ఒక సోమనాథ్ టెంపుల్, అనేకసార్లు ధ్వంసం చేయబడినా, దేశ విభజన తరువాత ప్రభుత్వం పునర్నర్మించింది… ఒక అయోధ్య టెంపుల్, హిందూ సమాజం పునర్నిర్మించుకుంది… పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉన్న శారదా పీఠాన్ని తిరిగి పునరుద్ధరిస్తున్నారు… పాకిస్థాన్‌లోనే ఉన్న కర్తార్‌పూర్ గురుద్వారా కోసం ప్రత్యేకంగా కారిడార్ నిర్మించాయి రెండు దేశాలూ… ఇవన్నీ ఎలా ఉన్నా… సోమనాథ్ టెంపుల్ తరహాలో ప్రభుత్వమే ఓ గుడిని పునర్నిర్మించబోతోంది… అదీ హిందువులను ఊచకోత కోసి, తరిమేసిన కాశ్మీర్‌లో… ఆ గుడి పేరు మార్తాండ సూర్య దేవాలయం…
మీడియా అటెన్షన్ ఉండదు… సాఫీగా సాగిపోతున్న వ్యవహారం కదా, దానికి ఆసక్తి కూడా ఉండదు… అనంతనాగ్ ఏరియా అంటేనే టెర్రరిస్టులు, పాకిస్థానీ, ఐఎస్ఐ సానుభూతిపరుల అడ్డా… అక్కడ ఉండేది రాజా లలితాదిత్య అప్పుడెప్పుడో నిర్మించిన ఆలయం… గుడి పునరుద్ధరణ, పునర్నిర్మాణమే కాదు, లలితాదిత్యుడి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయబోతోంది జమ్ము-కశ్మీర్ ప్రభుత్వం…
ఈమేరకు కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి నీరజ్ పండిత 27 మార్చిన ఓ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది… అధికారిక ప్రకటన ఏమంటున్నదంటే… ‘‘సాంస్కృతిక శాఖ ముఖ్యకార్యదర్శి ఓ భేటీ ఏర్పాటు చేశారు… కశ్మీర్‌లోని పాత గుళ్ల పునరుద్ధరణ, రక్షణకు ఏం చేయాలో చర్చించడానికి… ఈ భేటీ ఈ ఒకటో తేదీన జమ్ములో జరగనుంది… సంబంధిత అధికారులంతా హాజరు కావాలి…’’
Ads
రీసెంటుగా అయోధ్య నుంచి వచ్చిన ఓ కలశాన్ని ఆ సూర్య దేవాలయంలో ప్రతిష్టాపించారు… ఉత్తరప్రదేశ్, తమిళనాడుల నుంచి వచ్చిన భక్తజనం ఈ ఉత్సవంలో పాల్గొన్నారు… గత నెలలో జమ్ము-కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఈ మార్తాండ సూర్య దేవాలయాన్ని సందర్శించి ప్రార్థనలు జరిపాడు… శ్రీ మార్తాండ సూర్య తీర్థ ట్రస్టు నిర్వహించిన మహాయజ్ఞంలో కూడా ఆయన పాల్గొన్నాడు…
ఎప్పటిది ఈ గుడి..?
ఈ ఆలయం 8వ శతాబ్దంలో నిర్మించబడింది… 1389 నుంచి 1413 నడుమ అనేకసార్లు దీన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నాలు జరిగాయి… హిందూ పాలకుడు లలితాదిత్యుడు ఈ సూర్యుడి గుడిని నిర్మించాడని నమ్ముతారు… ఆయన సూర్య వంశ క్షత్రియుడు… ఆలయ నిర్మాణంలో కనబరిచిన వాస్తు నైపుణ్యం ప్రపంచ చరిత్రలోనే విశిష్టమైనవని చెబుతారు… సూర్యుడి కిరణాలు రోజంతా సూర్యుడి విగ్రహం మీద పడేలా ఆలయ నిర్మాణం జరిగింది…
చరిత్ర పత్రాల ప్రకారం… ఈ దేవాలయాన్ని సికందర్ షా ఆదేశాల మేరకు ధ్వంసం చేయబడింది… లలితాదిత్యుడు నిర్మించిన నగరాలు, పట్టణాల గురించి సమాచారం పెద్దగా లేకపోయినా, దొరక్కపోయినా ఈ సూర్య దేవాలయం నాటి కశ్మీరీ హిందూ వాస్తు నిపుణుల జ్ఞానానికి ప్రతీకగా చెబుతారు… ఇదీ ఆ ఆలయం కథ… ప్రభుత్వమే పునర్నిర్మించబోయే మరో సోమనాథ ఆలయం కథ…!!
Share this Article