ఒరేయ్ రిక్షా వంటి పిలుపుల్ని ఇప్పుడు వినడం లేదు, అవి ఎవరూ పడటం లేదు కూడా… అలాగే ఏయ్ రిక్షా, ఏయ్ టాక్సీ డ్రైవర్ అనే పిలుపులూ లేవు, ఎట్ లీస్ట్ బాగా తగ్గిపోయాయ్… డెలివరీ బాయ్స్, కొరియర్ బాయ్స్‌ను కూడా డెలివరీ పార్టనర్స్, కొరియర్ ఏజెంట్స్ అంటున్నాం… కానీ ఒకాయన తనను ఎవరైనా టాక్సీ డ్రైవర్ అని పిలిస్తే గర్వంగా ఫీలవుతాను అంటున్నాడు… ముంబై హ్యూమన్స్ గ్రూపులో షేర్ చేసుకున్నాడు… ఇలా…
నా భార్య గర్భస్రావంతో బాగా బాధపడింది… ఆరోజుల్ని నేనెప్పుడూ మరిచిపోలేదు… అకస్మాత్తుగా ఓ రాత్రి కడుపులో నొప్పితో విలవిలలాడిపోయింది… అప్పటికి చాలా పొద్దుపోయింది… అర్ధరాత్రి కావొస్తోంది… ఒక్కరంటే ఒక్క క్యాబ్ ఆపడం లేదు… ఎంత మొత్తుకుంటున్నా నా మొర వినిపించున్నవారే లేకుండాపోయారు… చిరాకు, కోపం, అసహ్యం నాకు తన్నుకొస్తున్నయ్… కానీ ఏం చేయగలను..? కానీ మనసులో ఓ బలమైన నిర్ణయం తీసుకున్నాను…
అప్పటికి నేను ఎల్ అండ్ టీలో ఇంజినీర్‌ను… ఆ కెరీర్ వదిలేశాను… నమ్మడం లేదా..? నిజం..! ఓ టాక్సీ కొనుక్కున్నాను… ఎవరైనా హాస్పిటల్‌కు వెళ్లే పేషెంట్లు ఆపితే వెంటనే తీసుకుపోతాను, ఫ్రీ.. ఒక్క రూపాయి కూడా తీసుకోను… చాలు, జనరల్ ప్యాసింజర్ల నుంచి నెలకు 10 వేల వరకూ వస్తాయి… కానీ నా లక్ష్యం వేరు… సరిగ్గా అవసరమున్న సమయాల్లో రోగుల్ని హాస్పిటల్స్‌కు చేర్చాలి…
Ads
నా టాక్సీలో ప్రయాణించేవాళ్లు నా కార్డు తీసుకోవచ్చు, నంబర్ సేవ్ చేసుకోవచ్చు, అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా, చివరకు తెల్లవారుజాము 2, 3 గంటలకైనా సరే కాల్ చేయండి, నేను అటెండ్ అవుతాను, అదీ నా హామీ… నేను బతుకుతున్నదే ఈ లక్ష్యంతో… ఓ ఉదాహరణ చెబుతాను మీకు… కొన్ని నెలల క్రితం…
తెల్లవారుజాము రెండు గంటల ప్రాంతంలో… ఇద్దరు వ్యక్తులు రోడ్డు పక్కన నిలబడి ఆటో, టాక్సీ ఏది కనిపించినా ఆపాలని అరుస్తున్నారు… వాళ్ల కళ్లల్లో ఆందోళన… కానీ ఎవరూ ఆపడం లేదు… ఓ పేషెంట్‌ను హాస్పిటల్‌లో దింపి వస్తున్న నేను వాళ్లను చూశాను, సహజంగానే బ్రేకులు వేశాను… వాళ్లతో ఓ మహిళ ఉంది… 75 శాతం కాలినట్టు కనిపిస్తూనే ఉంది… కొందరు టాక్సీ డ్రైవర్లు ఆపి, ఆమెను చూసి ఎందుకొచ్చిన గొడవ అనుకుని గేర్ మార్చి తుర్రుమన్నారు…
నా టాక్సీలో ఉండే ఓ బ్లాంకెట్‌ను ఇచ్చి, ఆమె ఒళ్లు మొత్తం కప్పాల్సిందిగా చెప్పాను… వెహికిల్‌లో కూర్చోబెట్టాక ఏ హాస్పిటల్‌కు అనడిగాను, ఎక్కడ తక్షణం చికిత్స దొరికితే అక్కడికి అన్నారు వాళ్లు… దెయ్యం పట్టినంత వేగంతో ఓ హాస్పిటల్ తీసుకుపోయాను… లక్కీగా అక్కడి స్టాఫ్ వెంటనే అటెండయ్యారు… తరువాత నాలుగైదు రోజులపాటు ఆమె చికిత్స ఎలా జరుగుతున్నదో కనుక్కుంటూనే ఉన్నాను… ఆమె బతికింది… వాళ్లు ఇప్పుడు నా స్నేహితులయ్యారు…
అది 26 జూలై తీవ్ర వరదలు, వర్షాల సందర్భం గానీ, 26/11 నాటి రాత్రి గానీ… నిద్రాహారాలు లేవు నాకు… ఎవరు ఎక్కడికి తీసుకెళ్లమంటే అక్కడికి తీసుకెళ్లాను… నేను అవసరం ఉన్న ప్రతిచోటకూ వెళ్లాను… ప్రతిదీ డబ్బుతోనే ముడిపడి లేదు ఈ లోకంలో… డబ్బే సర్వస్వం కూడా కాదు… నాకు నా పాత ఉద్యోగంతో 65 వేలు వచ్చేవి, బట్ నో ప్రాబ్లం… అప్పటికన్నా ఇప్పుడే బాగా సంతోషంగా ఉన్నాను… ఎందుకో తెలుసా..?
ఇప్పుడు నా వయస్సు 74 ఏళ్లు… 11 భాషలు మాట్లాడగలను… నా పిల్లలు ప్రైవేటు ఈక్విటీ ఫరమ్స్‌లో పనిచేస్తారు… వాళ్లు బాగా ఎదుగుతారు, నాకు ఆ నమ్మకం ఉంది, నేనెవరి మీదా ఆధారపడను… ఈరోజుకూ టాక్సీ తోలుతూనే ఉన్నాను… దాదాపు 500 యమర్జెన్సీ కేసుల్లో నేను రోగుల్ని హాస్పిటల్స్‌కు తీసుకెళ్లి ఉంటాను… నా విశ్వప్రయత్నం… అందరూ బతకాలని ఏమీ లేదు… కానీ బతకడానికి, బతికే పోరాటానికి నేను ఓ తోవ చూపిస్తున్నాను, కాదు, తోవలో తీసుకెళ్తున్నాను… ఉచితంగానే… ఎవరైనా నన్ను ఏయ్ టాక్సీ డ్రైవర్ అని పిలుస్తారా..? ఐ ఫీల్ ప్రౌడ్… నా ఒంటిలో ఓపిక ఉన్నంతవరకూ…!!
Share this Article