వాణిశ్రీ మేకప్పు లోనే కాదు , మేకప్పు లేకపోయినా కూడా అందంగానే ఉంటుందని రుజువు చేసిన సినిమా 1978 లో వచ్చిన ఈ గోరంతదీపం సినిమా . ఈ సినిమా కూడా వాణిశ్రీ సినిమాయే . ఆమే షీరో . అమాయకపు మెగుడు , జులాయి మామ , ఆరళ్ళు పెట్టే అత్త , అమాయకపు మొగుడి బెస్ట్ ఫ్రెండ్ అవతారంలో ఓ స్త్రీలోలుడు , వాడి వెంట ఓ గాలి బేచ్ , అత్తారింటికి పోయాక అత్తారిల్లే పుట్టిల్లు అని సూక్తి ముక్తావళి బోధించే తండ్రి . ఇలాంటి సర్కస్సులో అన్నింటినీ అధిగమిస్తూ , తనను తాను రక్షించుకునే పాత్రలో వాణిశ్రీ అపూర్వ నటన .
ఈ సినిమాకు స్క్రీన్ ప్లే , మాటలు ముళ్ళపూడి వ్రాసారు . ఆయన్ని తప్పకుండా మెచ్చుకోవాలి . ఈ సినిమాలో రెండు స్త్రీ పొత్రలు ఉంటాయి . రెండింటినీ చాలా గొప్పగా మలిచారు . ఒకటి వాణిశ్రీది అయితే , మరొకటి జి వరలక్ష్మిది . చాలామంది ఈ రెండో పాత్రను నోటీస్ చేయరు . చేసినా గుర్తుంచుకోరు . మొగుడు గాలికి తిరుగుతున్నా పట్టించుకోకుండా తన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ భరించే పాత్ర . కుటుంబ పోషణ కూడా ఆమే నిర్వహించుకునే పాత్ర .
ఈ సినిమాలో మరో పాత్ర జులాయి విలన్ పాత్ర . మోహన్ బాబు నో ప్రాబ్లమ్ అంటూ బాగా పోషించాడు . అమాయకపు మొగుడిగా శ్రీధర్ , కోడల్ని రాచిరంపాన పెట్టే పాత్రలో సూరేకాంతం , గాలి బేచిలో సభ్యులుగా రావు గోపాలరావు , అల్లు రామలింగయ్య , సారధి , చిడతల అప్పారావులు నటించారు . తోటలో పాటల్లో డాన్సర్లుగా బాపు గారి హలం , జయవిజయలు హుషారు చేస్తారు .
Ads
కమర్షియల్ గా ఎలా ఆడిందో తెలియదు కానీ బాపు మార్కు మంచి సినిమా . ముఖ్యంగా వాణిశ్రీ పాత్ర . క్లైమాక్సులో చింత బరికె తీసుకుని మోహన్ బాబుని ఉతికే పాత్రలో భద్రకాళిలా నటించింది . మేకప్పు లేకుండా వాణిశ్రీని అంత అందంగా చూపించటం బాపు , ఇషాన్ ఆర్యలకే చెల్లింది . ఈ సినిమాలో నాకు బాగా నచ్చింది తండ్రి కాంతారావు పాత్ర .
కూతుళ్లు తండ్రుల మాటలు వినే రోజుల్లో అత్త గారింటికి వెళ్ళేటప్పుడు చెప్పే మాటల్ని కాంతారావు పాత్ర ద్వారా ముళ్ళపూడి బాగా చెప్పారు . కాలికి ముల్లు గుచ్చుకుంటే కంటికి గుచ్చుకోనందుకు అనందించాలి . నీవు తిన్నది నీవే అరిగించుకోవాలి . నీ కష్టాల్ని నీవే భరించాలి . ఎన్ని ఇబ్బందులు వచ్చినా పుట్టింటి వైపు చూడకుండా సమర్ధించుకోవాలి . ఇవీ తండ్రి కాంతారావు మాటలు . ఇప్పటికీ చాలామంది గృహిణులు ఈ కోవకు చెందినవారే .
