌కు ఇది తొలిచిత్రం… కథానాయకుడు శశికుమార్, తోడుగా యోగిబాబు…
శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం, కోవిడ్ తర్వాత సవాళ్ల నేపథ్యంలో ఒక శ్రీలంక తమిళ కుటుంబం భారతదేశంలో (తమిళనాడు) కొత్త జీవితాన్ని ప్రారంభించే సంఘర్షణాత్మక, హాస్యాత్మక డ్రామా… ధర్మదాస్ (శశికుమార్), అతని భార్య (సిమ్రాన్), ఇద్దరు కొడుకులతో కలిసి అక్రమంగా భారత్‌కు వలస వస్తాడు…
వారు కొత్త పరిసరాల్లో స్థిరపడే ప్రయత్నంలో స్థానికులతో సన్నిహితంగా మెలుగుతారు.., అయితే ఊహించని బాంబు పేలుడు ఆరోపణలతో వారి జీవితం తల్లకిందులవుతుంది… ఈ కుటుంబం పోలీసుల నుంచి తప్పించుకుంటుందా? వారిపై ఆరోపణల నిజం ఏమిటి? అనేది కథ ఉత్కంఠ…
సిమ్రాన్ రీఎంట్రీలో మంచి పాత్రే దొరికింది… తన వయస్సుకు తగినట్టు… ఆ పాత్రలో ఒదిగిపోయింది… మనకు తెలిసిన సిమ్రాన్ ఎక్కువగా కమర్షియల్ రోల్స్ చేసింది… ఈ సిమ్రాన్ వేరు… శశికుమార్ కూడా తన పాత్రకు న్యాయం చేశాడు… యోగిబాబు గురించి చెప్పడానికేముంది..? జగమెరిగిన కమెడియనే కదా…
సన్నివేశాలను బీజీఎం బాగా ఎలివేట్ చేసింది… బీజీఎం అంటే దడదడ మోగించడం కాదు… అలాగే రెండు గంటలే సినిమా నిడివి కాబట్టి ఎడిటింగ్ కూడా లాగ్ లేకుండా క్రిస్పీగా, జాగ్రత్తగా చేసినట్టుగా ఉంది… వేరే దేశం నుంచి వచ్చి ఇక్కడ సమాజంలో ఒదిగిపోవడం చిన్న విషయం కాదు, ఈ కథను దర్శకుడు జాగ్రత్తగా డీల్ చేశాడు…
తెలుగులో సబ్ టైటిల్స్‌తో వేస్తున్నారంటే ఇక తెలుగులోకి డబ్ లేదన్నమాటే… ఏదో ఓ ఓటీటీలో వచ్చాక చూడొచ్చు ఇక… సూర్య రెట్రో సినిమాకు అసలే నెగెటివ్ టాక్ కదా… ఇక ఇక్కడ నాని హిట్-3 నుంచి దెబ్బ… మలయాళంలో తుడరుమ్ నుంచి దెబ్బ… తమిళంలో ఈ టూరిస్ట్ ఫ్యామిలీ దెబ్బ… అదీ చెప్పుకునేది…
Share this Article