ఒక్కసారి రాజకీయాలు ఎంటరయ్యాక… అది ఏ అంశమైనా సరే, భ్రష్టుపట్టాల్సిందే… ఆనందయ్య మందు ఓ లెక్కా..?! హాయిగా నడుస్తున్న మందు పంపిణీని ఎవరో చెప్పినట్టు కలెక్టర్ ఆపివేయించాడు… ఈరోజుకూ మళ్లీ చక్కబడలేదు… ఈలోపు కొన్ని లక్షల మందికి మందు అందేది కదా… అధికార యంత్రాంగం కాస్త బుర్ర పెట్టి పనిచేయకపోతే జరిగే అనర్థాల్లో ఇదీ ఒకటి… దీనికితోడు పాలిటిక్స్… టీడీపీ నాయకుడు సోమిరెడ్డి ఆనందయ్యకు మద్దతుగా నిలిచాడు, సరే, అందులో మళ్లీ రాజకీయ లబ్ధి చూసుకునే ప్రయత్నాలు, వైసీపీ నేత కాకాణిపై ఎత్తిపొడుపులు, విమర్శలు… అదేమంటే… ఆ మందును అమ్ముకుని కోట్లు సంపాదించాలని అనుకుంటున్నాడు అంటూ ఓ పిచ్చి వెబ్‌సైట్ చూపించాడు… నిజంగానే అది ఆనందయ్య మందుకు సంబంధించి ఫేక్ సైట్, దాన్ని వదిలేసి సోమిరెడ్డి మీద కేసులు పెట్టారు పోలీసులు, అదేమంటే ఆ సైటువాడు కంప్లయింట్ చేశాడట… అసలు ఏం పాలన ఇది..? కాకాణి ఎందుకు ఉలిక్కిపడుతున్నాడు..?
అంతకుముందు ఒక్క మాట మాట్లాడలేదు వైవీ సుబ్బారెడ్డి… హఠాత్తుగా ఆమధ్య అది ఆయుర్వేదం కాదు, టీటీడీ ద్వారా పంపిణీ సాధ్యం కాదు, ఐనా కరోనా తగ్గదని చెబుతున్నారు కదా అని ఏదో మాట్లాడాడు… ఆనందయ్య అడిగాడా టీటీడీని సాయం చేయమని..?! పోనీ, ఆ వెబ్‌సైటు ఫేక్, మరి ఏదో ప్రత్యేక యాప్ అన్నాడు, అందులోనే రిజిస్ట్రేషన్ అన్నాడు, అన్ని జిల్లాలకు పంపిస్తామన్నాడు… ఏడీ ఆ కలెక్టర్..? ఏమైపోయాడు..? చివరకు ఏమైంది..? ఆనందయ్య మెడ మీద కత్తులు పెట్టి మరీ, కొందరు ఆ మందు తయారీ చేయిస్తూనే ఉన్నారు, ఆ మందు ఎక్కడెక్కడికో వెళ్లిపోతూనే ఉంది… ఎవరేం అడిగినా, అణకువగా చెప్పిన పనల్లా చేస్తూనే ఉన్నాడు ఆనందయ్య… పది మందికీ ఆ విద్య నేర్పించాడు… తనకు వచ్చిన విరాళాలతో మళ్లీ మూలికలు, ముడిసరుకులు కొనుగోలు చేసి, తన శక్తిమేరకు మళ్లీ ఉచితంగా మందు పంపిణీ ఆరంభిస్తున్నాడు… ఈ మొత్తం ఎపిసోడ్‌లో జనాన్ని పిచ్చోళ్లను చేసింది రాజకీయ నాయకులు, ఒక సెక్షన్ మీడియా, అధికార యంత్రాంగం… ఒక్క చెవిరెడ్డిని మాత్రం ఇక్కడ భిన్నంగా చూడాలి…
Ads