ఈ సినిమా పాపులర్ అవటానికి కారణం పాటల్ని వ్రాసిన ఆరుద్ర , సి నారాయణరెడ్డి , సంగీతాన్ని అందించిన కె వి మహదేవన్ . అర్థవంతమైన సాహిత్యం . ప్రతీ పాటలో కూడా గొప్ప సాహిత్యం . సి నారాయణరెడ్డి వ్రాసిన టైటిల్ సాంగే చాలా బాగుంటుంది . గోరంత దీపం కొండంత వెలుగు చిగురంత ఆశ జగమంత వెలుగు . పాట నిండా చక్కటి సాహిత్యం గుభాళిస్తుంది .
ఆరుద్ర వ్రాసిన పాట రాయినైనా కాకపోతిని రామ పాదము సోకగా బోయనైనా కాకపోతిని . ఎలాగోలాగా బాపు తన రామ భక్తిని చూపాల్సిందే . చాలా శ్రావ్యంగా ఉంటుంది .
సాంఘిక చిత్రాల్లో బాపు తోటల్లో పాటల్ని పెట్టాల్సిందే . ఈ సినిమాలో అలాంటివి రెండు పాటలు ఉంటాయి . ఒకటి బాపు గారి హలం మీద . చెల్ మోహన రంగా చెల్ చెల్ నీకు నాకు ఈడుజోడు కదరా పాట . సినారె వ్రాసిన ఈ పాటలో హలం అందరి చేత గంతులు వేయిస్తుంది . బొచ్చు కుక్కల్ని చేస్తుంది . డాన్సే కాదు , నటన కూడా బాగుంటుంది . మరో తోటలో జయవిజయ , రావు గోపాలరావు , ఓ ఆడ గుంపుల మీద పాట . అసలా ఐడియా బాపు-రమణలకు ఎలా వచ్చిందో . అంతమంది ఆడ గుంపుని పెట్టి బృందావనంలో గోపికలు – కృష్ణుడి లాగా . జులాయి గాలి బేచి ఇలాగే ఉంటుంది . ఆరుద్ర వ్రాసారు ఈ పాటను . చందమామ రావోయి జాబిల్లి రావోయి . ఈ రెండు తోటలో పాత్రలు బాపు ప్రకృతి టేస్టుకి ప్రతీకలుగా కనిపిస్తాయి .
వాణిశ్రీ అల్లు రామలింగయ్యని అల్లరి చేసే పాట హరి హరి నారాయో ఆది నారాయో కూడా బాగుంటుంది . మిగిలిన డ్యూయెట్లు కూడా చాలా శ్రావ్యంగా ఉంటాయి .
నేరెళ్ళ రామలక్ష్మి కధ అని టైటిల్సులో వేసారు . ఈ రామలక్ష్మి ఆరుద్ర గారి రామలక్ష్మా లేక మరో రామలక్ష్మా నాకు తెలియదు . ఈ సినిమాలోని 70 స్టిల్సుకు వాణిశ్రీ సంతకంతో నవోదయ పబ్లిషర్స్ వారు వెండితెర నవల రూపంలో మూడు రూపాయలకు అమ్మారు .
మొత్తం మీద లేడీ ఓరియెంటెడ్ మ్యూజికల్ హిట్ సినిమా ఈ గోరంతదీపం . వాణిశ్రీ నటనకు , బాపు దర్శకత్వానికి , మోహన్ బాబు విలనిజానికి నిదర్శనం ఈ సినిమా . తప్పకుండా చూడతగ్గ సినిమా . తరచూ ఏదో ఒక టివి చానల్లో వస్తూనే ఉంటుంది . యూట్యూబులో కూడా ఉంది . యూట్యూబులో కన్నా టివిలో చూస్తే ఇంకా బాగుంటుంది . పాటల వీడియోలు మాత్రం మిస్ కాకండి . మరీ ముఖ్యంగా బాపు మార్కు తోటలో పాటలు , హలం , జయవిజయల డాన్సులను ఆస్వాదించండి . మనిషన్నాక కూస్తంత కళాపోషణ ఉండాలి కదా మరి … #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు…….. [దోగిపర్తి సుబ్రహ్మణ్యం]
Share this Article