పైపైన చదివితే చాలా చిన్న వార్త… నిజానికి పెద్ద ఇష్యూయే కాదు… మన దేశంలో నాయకుల విలాసాలు, అట్టహాసాలు, ఆడంబరాలు, వ్యక్తిగత సిబ్బంది, టూర్లు, వాహనాలు, ఖర్చులు… ఓహ్… ఖజానాకు పెద్ద పెద్ద తూట్లు… పెద్ద పెద్ద సంపాదనలు, ఆస్తులు, సంపదలు గట్రా పక్కన పెట్టేయండి… చివరకు బువ్వ తినే ప్లేటు, చాయ్ తాగే కప్పు, దాని కింద సాసర్, కడుక్కున్న మూతిని తుడుచుకునే చిన్న తువ్వాళ్లు కూడా ప్రజల సొమ్ము నుంచే అధికారికం, అదనం… అవి కూడా తనకిచ్చే జీతాల నుంచి కొనుక్కోలేరా అనడక్కండి… పదవిలో ఉన్నప్పుడు జేబు నుంచి నయాపైసా ఖర్చుపెట్టినా సరే అది నామర్దా, పరువు తక్కువ వ్యవహారం… వీవీఐపీ ట్రీట్‌మెంట్ అనేది చాలా పెద్ద సబ్జెక్టు… పర్ సపోజ్, ఓ మంత్రిగారు ఓ ఊరికి వెళ్తే, ఇక రెవిన్యూ వాళ్లకు, సదరు మంత్రిత్వ శాఖ స్టాఫ్‌కు చుక్కలే… అఫ్‌కోర్స్, మళ్లీ ఆ ఖర్చంతా జనం నుంచి దండుతారు, అది వేరే కథ…
మొన్న ఇలాగే కర్నాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్‌కు జోగ్ ఎత్తిపోతలు చూడాలని అనిపించింది… మరి గవర్నర్ కోరిక అంటే మాటలా..? కేంద్ర ప్రతినిధి, ఆ రాష్ట్రానికి ప్రథమ పౌరుడు, పైగా సొంత పార్టీ… అనుకున్నదే తడవుగా కాన్వాయ్ బయల్దేరింది… మర్యాదలకు ప్రొటోకాల్ స్టాఫ్ ఎలాగూ ఉంటారు కదా… కానీ ఓ చిక్కు వచ్చిపడింది… శివమొగ్గ జిల్లాలోని జోగ్ జలపాతం మాంచి వర్షాలున్నప్పుడు, నీటి ఉధృతి ఉన్నప్పుడు చూడటానికి రెండు కళ్లూ సరిపోవు… నయాగారాకు తాత ఇది… మామూలు రోజుల్లో చూడటానికి ఏమీ ఉండదు… ఎగువన ఏవేవో రిజర్వాయర్లు, కట్టలు కట్టేశారు కాబట్టి నేచురల్ ఫ్లో కూడా తక్కువ… ఈ గవర్నర్ గారు వెళ్తున్నప్పుడేమో (నవంబరు 25) పెద్ద వరద లేదు, పెద్ద వర్షాల్లేవు, పెద్దగా నీళ్లు లేవు… మరేం చేయాలి..?
Ads
గవర్నర్ వచ్చినా సరే ఆ జలపాతం నీళ్లు కురియకపోతే ఎలా..? బాగుండదు కదా… అదేమీ సినిమా సెట్టింగ్ కాదాయె, ఎడాపెడా మార్చేయడానికి… ఏమయ్యా, నేనొచ్చినా సరే, జలపాతంలో నీళ్లు పడవా అని ఆయన గనుక అడిగితే ఎంత అమర్యాద… అందుకని కర్నాటక పవర్ కార్పొరేషన్ లింగనమక్కి రిజర్వాయర్ నుంచి అయిదు వందల క్యూసెక్కుల నీటిని అర్జెంటుగా జలపాతం స్ట్రీమ్‌లోకి, అంటే శారావతి నదీప్రవాహంలోకి మళ్లించేశారు… అక్కడో హైడల్ ప్లాంటు ఉందిలెండి, అందుకే దాని మీద కరెంటోళ్ల పెత్తనం… నాలుగైదు గంటలు నీటిని వదిలేశారు… జలపాతానికి అప్పటికప్పుడు కాస్త జలకళను తెచ్చిపెట్టారు… ఆయన గారు అలా వెళ్లారు, కొన్ని నిమిషాలు అక్కడ ఉన్నారు, ఫోటోలు దిగారు, వెళ్లిపోయారు… తిరిగి నీళ్లు బంద్… ఇక్కడ ఇష్యూ ఏమిటంటే..? ఆయన కోసం ప్రభుత్వం, అధికారులు పెట్టిన ఖర్చు కాదు… నాలుగైదు గంటలపాటు వృథా చేసిన ఆ నీటి వల్ల కోల్పోయిన కొన్ని వేల యూనిట్ల కరెంటు కూడా కాదు… అసలే కరెంటు కొరత ఉన్న రోజుల్లో, అత్యంత చౌక కరెంటును కూడా కాదనుకుని, అర్జెంటుగా-కృత్రిమంగా ప్రకృతి దృశ్యాన్ని మార్చాలా ఒక వ్యక్తి కోసం..? మన దేశం రాచరికం నుంచి ఎప్పుడో బయటికొచ్చేసిందని భ్రమల్లో ఉంటాం గానీ… నో, మనం ఇంకా రాచరికంలోనే ఉన్నాం, అరాచరికంలో..!!
Share this Article