.
A movie with heart-touching emotion and filled with drama .
చాలా నవలల్ని సినిమాలుగా తీస్తుంటారు . కానీ కొన్ని మాత్రమే మనసును తాకుతాయి . అలా గుండెల్లో నిలిచిపోతాయి . కె రామలక్ష్మి వ్రాసిన రావుడు అనే నవల ఆధారంగా ఈ గోరింటాకు సినిమా తీయబడింది . ఈ గోరింటాకు సినిమా చూసినప్పుడు నాకు గుర్తుకొచ్చిన సినిమా డా. చక్రవర్తి . ఆ సినిమా ఎలా అయితే ప్రేక్షకుల మనసుల్ని తాకుతుందో ఈ గోరింటాకు సినిమా కూడా అంతే .
Ads
రామలక్ష్మి నవలకు సినిమాకు అనుకూలంగా మార్చుకుని అద్భుతమైన డైలాగులను అందించారు దాసరి నారాయణరావు . గొప్ప దర్శకత్వం . ఫైటింగులు , గంతులు , బూతులు వంటి మసాలాలు ఏమీ లేకుండా ప్రేక్షకులను కదలనివ్వకుండా తీసారు దాసరి . సినిమా అంతా విశాఖపట్నం నేపధ్యంలో తీసారు . చలం , రమాప్రభ పాత్రలతో ప్రేక్షకులను శ్రీకాకుళం యాసకు కనెక్ట్ చేసారు .
శోభన్ బాబు కెరీర్లో గొప్ప సినిమా . సక్సెస్ అయిందని కాదు . చాలా చాలా బాగా నటించారు . బేవార్స్ తండ్రితో గొడవపడి పట్టుదలతో చదువుకునే వ్యక్తిగా , బాధ్యత కల మనిషిగా , తనను ఆదరించిన వారిని ఆరాధించిన వారిని ఎవరినీ అసంతృప్తికి గురిచేయకుండా తానే సతమతమయ్యే పాత్రలో హుందాగా , అందంగా నటించారు .
ఈ సినిమాలో మనం మరచిపోలేని పాత్ర స్వప్న , ఆ పాత్రలో నటించిన సుజాత . ఆమె నటించిన మొదటి తెలుగు సినిమా గుప్పెడు మనసు . తమిళం , తెలుగు భాషల్లో బాలచందర్ ఒకే సారి తీసారు . ఈ సినిమా 7-9-1979 న రిలీజ్ అయింది . గోరింటాకు సినిమా 12-10-1979 న రిలీజ్ అయింది . ఆమెకు రెండు సినిమాలలోనూ మంచి పేరు వచ్చింది .
మరో ప్రధాన పాత్రను వక్కలంక పద్మ నటించింది . ఈమె నటించిన ఏకైక సినిమా . గాయని సరళ కుమార్తె . అంతర్జాతీయ జర్నలిస్టుగా ఉన్నారిప్పుడు . తనకొచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది .
మరో ప్రధాన పాత్ర . డైలాగులతో సినిమాలను దట్టించే దాసరి మహానటి సావిత్రి పాత్రకు చాలా తక్కువ డైలాగులు వ్రాసారు . ఆమెకు డైలాగులు ఎందుకు ? ఆమె కళ్ళతో , పెదాలతో మాట్లాడేస్తుంది కదా ! మొత్తం మీద ఈ సినిమాలో దాసరి డైలాగులను ఎక్కువగా పెట్టలేదనే అనిపిస్తుంది . (ఓ స్టార్ హీరోయిన్, ఆ మహానటిని ఆ అనామక పాత్రలో చూడటం చాలామందిని బాధించింది కూడా..)
ప్రేక్షకులు గుర్తుంచుకునే పాత్రలు మరో రెండు ఉన్నాయి . అవి చలం , రమాప్రభలు నటించిన పాత్రలు . కధలో కీలకమయినవే . ఇద్దరూ శ్రీకాకుళం యాసలో తినేసారు . ఇతర పాత్రల్లో రమణమూర్తి , ప్రభాకరరెడ్డి , బేబి తులసి , వంకాయల , దేవదాస్ కనకాల , సాక్షి రంగారావు , పి జె శర్మ ప్రభృతులు నటించారు .
ఈ సినిమాకు ప్రాణం పోసిన మరో వ్యక్తి సంగీత దర్శకుడు కె వి మహదేవన్ . పాటలన్నీ హిట్టే . ముఖ్యంగా దేవులపల్లి వారు వ్రాసిన గోరింట పూసింది కొమ్మ లేకుండా పాట . సాహిత్యం , సంగీతం , సావిత్రి నటన అద్భుతం . మరో గొప్ప పాట కొమ్మ కొమ్మకో సన్నాయి కోటి రాగాలు ఉన్నాయి . సూపర్ హిట్ సాంగ్ . వేటూరి వారిది .
దేవులపల్లి వారిదే మరో పాట ఎలా ఎలా దాచావు అలివికాని అనురాగం పాట . సుశీలమ్మ చాలా శ్రావ్యంగా పాడారు . శ్రీశ్రీ వ్రాసిన ఇలాగ వచ్చి అలాగ జొచ్చి ఎన్నో వరాల మాలలు గుచ్చి పాటను వ్రాసారు . పాడితే శిలయైనా కరగాలి చాలా ఆర్ద్రంగా , హృద్యంగా ఉంటుంది . ఈ పాట వక్కలంక పద్మ మీద ఉంటుంది . ఆమె కూడా బాగా నటించారు . డ్యూయెట్లలో శోభన్-సుజాత , శోభన్-పద్మల రెండు కాంబినేషన్లు చక్కగా ఉంటాయి . డ్యూయెట్ల చిత్రీకరణ కూడా బాగుంటుంది .
సినిమా కధ మీద కోర్ట్ కేసులు కూడా నడిచాయి . ఈ కధ నాది అని ముప్పాళ్ళ రంగనాయకమ్మ రామలక్ష్మి మీద , నిర్మాతల మీద , దర్శకుని మీద , పంపిణీ దారుల మీద కేసు వేసింది . తాను వ్రాసిన ఇదేనా న్యాయం నవలను కాపీ కొట్టారని అభియోగం మోపారు .
యువచిత్ర బేనరుపై ప్రముఖ నిర్మాత మురారి ఆధ్వర్యంలో వచ్చిన ఈ సినిమా చాలా అవాంతరాలతో పూర్తయి సూపర్ హిట్టయింది . ఉత్తమ చిత్రం , ఉత్తమ దర్శకత్వం అవార్డులను ఫిలిం ఫేర్ ఇచ్చింది . దాసరి నారాయణరావు దర్శకత్వం లోనే హిందీలో మెహందీ రంగ్ లాయేగీ టైటిలుతో వచ్చింది . జితేంద్ర , రేఖ , అనితారాజ్ నటించారు .
మహిళలు విపరీతంగా మెచ్చిన సినిమా . An unmissable emotional , musical , neat and decent movie . యూట్యూబులో ఉంది . చూసి ఉండకపోతే తప్పక చూడండి . మనసుతో మాట్లాడే సినిమా . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు …….. (దోగిపర్తి సుబ్రహ్మణ్యం)
Share this Article