కరోనా సంబంధ సాయం అందించడంలో చెవిరెడ్డి మొదటి నుంచీ బాగా వర్క్ చేస్తున్నాడు… తన నియోజకవర్గంలోని ప్రజలకు ఈ విషయంలో ఏ అవసరమొచ్చినా ముందుకొస్తున్నాడు… ఆనందయ్య మందు మీద రాజకీయాల్ని, పాలసీ వైఫల్యాన్ని పట్టించుకోకుండా… తను స్వయంగా వెళ్లి చూశాడు, ఆయుర్వేద వైద్యుల్ని తనతో తీసుకెళ్లాడు… ఆ మందు వాడిన వాళ్ల అనుభవాలు తెలుసుకున్నాడు… ఇక తన నియోజకవర్గంలోని 1.6 లక్షల కుటుంబాలు, 142 పంచాయతీల పరిధుల్లోని 1600 ఆవాసాల్లో మందును ఉచితంగా పంపిణీ చేయడానికి నిర్ణయించాడు… మా పార్టీ, ఎదుటి పార్టీ అనేదేమీ లేదు… అందరికీ మందు… ఆనందయ్య కొడుకు, ఆయన శిష్యులు మందు తయారీకి సహకరిస్తామన్నారు… ప్రజలను మోటివేట్ చేసుకుని, కొన్ని మూలికలు సేకరించారు… మొత్తం 5.2 లక్షల మందికి ఆ మందు చేరాలనేది పెద్ద టాస్కే… ఎలాగూ హైకోర్టు వోకే అన్నది, ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది… నష్టమైతే లేదు, మంచి జరిగితే మంచిదేగా… ఇదుగో ఈ భావనతో ఈ టాస్క్ తీసుకున్నాడు… ప్రజలు స్వచ్ఛందంగా గ్రామాల్లో లభించే వేప, నేరేడు, మామిడి, నేల ఉసిరి, పిప్పింట, బుడ్డ బుడవ ఆకులు, కొండ పల్లేరు కాయలు, తెల్ల జిల్లేడు పూలు తీసుకొచ్చి మందు తయారీలో భాగస్వాములు కావడం విశేషమే…
ఇదే సుబ్బారెడ్డికీ, చెవిరెడ్డికీ నడుమ తేడా… చెవిరెడ్డి జనం కోణం నుంచి చూస్తాడు… సుబ్బారెడ్డి తన కోణం నుంచి చూస్తాడు ఏదైనా… ఇక్కడ చెవిరెడ్డి ప్రయత్నాన్ని అభినందించాలి… ఆ మందు పనిచేస్తుందా లేదానేది కాదు ముఖ్యం… ఓ సానుకూల దృక్పథంతో అడుగులు వేయడం… అసలు హైకోర్టులో జగన్ ప్రభుత్వ న్యాయవాది వాదనలే ఈ మందుకు వ్యతిరేకంగా సాగుతున్నయ్… అసలు ప్రభుత్వ వైఖరి ఏమిటో ఎవరికీ క్లారిటీ లేదు… ఈ గందరగోళం, ఈ అయోమయంలోనూ చెవిరెడ్డి ‘తన ప్రజలకు’ ఉపయోగపడే రీతిలో వర్క్ చేసుకుంటున్నాడు… మందు పనిచేస్తే జనం చెవిరెడ్డికి జేజేలు కొడతారు… మందు పనిచేయకపోయినా సరే, మా ఎమ్మెల్యే మాకు ఆనందయ్య మందు పంపించాడు అని మరింతగా తనతో కనెక్ట్ అయిపోతారు… జనంతో ఉంటూ, జనంలోనే తిరుగుతూ, జనం ధ్యాసగా రాజకీయాలు చేస్తే ఇలా ఉంటుంది… ఈ మందు సంగతి వదిలేయండి, ప్రతి ఎమ్మెల్యే ఒక్కసారైనా, ఈ కరోనా నేపథ్యంలో జనానికి ఏం సాయపడుతున్నామో ఆత్మవిమర్శ చేసుకున్నారా..? రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ..!! https://www.facebook.com/suryaprakash.josyula/videos/4184479754929027
Share this Article