తమ తమ అధికార హోదాల్ని అడ్డం పెట్టుకుని కోట్లకుకోట్లు కుమ్మేసిన పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల్లో ఎందరు ఈ మహావిపత్తువేళ ప్రజలకు సాయం చేయడానికి ముందుకొస్తున్నారు..? ఒక్కసారి ఆలోచించండి… వేలు, లక్షల కోట్ల సంపాదన మరిగినా నిజంగా సమాజం మొత్తం కకావికలం అవుతున్న ఈ సంక్షోభకాలంలో ఒక్కరైనా ముందుకొచ్చిన మంచి ఉదాహరణ చెప్పండి… ఆఫ్టరాల్ సినిమా తారల్ని కాసేపు వదిలేద్దాం… మంత్రులు, ఎంపీలు, పెద్ద పెద్ద కంపెనీల ఓనర్లు..? ఠక్కున ఒక్క పేరు కూడా గుర్తుకురావడం లేదు కదా… అదే నిజం… కాకపోతే ఏ సోనూసూదో తనకు చేతనైన సాయం చేస్తుంటే ట్రోలింగులతో రాచిరంపాన పెడతాం… నువ్వెవడివిరా ప్రజలకు సాయం చేయడానికి అన్నట్టుగా వాడి మీద పడి ఏడుస్తాం… పార్టీల రంగులు పూస్తాం… కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటు హాస్పిటళ్లలోని బెడ్స్ తమ కంట్రోల్లోకి తెచ్చుకుంటున్నయ్… కాలేజీలు, హాస్టళ్లను కరోనా శిబిరాలుగా మార్చేస్తున్నయ్… తమిళనాడు రెమ్‌డెసివర్ అమ్మకాలకు ప్రత్యేకంగా కౌంటర్లు పెట్టింది… అప్పటికప్పుడు తాత్కాలిక కోవిడ్ కేర్ సెంటర్లను తెరుస్తున్నారు… మరి మనం..? వద్దులెండి, కక్షసాధింపు రాజకీయాల్లో బిజీగా ఉండిపోయాం… సరే, ప్రజాప్రతినిధుల మాటకొస్తే… ఈ ఫోటో ఓసారి చూడండి…
కరోనా కేర్ సెంటర్ అనగానే… పెద్ద పెద్ద ఐసీయూ వంటి సెటప్పులు అవసరం లేదు… ఓ ఐసొలేషన్ సెంటర్‌లాగా… మెడికల్ సూపర్విజన్… మెడికల్ కిట్లు… ఇదుగో ఈ ఫోటోలో ఉన్నాయన పేరు బసవరాజ్ బొమ్మై,.. కర్నాటక హోం మినిస్టర్… హవేరి జిల్లా, శిగ్గావ్లో ఉన్న తన ఇంటిని 50 పడకల కోవిడ్ కేర్ సెంటర్‌గా మార్చాడు… డాక్టర్లను, మెడికల్ స్టాఫ్‌ను కూడా తనే నియమించాడు… ఒక్కో బెడ్‌కు సపరేటుగా ఆక్సిజన్ కాన్సంట్రేటర్ సమకూర్చాడు… ‘‘ఇలాంటి కేర్ సెంటర్ల వల్ల ప్రభుత్వ హాస్పిటళ్ల మీద కూడా ఒత్తిడి తగ్గుతుంది… నాకు చేతనైనంత సాయం నేను చేస్తున్నా’’ అన్నాడాయన విలేకరులతో… ఆయన హుబ్బలిలో ఉంటాడు తన కుటుంబంతో… నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఈ ఇంటిని వాడుకుంటూ ఉంటాడు… దాన్ని ఇప్పుడు ఇలా సద్వినియోగం చేస్తున్నాడు… అభినందనలు… ఆయన ఎవరో తెలుసు కదా… మాజీ ముఖ్యమంత్రి ఎస్.ఆర్.బొమ్మై కొడుకు… డిప్యూటీ చీఫ్ మినిస్టర్, రవాణా శాఖ మంత్రి లక్ష్మన్ సవాది కూడా దాదాపు 50 లక్షలు ఖర్చు చేసి, బెలగావి జిల్లాలోని అథనిలో, ఒక హాస్టల్లో 50 పడకల కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేశాడు… మంచి పని… ఇలాంటి వార్తలు ఇంకా ఇంకా కనిపించాలనే ఆశిద్దాం…
Ads
Share this Article