బాబా ఆమ్టే… ఈ పేరు విన్నారా..? తనను మోడరన్ గాంధీ అనేవాళ్లు… ఈ గడ్డ మీద జన్మించిన గొప్ప సంఘసేవకుడు… రామన్ మెగసెసే అవార్డు విజేత… పద్మవిభూషణ్… గాంధీ శాంతి బహుమతి గ్రహీత… మానవహక్కుల ఐక్యరాజ్యసమితి ప్రత్యేక పురస్కారం… లక్షల మంది లెప్రసీ బాధితులను సమాజం వదిలించుకుంటే, తన ఆశ్రమంలో ఆశ్రయం కల్పించి, చికిత్స ఇప్పించాడు… తన ఆశ్రమం పేరు ఆనందవన్… దాన్ని నడిపేది మహారోగి సేవాసమితి అనే స్వచ్చంద సంస్థ… ఆ ఊరు వరోడా… చంద్రాపూర్ జిల్లాలో ఉంటుంది… 1959లో స్థాపించాడు… తను 2008లో కన్నుమూశాడు…
ఇక అసలు కథలోకి వస్తే… ఏదైనా గొప్ప వ్యవస్థ దాని నిర్మాత తదనంతరమూ అదే ఆదర్శాల అడుగుల్లో నడవాలీ అంటే… వారసులు కూడా అదే కమిట్మెంటుతో ఉండాలి… కానీ చాలాసార్లు అలా జరగదు… ఇక్కడా అంతే… ఆమ్టే మరణించిన తరువాత కుటుంబ కలహాలతో ఆశ్రమం, సంస్థ గాడితప్పినయ్… ఆ సంస్థ ఉద్దేశమే తప్పుదారి పట్టింది… చివరకు దాన్ని ప్రక్షాళన చేయబోయి, చేయలేక, ఒత్తిడి భరించలేకపోయిందో, ఇంకేమైనా కారణం ఉందో గానీ… ఆ గాంధీ మనమరాలు శీతల్ మరణించింది… ఆమె వయస్సు 39 ఏళ్లు…
Ads
కొద్దిరోజులుగా పత్రికల్లో కథనాలు వస్తున్నయ్… ఆ కుటుంబంలో ఉన్న కలహాలు, ఆశ్రమ నిర్వహణలో అవకతవకలు బయటికొస్తున్నయ్… వాళ్లో వీళ్లో రాయడం కాదు, సాక్షాత్తూ శీతల్ స్వయంగా మొన్న ఓ వీడియో ఫేస్బుక్లో పోస్ట్ చేసింది… చాలా విషయాల్ని వివరించింది… తరువాత రెండు గంటలకే దాన్ని డిలిట్ చేసింది…
పంచాయితీ ముదిరింది ఎక్కడా అంటే… అయిదేళ్ల క్రితం సీఈవో పోస్టు క్రియేట్ చేశారు… ఆ స్థానంలోకి వచ్చింది ఈ శీతల్… వచ్చీరాగానే చాలా తప్పుల్ని పట్టుకుంది,.. అప్పటిదాకా ఈ వ్యవహారాలు చూసే ఆమ్టే పెద్ద కొడుకు కౌస్తుభ ఈమెతో విభేదించి, రాజీనామా చేసి, ఆశ్రమం విడిచిపెట్టి వెళ్లిపోయాడు… తనను మళ్లీ తీసుకురావాలని ఇతర కుటుంబసభ్యుల ఒత్తిడి… ఈలోపు ఈమె మరికొన్ని తప్పుల్పి పట్టుకుంది… పీటముడి పడింది…
కౌస్తుభను మళ్లీ ట్రస్టులోకి తీసుకునేందుకు అందరూ మెజారిటీ నిర్ణయంతో అంగీకరించారని, ప్రాబ్లమ్ సాల్వ్ అయిందనీ, కౌస్తుభ ఆశ్రమం చేపట్టే సోమనాథ్ ప్రాజెక్టు బాధ్యతల్ని చూస్తాడని విలేకరులకు తెలిపింది కుటుంబం… కోట్ల రూపాయల ట్రస్టు అది… లెప్రసీ బెడద తగ్గేకొద్దీ ఇతర సామాజిక కార్యక్రమాల్ని చేపడుతోంది… గిరిజనులకు శిక్షణ, ఉపాధి, తాగునీరు వంటివి… అందులో గడ్చిరొలి గిరిజనుల కోసం ఉద్దేశించిన హేమలకాస వంటి ప్రోగ్రామ్స్ కూడా ఉన్నయ్…
ఇంతలో ఏమైందో శీతల్ శవం కనిపించింది… కుటుంబ కలహాలు, ఒత్తిడి భరించలేక ఓ ప్రాణాంతక ఇంజక్షన్ తనే తీసుకున్నదని ప్రచారం మొదలైంది… హత్యా, ఆత్మహత్యా ఇంకా పోలీసులు ఇతమిత్థంగా ఏదీ చెప్పలేదు… అది హత్యే కావచ్చు, ఆత్మహత్యే కావచ్చు… మరణానికి కారణం మాత్రం ఖచ్చితంగా ఆశ్రమం అవకతవకలే… కుటుంబకలహాలే… నాకెందుకని వదిలేస్తే ఆమెకు ఏ నష్టమూ ఉండకపోయేది… కానీ అలా ఉండలేకపోయింది… చివరకు అదే ఆమెను మింగేసింది… కుటుంబం అంతా కూడబలుక్కుని ఆత్మహత్య అని ఒక ప్రకటన జారీ చేసింది… ప్చ్, నాలుగు రోజులకు ఆమెను అందరూ మరిచిపోతారు… కానీ ట్రస్టులపై జనం ట్రస్టు మరింత కొడిగడుతుంది… అది మరొక విషాదం… ‘మంచికి’ రోజులు కావు ఇవి…!!
Share this Article