ఈనాడు వాడికి ఈ ఫోటోను, ఈ వార్తను సరిగ్గా ప్రజెంట్ చేయడం చేతకాలేదు కానీ… ఈ స్వాగత ద్వారాన్ని చూడగానే ఎన్ని ఆలోచనలు మనిషిని చుట్టుముడతాయో కదా… ఓ క్షణం అవాక్కవుతాం… ఆ స్మశానవాటిక లోపలవైపు లయకారుడు శివుడి బొమ్మ ఏదో అస్పష్టంగా కనిపిస్తోంది… నిజమే, అక్కడ శివుడు ఉండటమే కరెక్టు… అక్కడి వరకూ స్మశాన వాటిక నిర్వాహకులు సరిగ్గానే ఆలోచించారు… భగవద్గీత అనగానే చావు దగ్గర వినిపించే మంత్రాలు అన్నట్టుగా దాన్ని మార్చేశారు… నిజానికీ చావుకూ గీతకూ సంబంధం ఏముంది..? అలాగే శివుడికీ స్మశానానికీ లింక్ ఏమిటీ అంటారా..? శివుడొక అఘోరా… స్మశానాల్లో తిరుగుతూ ఉంటాడు, చితాభస్మమే తన అలంకారం… కానీ స్మశానం జనాన్ని స్వాగతించడం ఏమిటీ..? ఆహ్వానించడం ఏమిటీ..? ‘‘రండి, రండి, శవాలకు స్వాగతం, శవాలను మోసుకొచ్చేవారికి స్వాగతం… మళ్లీ మళ్లీ వస్తూ ఉండండి’’ అన్నట్టుగా ఉంది ఇది… పాపం శమించుగాక… ఎక్కువ మంది చావండి, ఎక్కువ మంది వచ్చేయండి అన్నట్టుగా కఠోరంగా కనిపిస్తోంది..,
నిజానికి ఒక శుభకార్యానికి స్వాగతద్వారం వోకే… మళ్లీ మళ్లీ మనం ఇలాంటి శుభాల్నే కలిసి జరుపుకుందాం అని… ఒక ఊరికి, ఒక కట్టడానికి స్వాగతం అంటే, మనస్పూర్తిగా రండి రండి అని ఎదుర్కోళ్లు పలికినట్టు… ఆలింగనం చేసుకున్నట్టు… శుభం కోరుకున్నట్టు… చాలా బళ్లల్లో ఓ నినాదం రాసి ఉంటుంది… Enter To Learn, Leave to Serve అని… చదువు కోసం రండి, సేవ కోసం వెళ్లండి అని… అదొకరకం స్వాగతం… ఒక గుడి ద్వారాలు ప్రవేశించేటప్పుడు స్వాగతం అని చెబుతాయి, తిరిగి వెళ్లిపోయేటప్పుడు… ‘‘పునర్దర్శన ప్రాప్తిరస్తు’’ అని అభిలషిస్తాయి… ఎప్పుడైనా గమనించారా..? పెద్ద పెద్ద గుళ్లకు వెళ్లేటప్పుడు ప్రతి స్వాగత ద్వారమూ అంతే… ఒకవైపు స్వాగతం, మరోవైపు ఈ పునర్దర్శన దీవెన… అసలు స్వాగతం అనే పదం వాడటానికి వీల్లేనివి స్మశానాలు, హాస్పిటళ్లు… ‘‘మీరు మళ్లీ మళ్లీ రండి’’ అంటే అశుభాన్ని కోరుకోవడమే కదా… మరి ఈ స్మశానం స్వాగతకర్తలు ఈమాత్రం ఆలోచించలేదా..? అనేక ’మేళ్ల’ను కోరాల్సిన చెరువు… అనగా… అనేక ఉపయోగాలను ఆకాంక్షించే మంచి పేరున్న ఆ మేళ్లచెరువు ఊరు పేరును చెడగొట్టడమే ఇది…
Ads
గతంలో ఏ చెరువు గట్టునో దహనం జరిగేది… బంధుగణం అక్కడే స్నానాలూ చేసి, మైల వదిలేసి వచ్చేవాళ్లు… కానీ ఇప్పుడా వెసులుబాటు లేదు… స్మశానవాటికలు తప్పనిసరి… డెవలప్‌మెంట్ పేరిట మొక్కలు, చెట్లు, సుందరీకరణ అంటూ నిధులు ధారబోస్తున్నారు… నిజానికి ఒక స్మశానంలో కావాల్సింది సరైన దహనసదుపాయం, శవదోపిడీకి ఆస్కారం లేని రేట్లు, నీటి సౌకర్యం, శవాన్ని అక్కడి వరకూ తీసుకొచ్చే స్వర్గరథాలు (వైకుంఠవాహనం, కైలాసవాహనం అని కూడా పిలుస్తున్నారు)… నిజానికి అక్కడ ద్వారబంధంపై రాయాల్సింది ఏమిటో తెలుసా..? ‘‘కైవల్య ప్రాప్తిరస్తు’’ అని..! లేదా ‘‘కన్నీటి వీడ్కోలు’’ అని..! ‘‘పునర్జన్మ ప్రాప్తిరస్తు’’ అన్నా వోకే… (జన్మరాహిత్యం మరీ విశాలమైన, లోతైన ఉచ్ఛ భావన… దాన్ని సింపుల్‌గా ఇలాంటి ద్వారాలపై అర్థమయ్యేలా చెప్పలేం…) అవునూ, ఈ ద్వారంపై ఏం రాస్తే కరెక్ట్, ఏది ఆప్ట్..!? అసలు ఇంతకుమించిన అలౌకిక ప్రశాంతతను, సర్వ విముక్తిని ఇచ్చే స్థలం ఏముంటుంది..? అందుకని స్వాగతం చెబితేనే కరెక్టు అంటారా..? అది శుభాశీస్సే అనుకోమంటారా..? ఏది కరెక్టు..?!
Share this Article