విరుమాండి… ఈ తమిళ దర్శకుడికి జేజేలు… ఒక విభిన్న సామాజిక కథాంశాన్ని తీసుకుని, రియలిస్టిక్ ధోరణిలో తెరకెక్కించినందుకు..! ఒక ప్రయోగం కాదు అది… ఒక బాధ, ఒక రోదన, ఒక సమస్య, ఒక పోరాటం కథా వస్తువు అయినందుకు… కమర్షియల్ బాటను వీడి, కథను కథలా కన్నీటిని పులిమి ప్రదర్శించినందుకు..! కథలోనికి ఏకంగా ప్రధాని మోడీని కూడా తీసుకొచ్చినందుకు..! ఇంకా హీరోయిన్ల కాళ్లు, తొడల దగ్గరే తచ్చాడుతున్న మా దిక్కుమాలిన తెలుగు సినిమాను చూసుకుని మేమిలాగే ఏడుస్తాం గానీ, నీ తదుపరి వెంచర్లు మరింత సక్సెస్ కావాలి మిత్రమా… అలాగే ఒక విజయ్ సేతుపతిని మెచ్చుకోవాలి… తను ఉన్నది కాసేపు, పక్కా హీరోయిన్ సెంట్రిక్ కథ… ఐనా అంగీకరించి ఈ వైఫ్ ఆఫ్ రణసింగం సినిమాలో నటించినందుకు అభినందనలు మిత్రమా… యువ్వార్ గ్రేట్… అన్నింటికీ మించి చప్పట్లు కొట్టాల్సింది ఐశ్వర్య రాజేష్ కోసం… సాహసివి తల్లీ… దున్నేశావ్… నీకు జాతీయ అవార్డు రాకపోతే దాన్ని అది అవమానించుకున్నట్టే….
ఐశ్వర్య తెలుసు కదా… అప్పట్లో జంధ్యాల సినిమాల్లో హీరోగా నటించిన మన రాజేష్ బిడ్డ… కామెడీ నటి శ్రీలక్ష్మి మేనకోడలు… ఆమధ్య టెడెక్స్లో మాట్లాడుతూ… తన బ్లాక్ షేడ్ వల్ల, తన కుటుంబ దరిద్రం వల్ల తను ఎన్ని అవమానాల్ని ఎదుర్కున్నదో చెబుతుంటే ఓహో కాబోలు అనుకున్నామే తప్ప… నిజంగా తనలో ఓ మంచి నటి దాగుందని అనుకోలేదు… ఆమె ఒక్కతే ఈ ప్రయోగాత్మక సినిమాను భుజాన మోసింది… బోలెడు మెచ్చుకోళ్లు, చప్పట్ల నడుమ…! తను నిజంగానే నాన్-హీరోయిన్ ఆబ్జెక్ట్ ఈరోజుల్లో…. అసలు హీరోయిన్ అంటేనే తెల్లతోలు… చంకలు, బొడ్డు, తొడలు గట్రా ప్రదర్శిస్తూ వెకిలి చూపులు, బాడీ ఊపులు కదా… అవేవీ లేకుండా హీరోయిన్ అంటే ఆశ్చర్యమే… అందుకే ఐశ్వర్య గ్రేట్, ఆమెతో ఈ సినిమా చేయించిన దర్శకుడు డబుల్ గ్రేట్…
Ads
ఓ సగటు ప్రేక్షకుడికి ఈ సినిమా చూస్తున్నంతసేపూ ఆమె కనిపించదు, ఆ పాత్ర కనిపిస్తుంది… డార్క్ షేడ్, కొక్కిరి కింది పలువరుస, పెద్ద అట్రాక్షన్ లేని మొహం… ఇక ప్రదర్శనకు చాన్స్ ఏదీ..? అసలు అలాంటి పాటలు ఉంటేగా… మన దిక్కుమాలిన సామజవరగమన, నీ కాళ్లను పట్టుకుని ఇటువంటి తలకుమాసిన తెలుగు సినిమా పాటల సాహిత్యం మోకరిల్లే దేహమూ కాదాయె… కానీ ఎన్ని ఉద్వేగాల్ని పలికించిందో చూస్తే ఆశ్చర్యం… బొటనవేలు నోట్లో పెట్టుకుని అమ్మ చంకలో ఉండే పిల్లాడు, భర్త శవం కోసం ఎక్కడికైనా సరే పోరాడతాను అంటూ కదిలే కథానాయిక వైఖరి, గల్ఫ్ ఎడారుల్లో ప్రమాదాల అసలు కథలు… మన సిస్టం ఫెయిల్యూర్లు… ఎన్నెన్నో అంశాల్ని టచ్ చేశాడు దర్శకుడు… అన్ని రకాల ఉద్వేగాల్ని సటిల్డ్గా ప్రదర్శించింది ఐశ్వర్య… ఎక్కడా ఓవరాక్షన్ లేదు, ఇనాక్షన్ లేదు… ఆ పాత్రని ఆవాహన చేసుకుంది.,.. ఈ కథనం సినిమా గురించిన రివ్యూ కాదు… మన ఐశ్యర్య గురించి చెప్పడానికే…
నిజం చెప్పొద్దూ… ఐశ్యర్య మొహానికి కాస్త పౌడర్ కూడా పూయలేదు… చివరకు ఆమె ఐబ్రోస్ కూడా సెట్ చేయలేదు… అనేకచోట్ల మనకే ఆశ్చర్యం కలుగుతుంది… అంత రియలిస్టిక్ ధోరణిలో ఉంటయ్ సీన్లు… అంతకన్నా రియలిస్టిక్ నటన ఆమెది… ఆ పాత్ర చేస్తే తనకు భవిష్యత్తులో మైనస్ అవుతుందని ఆమె భయపడలేదు… ఆమెను అలా చూపించడానికి దర్శకుడూ భయపడలేదు… కథ డిమాండ్ చేసింది కాబట్టి చేసిందని అనుకోవద్దు, మన సినిమాల్లో ఎన్ని చూడటం లేదు, పాత్ర ఎంత దరిద్రంగా ఉన్నా… సారీ, ఎంత దరిద్రంలో ఉన్నా సరే… ఫుల్ హైఫై కేరక్టర్లను, స్కిన్ ఎగ్జిబిషన్ కేరక్టర్లను నమ్ముకోవడం లేదు మన దర్శకులు..? ఇదంతా ఇప్పుడు ఎందుకు అంటే..? ఆదివారం జీటీవీవాడు ఈ సినిమా ప్రీమియర్ వేశాడు… నాలుగు రేటింగ్స్ వస్తాయా, రావా అనేది వేరే సంగతి… కానీ వలస వెళ్లిన ఓ కార్మికుడి శవం, దాని కోసం ఓ భార్య పోరాటం కథను కంటతడి వచ్చేలా చిత్రీకరించిన దర్శకుడికి, ఆ పాత్రను అద్భుతంగా మోసిన ఐశ్యర్యకు చప్పట్లు కొట్టకుండా ఎలా ఉండగలం..?!
Share this Article