కేజీఎఫ్ సినిమాలో రాఖీ పాత్ర గురించి మన దర్శకులు తన్నుకుంటున్నారు కదా… ఆ పంచాయితీ పక్కన పెడితే… ఆ సినిమాలో రాఖీ తవ్వే స్థాయిలో బంగారు గనులు అసలు ఇండియాలో ఎక్కడున్నాయనే ప్రశ్నను సహజంగానే చాలామంది లేవనెత్తారు… ఇప్పటిదాకా లేవు కానీ ఇప్పుడు కొత్తగా కనిపెట్టారు… నిజం… జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఒడిశాలోని మూడు జిల్లాల్లో భారీ బంగారం నిక్షేపాలను కనిపెట్టింది…
ఈ విషయాన్ని ఎవరో కాదు, సాక్షాత్తూ ఒడిశా స్టీల్ అండ్ మైన్స్ మంత్రి ప్రఫుల్ల మల్లిక్ అసెంబ్లీలో చెప్పాడు… ఆ మూడు జిల్లాలు దియోగఢ్, కియోంజర్, మయూర్‌భంజ్… అడాస్ ఏరియాలోని దియోగఢ్, గోపూర్, ఘాజిపూర్, కుశకల, అడాల్, సలియోకానా, దిమిరిముండ, కరదంగ ప్రాంతాల్లో ఈ నిక్షేపాల్ని కనుగొన్నారు…
అడాస్ ఏరియాలో జీ2 లెవల్‌లో కనిపించే రాగి ముడిఖనిజంలో 1685 కిలోల బంగారం ఉందనీ, 6.67 మిలియన్ టన్నుల రాగి, 0.638 మిలియన్ టన్నుల వెండి, 0.10 మిలియన్ టన్నుల నికెల్ ఉందని అంచనా వేస్తున్నారు… ఎయిటీస్‌లో కియోంజర్ జిల్లాలో సర్వే చేశారు.. అప్పట్లో బంగారం ఉనికిని కనిపెట్టే సాంకేతిక పరిజ్ఞానం తక్కువ… తరువాత కుశకల, గోపూర్, జలధియా గ్రామాల్లో, బనసపాల్ బ్లాకులో సర్వేలు చేశారు కానీ ఫలితం ఏమిటనేది రహస్యంగా ఉంచారు…
Ads
2021-22 సంవత్సరంలో జీఎస్ఐ ఆధునిక పరిజ్ఞానంతో కియోంజర్ జిల్లాలో తాజా సర్వేలు చేసింది… ఆ సర్వే ఫలితాలను కూడా అధికారులు గోప్యంగానే ఉంచారు… ప్రస్తుతం దేశంలో మూడే యాక్టివ్ బంగారు గనులున్నాయి… అంటే తవ్వకాలు సాగుతున్నాయి… అవి కర్నాటకలోని హుట్టి, ఉటి మైన్స్, జార్ఖండ్‌లోని హిరాబుద్దిని మైన్స్… ఘోరం ఏమిటంటే… మన దేశం ఏటా 774 టన్నుల బంగారాన్ని వాడుతుంది… కానీ మన దేశ ఉత్పత్తి మొత్తం ఏటా 1.6 టన్నులు మాత్రమే… అంటే లెక్కించదగినంత కాదు…
బంగారం ధరలు పెరుగుతున్నాయి… డిమాండ్ పెరుగుతోంది… భారతదేశానికి బంగారమంటే బహు ప్రీతి… కానీ ఆల్‌మోస్ట్ మొత్తం మనం దిగుమతి చేసుకోవడమే… ఈ నేపథ్యంలో దేశంలో బంగారం ఉత్పత్తిని పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది… గత ఏడాది నీతిఆయోగ్ దీనిపై అధ్యయనం చేసింది… దక్షిణ భారతంలోనే అధికంగా బంగారం నిక్షేపాలున్నయి… అదీ కర్నాటకలోనే 88 శాతం నిక్షేపాలున్నయ్… అంటే రాఖీ జన్మస్థలం… (కేజీఎఫ్ అంటే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్)…
గత ఏడాది వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఇండియాకు ఓ ఉచిత సలహా పడేసింది… మీరు గనుక మైనింగులో మౌలిక వసతులు పెంచి, ఆధునిక పరిజ్జానం వాడితే, దాంతోపాటు పరిపాలనపరమైన కొన్ని సంస్కరణలు తీసుకువస్తే… ఏటా 20 టన్నుల బంగారాన్ని తవ్వుకునే చాన్స్ ఉందని…!! ఏమో… ప్రస్తుతం ఒడిశాలో బయటపడిన భారీ బంగారు నిక్షేపాల్ని తవ్వుకునే చాన్స్ ఆదానీ గ్రూపుకి ఇచ్చే అవకాశం ఉందంటారా..? ప్రస్తుతం ఆయన పరిస్థితి బాగాలేదు కదా… తక్షణం ఆ ప్రమాదం ఏమీ లేనట్టే భావించొచ్చు..!!
Share this Article