.
ముందుగా సోషల్ మీడియా, మీడియాలో బహుళ ప్రచారంలో ఉన్న ఓ వార్త చదవండి…
ఆపిల్ కు గట్టిపోటీ ఇవ్వనున్న టెస్లా!
ఎలోన్ మస్క్ 2024 చివరలో Tesla Pi మొబైల్ ఫోన్ లాంచ్ చేస్తున్నాడు, ఈ మొబైల్ ఫోన్‌లో ఏ మొబైల్ కంపెనీలోనూ లేని రెండు ఫీచర్లు ఉన్నాయి.
Ads
1. ఈ మొబైల్‌కి ఛార్జింగ్ అవసరం లేదు, ఇది సూర్యకాంతితో ఆటోమేటిక్‌గా ఛార్జ్ అవుతుంది, ఇది మీ జేబులో ఉన్నా కూడా ఛార్జ్ అవుతూనే ఉంటుంది
2. ఈ టెస్లా మొబైల్‌కి ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేదు, ఇది టెస్లా యొక్క ఇంటర్నెట్ స్టార్‌లింక్ ఉపగ్రహంతో పని చేస్తుంది, కాబట్టి మీరు ఎక్కడ ఉన్నా, చంద్రునిపై కూడా, ఈ మొబైల్ ఇంటర్నెట్ పని చేస్తూనే ఉంటుంది. అంటే సిగ్నల్ సమస్య ఉండదు. ఫోన్, డేటా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయి.
ఇదీ వార్త… మనం ఆల్రెడీ నవంబరులో ఉన్నాం, అంటే మరో నెలలోపు ఈ ఫోన్ వచ్చేస్తుందా..? తుస్… బోగస్… ఎవరో స్టార్ట్ చేస్తారు ఈ వార్తలు, మిగతావాళ్లు గుడ్డిగా షేర్ చేస్తూ వెళ్తారు… అదుగో ఏనుగు అంటే ఇదుగో తొండం అన్నట్టుగా…
ఎలన్ మస్క్ స్వయంగా ఈమధ్య ఫిలడెల్ఫియాలో ఒక ప్రశ్నోత్తర కార్యక్రమంలో ఈ మొబైల్ వార్తల్ని కొట్టిపారేశాడు… తను క్లియర్‌గానే చెప్పాడు… ‘‘అలాంటి ఫోన్లను మేం చేయలేమని కాదు, కానీ ఇప్పుడు అవసరం లేదు, మా ఆలోచనల్లో అది లేదు, మా ప్రయారిటీల్లో కూడా అది లేదు’’
అంతేకాదు… ఒకవేళ యాపిల్, గూగుల్ యాప్స్ మీద నియంత్రణ వంటి పోకడలకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఫోన్ మార్కెట్‌లోకి వస్తాం అనీ హింట్ ఇచ్చాడు… ఐతే కొత్తగా ఇప్పటికిప్పుడు మొబైల్ ఫోన్ల మార్కెట్‌లోకి అడుగు పెట్టే ఆలోచన లేదు, అవసరం లేదు అనేది తన సమాధానం…
ఐనా ఆ టెస్లా పై ఫోన్ మీద పోస్టులు కనిపిస్తూనే ఉంటాయి… దానికి కారణం, నిజంగా ఇలాంటి ఫోన్లు వస్తే బాగుండుననే ఆశ… నిజంగా వార్తల్లో కనిపిస్తున్న ఫీచర్లు సాధ్యమేనా..? అవీ చర్చనీయాంశాలే…
(ఈమధ్య కొన్ని పోస్టులు, మొబైల్ డ్రోన్ లాగే పైకి ఎగిరి ఏరియల్ షూట్ చేయగలదని…)
1) Perpetual Battery అనేది అసాధ్యమని కాదు… కానీ ఇప్పటికైతే ఆ టెక్నాలజీ లేదు… నిరంతరం దాంతటదే చార్జ్ కావడం క్లిష్టమైన పరిశోధన… ఏమో, టెక్నాలజీలో మంచి ప్రయోగాలు చేస్తున్న మస్క్ టీమ్‌కు అసాధ్యమేమీ కాకపోవచ్చు… భవిష్యత్తులో…!
2) స్టార్‌లింక్ ఉపగ్రహం నుంచి నేరుగా మొబైల్‌కు కనెక్టివిటీ అనేది కూడా టెక్నాలజీ రీత్యా సాధ్యమేమో కానీ వాణిజ్యపరంగా అంత వర్కవుట్ కాదు ఇప్పుడు..! శాటిలైట్ ఫోన్లు ఆల్రెడీ మార్కెట్‌లో ఉన్నాయి… కానీ కాస్ట్‌లీ… మస్క్ శాటిలైట్ కంపెనీ స్పేస్ ఎక్స్ నుంచి భవిష్యత్తులో అదీ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు… చీప్ అండ్ ఫాస్ట్ బ్రాడ్‌బాండ్…
3) చంద్రుడి మీద ఉన్నా, అంగారకుడి మీద ఉన్నా సిగ్నల్ సమస్య ఉండదు… ఇది అతిశయోక్తి… కానీ ఎలాగూ ఒకవేళ నిజంగానే స్టార్‌లింక్‌తో అనుసంధానమైతే అది అసాధ్యమూ కాదు… కానీ అక్కడ వాడేవాడు ఎవడు..?
ప్రస్తుతం తమ ప్రాధాన్యత ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, ఆటో మార్కెట్, ఆల్టర్నేట్ న్యూ ఎనర్జీ, స్పేస్ షిప్స్ వంటి రంగాలేనని.., విపరీతమైన పోటీ, సంప్రదాయిక టెక్నాలజీతో చౌక మార్కెట్ ఉన్న మొబైల్ మార్కెట్ ఇప్పుడు తనకు అవసరం లేదనీ, సో, మొబైల్ పై అనేది జస్ట్ ఊహాగానమేనని మస్క్ ఫోన్ స్క్రీన్ బద్దలు కొట్టేశాడు..!!
Share this Article