ఏమిటయ్యా, చిన్న పిల్లల కార్యక్రమంలో నా పెళ్లిళ్లు, వ్యక్తిగత అంశాల్ని మాట్లాడతావ్, అసలు నీకు తెలుగే రాదు, తెలుగు రాని సీఎం మా దౌర్భాగ్యం, నేను కుర్చీ ఎక్కగానే వయోజన పాఠశాల పెట్టి నీకు తెలుగు నేర్పిస్తా అని జనసేన పవన్ కల్యాణ్ తిట్టిపోశాడు, వెంటనే జ్వరం వచ్చి పడుకున్నాడు…
నాకు బూతులు తిట్టడం రాదు, నాలుగేసి పెళ్లిళ్లు చేతకాదు… ఆవేశంతో ఊగిపోవడం తెలియదు… అంటాడు జగన్… ఇక ఆయా పార్టీల సోషల్ మీడియా యాక్టివిస్టులు, దురభిమానులు ఒకరినొకరు తిట్టేసుకుంటారు ఫేస్‌బుక్కులో, ట్విట్లర్‌లో… కానీ ప్రాథమిక, ప్రభుత్వ విద్యకు సంబంధించి ఏపీలో గుర్తించదగిన ఓ మార్పు కనిపిస్తోంది…ఇంగ్లిష్ మీడియం, స్కూల్ రూపురేఖల మార్పు, తాగునీరు, ఫర్నీచర్ తదితర మౌలిక సౌకర్యాల కల్పన, మెరుగైన యూనిఫామ్, అమ్మఒడి డబ్బులు, సీబీఎస్ఈ సిలబస్ గట్రా నిజానికి చర్చనీయాంశాలు కావాలి…
ఆమధ్య తెలుగు మీడియంపై తెలుగుదేశం అండ్ కో రచ్చ చేసింది… కొందరు మేధావులు గొంతు చించుకున్నారు… అక్కడికి తెలుగు భాష అర్జెంటుగా మాయమైపోతున్నట్టు గోల… ఆ గొంతుల పిల్లలు చదివేది మాత్రం ఇంగ్లిషు మీడియమే…ఇలా చెబుతూ పోతే బోలెడు… ఎవరైనా రాస్తే పేటీఎం బ్యాచ్ అని ఎగతాళి… (నిజానికి జగన్ సోషల్ మీడియా ఖర్చుకూ కొన్ని కుల, ప్రాంత, వర్గ లెక్కలుంటయ్… జగన్ కోటరీకి ఇదేమీ పట్టదు…)
Ads
ఈ నేపథ్యంలో రచయిత, దర్శకుడు Prabhakar Jaini రాసిన ఓ పోస్టు ఆసక్తికరం అనిపించింది… (సాక్షిలో ఇలాంటి రాతలు ఎందుకు కనిపించవు..? కనీసం సజ్జల రామకృష్ణారెడ్డికి ఈ విషయం ఎందుకు పట్టదు..?) సరే, ఆ పోస్టు ఇదీ…
విద్యారంగం మీద ఎంత ఖర్చు చేసినా అది ఒక గొప్ప పెట్టుబడిగానే మిగిలిపోతుంది. సమాజ ఉన్నతికి విద్య చాలా ముఖ్యం. ఇటువంటి వసతులు కల్పించడం వలన, విద్యార్థులలో ఒక ఆత్మ స్థైర్యం కలుగుతుంది. భవిష్యత్తులో ఎన్నో సాధించగలమనే నమ్మకం ఏర్పడుతుంది.ఈ వసతులు కల్పించడంతో పాటు, ఉత్తమ మానవీయ విలువలు కూడా బోధించాలి. మానవీయ విలువలు బోధించడం ప్రభుత్వ బడులలో మాత్రమే సాధ్యమవుతుంది.
సంపూర్ణ వ్యక్తిత్వం కల సమాజ సభ్యులుగా ఎదుగుతారు. ఈ విలువలు లేని చదువుల వల్లనే ప్రస్తుత సమాజంలోని వికృత పరిణామాలు, విద్యార్థి స్థాయిలోనే హత్యలు, మానభంగాలు, ప్రేమలు, భగ్న ప్రేమలు, దాడులు, ఆత్మహత్యలు చూస్తున్నాము. అందుకే కేవలం చదువే కాదు చదువుతో పాటు ఉత్తమమైన, ఉన్నతమైన విలువలు, పెద్దల పట్ల మర్యాద, గౌరవం; దేశం పట్ల ప్రేమ; తమ మతం పట్ల భక్తి, గౌరవం పెంపొందిస్తూ, ధైర్యాన్ని నూరిపోస్తూ, వినమ్రంగా, humility తో ప్రవర్తించే యువతరాన్ని తయారు చేయగలిగితే, ఒక అద్భుతమైన భారతదేశాన్ని భవిష్యత్తులో చూడవచ్చును
మంచి తనం కూడా, ఒకరిని నుంచి ఒకరికి సుగంధంలా వ్యాపిస్తుంది. రాజకీయ పార్టీలు కూడా, ఎన్నికలయిపోయిన తర్వాత రాజకీయాలు చేయడం మానేసి, పిల్లలకు జరుగుతున్న మంచిని అభినందించాలి. ఒక జాతి పునర్నిర్మాణానికి అన్ని పార్టీలు కలిసి కృషి చేయాలి. కార్పొరేట్ విద్యలో విద్యార్థులు నలిగిపోతున్నారు. యాంత్రికమైన నిబంధనల వల్ల రోబోలుగా తయారవుతున్నారు. వారిని కూడా ప్రభుత్వం ఒక కంట కనిపెడుతూ, తగు చర్యలు తీసుకోవాలి.
వీటన్నింటికన్నా ముఖ్యమైనది, ఉపాధ్యాయులలోని నిబద్ధత. అధికారంలోని పార్టీలు మారుతుంటాయి. విద్యార్థులు చదువులు పూర్తి చేసుకుని వెళ్ళిపోతుంటారు. కానీ, టీచర్లు మాత్రం అదే గురు స్థానంలో ఉంటారు. ఒక మంచి గంధం చెట్టులా వారు తరతరాల విద్యార్థులకు పాఠాలతో పాటు తమ సౌజన్యాన్ని, వ్యక్తిత్వాన్ని పంచుతూ, ఒకే చోట నిలబడిపోతుంటారు. వారి ద్వారా, వారి ప్రతిరూపాలుగా, విద్యార్థులు ప్రపంచమంతటా, పరిమళాలు వ్యాపింప చేస్తుంటారు.
కాబట్టి, టీచర్లు ఆదర్శమూర్తులై, స్వార్థ ప్రయోజనాలకు, స్వలాభాపేక్ష కోసం కాకుండా, ఒక విద్యారణ్యాన్ని సృష్టించే మహాకార్యంలో భాగస్వాములుగా, తమ విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించాలి. ఈ ఫోటో – ఒక గొప్ప ఆత్మ విశ్వాస ప్రతీక…. అన్నట్టు… నాకు రాజకీయాలతో సంబంధం లేదు. నాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా కాదు…
Share this Article